Adilabad Market Committees: మార్కెట్ పదవులపై ఆదిలాబాద్ కాంగ్రెస్ నేతల ప్రయత్నాలు.. జోరుగా లాబీయింగ్
Adilabad Market Committees: తెలంగాణలో వ్యవసాయ మార్కెట్ కమిటీలను ప్రభుత్వం రద్దు చేయడంతో కాంగ్రెస్ నేతలకు మార్కెట్ పదవులపై ఆశలు చిగురించాయి.
Adilabad Market Committees: కాంగ్రెస్ పార్టీకి చెందిన అనేక మంది నేతలు మార్కెట్ ఛైర్మన్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. రిజర్వేషన్ల మేరకు నేతలు ఎమ్మెల్యేలను కలిసి తమకు పదవి ఇవ్వాలని కోరుతున్నారు. ఇటీవల మార్కెట్ కమిటీల పాలకవర్గంపై మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు స్పష్టత ఇవ్వడంతో ఆశావహులు ప్రయత్నాలు ప్రారంభించారు.
ఉమ్మడి జిల్లాలో మంచిర్యాల, చెన్నూరు, ఖానాపూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్య ర్థులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. మిగిలిన నియోజకవ ర్గాల్లో పార్టీ నేతలు సూచించిన పేర్లను ఇన్ఛార్జి మంత్రి ప్రతిపాదించే అవకాశం ఉండటంతో స్థానిక నేతలతో కలిసి పదవి పొందేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
గతంలో మాదిరిగా పాలకవర్గ పదవీకాలం రెండేళ్లు ఉండటంతో పాటు ఆరేసి నెలలు రెండు సార్లు పదవీకాలాన్ని పెంచుకునే వీలుందని తెలుస్తుంది. పాలకవర్గం పదవీకాలం మూడేళ్లపాటు కొనసాగే అవకాశం గతంలో మాదిరిగా మార్కెట్ ఛైర్మన్ల పదవులకు రోస్టర్ విధానంతో పాలకవర్గాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఉన్న తాధికారులకు మంత్రి సూచించినట్లు తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లో మార్కెట్ కమిటీ ఛైర్మన్‌ల ఎంపిపై మార్గదర్శకాలు జారీ చేసే వీలుందని మార్కెట్ అధికారులు తెలిపారు.
ఉమ్మడి ఆదిలాబాద్ లో 17 మార్కెట్ లు…
తెలంగాణ వ్యవసాయ మార్కెట్ చట్టం ప్రకారం పాలకవర్గంలో 18 మంది సభ్యులతో పాలకవర్గం ఏర్పాటు చేయాలి. ఇందులో మార్కెట్ కమిటీ పరిధిలో ఉండే రైతులు 12 మంది ఉండాలి. వ్యవసాయ అనుబంధ రంగాల నుంచి కనీసం అయిదుగురు సభ్యులు ఉండాలి. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీవర్గాలు, మహిళలు ఉండాలి.
లైసెన్స్ పొందిన వ్యాపారులు ఇద్దరు, మార్కెట్ పరిధిలోని సహకార సంఘాల నుంచి ఒక సభ్యుడు, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి, వ్యవసా యంతోపాటు అనుబంధ శాఖ అధికా రుల్లో ఒకరు, మార్కెట్ పరిధిలోని పురపాలక ఛైర్మన్ లేదా గ్రామ సర్పంచుల్లో ఒకరు సభ్యుడిగా ఉంటారు.
18 మందితో కూడిన పాల కవర్గం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే, లేదా ఇన్ఛార్జి మంత్రి ఆమోదంతో మార్కెటింగ్ శాఖకు పంపిస్తారు. పాలకవర్గం ఏర్పాటుకు ఆమోదం తెలియచేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు. కమిటీలోని 12 మంది రైతుల్లోనే ఛైర్మన్, వైస్ ఛైర్మన్లు ఉండాలి.
మార్గదర్శకాలు రావాల్సి ఉంది..శ్రీనివాస్, ఏడీ, మార్కెటింగ్ శాఖ,
ప్రభుత్వం మార్కెట్ పాలకవర్గాలను రద్దు చేసింది. కొత్త పాలకవర్గాల ఏర్పాటుపై కొంత సమాచారం ఇచ్చిందని మార్కెటింగ్ శాఖ ఏడీ శ్రీనివాస్ వివరించారు. మార్గ దర్శకాలపై మరింత స్పష్టత రావాల్సి ఉందని, గతంలో ప్రకటించిన రిజర్వేషన్లు, ఇప్పుడు అమలయ్యే వాటిని ఉన్నతాధికారుల పరిశీలనకు పంపించామని ప్రభుత్వ ఉత్తర్వులు రాగానే నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు.
జిల్లాలోని పాలకవర్గాలను రద్దు చేశారు. ప్రస్తుతం పర్సన్ ఇన్ఛార్జీలు కొనసాగు తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో పీసా చట్టం అమలులో ఉండటంతో జైనూర్, ఇంద్రవెల్లి,ఇచ్చోడ మార్కెట్లలో ఎస్టీ సామాజిక వర్గం వారినే నియమించాల్సి ఉంటుందని తెలిపారు.
రిజర్వేషన్ లు ఇలా ఉన్నాయి...
ఆదిలాబాద్- జనరల్, జైనథ్-జనరల్,
ఇచ్చోడ- ఎస్టీ, ఇంద్రవెల్లి- ఎస్టీ, బోథ్-బీసీ,
ఆసిఫాబాద్-బీసీ, బి(మహిళ), కాగజ్నగర్ -ఎస్సీ,
జైనూర్ఎస్టీ, మంచిర్యాల-జనరల్ (మహిళ),
లక్షెట్టిపేట-ఎస్సీ, జన్నారం-ఎస్సీ, బెల్లంపల్లి- ఎస్సీ(మహిళ), భైంసా-జనరల్
నిర్మల్- జనరల్, ఖానాపూర్- ఎస్సీ, సారంగాపూర్- బీసీ, కుభీరు - జనరల్.
(రిపోర్టింగ్ : కామోజీ వేణుగోపాల్, ఉమ్మడి ఆదిలాబాద్)