Nalgonda Congress : పాత వర్సెస్ కొత్త లీడర్లు..! నల్గొండ కాంగ్రెస్ లో రాజుకుంటున్న చిచ్చు
ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో కొత్త, పాత నేతల లొల్లి తెరపైకి వస్తోంది. ముఖ్యంగా 3 నియోజకవర్గాల్లో అసమ్మతి కుంపట్లు రాజుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. తమకు ప్రాధాన్యత ఉండటం లేదన్న భావనలో ద్వితీయ శ్రేణి నాయకులు ఉంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట ఇలాంటి పరిణామాలు ఇబ్బందికరంగా మారాయి.
ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో గుంపుల లొల్లి మొదలైంది. స్థానిక సంస్థలు జరగాల్సి ఉన్న ఈ సమయంలో పార్టీ కేడర్ లో ఏర్పడిన ఈ అభిప్రాయ బేధాలు జిల్లా నాయకత్వాన్ని కొంత ఆందోళనకు గురిచేస్తున్నాయి. సుమారు పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ 2023 చివరలో తెలంగాణలో అధికారంలోకి వచ్చింది.
ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకంగా 11 చోట్ల విజయం సాధించింది. కేవలం సూర్యాపేట అసెంబ్లీ స్థానంలో ఓటమి పాలు కాగా, బీఆర్ఎస్ అక్కడ గెలిచింది. పార్టీ అధికారంలోకి వచ్చి పది నెలలు గడిచిపోయింది. జిల్లా స్థాయిలో ఇంకా పదవుల పంపకం జరగలేదు. సుదీర్ఘ కాలంగా పార్టీకి సేవలు అందించిన సీనియర్లు ఇంకా పదవులకు దూరంగానే ఉన్నారు.
త్వరలోనే జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులుగా, ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులుగా, ఎంపీపీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, అదే మాదిరిగా వచ్చే ఏడాది జనవరిలో జరగాల్సిన మున్సిపల్ ఎన్నికల్లో వార్డు కౌన్సిలర్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా పదవులు పొందే అవకాశం పార్టీ కేడర్ కు ఉంది. ఈ కారణంగానే తమలో అంతర్గతంగా ఎంత అసంత్రుప్తి ఉన్నా అణిచి పెట్టుకుంటున్నారు.
ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, వారి అనుచర నాయకులతో పొసగని వారు అక్కడక్కడ తమ వ్యతిరేకతను ప్రకటిస్తూనే ఉన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఇతర పార్టీ నాయకులతో పాటు, వారి వెంట వచ్చిన కేడర్ తోనే సమస్యలు వస్తున్నాయంటున్నారు.
3 నియోజకవర్గాల్లో అసమ్మతి కుంపట్లు
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాల్లో పదకొండు స్థానాలు కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి. ఇందులో ప్రధానంగా మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. తుంగతుర్తి, నకిరేకల్, మిర్యాలగూడెం నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే వర్గాలు వేరుగా రాజకీయం చేస్తున్నాయి. ముఖ్యంగా నకిరేకల్, తుంగతుర్తి నియోజకవర్గాల్లో పాత, కొత్త కాంగ్రెస్ అంటూ బేధాభిప్రాయాలు వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ముందట బీఆర్ఎస్ నుంచి వచ్చి కాంగ్రెస్ లో చేరిన మందుల సామేలుకు టికెట్ దక్కింది. ఎన్నికల్లో ఆయన యాభై వేల పైచిలుకు ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్ కుమార్ ను ఓడించారు. అయితే, తుంగతుర్తి నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడుగా మారనంత వరకు మాజీ మంత్రి ఆర్.దామోదర్ రెడ్డి ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించారు. అప్పటి నుంచీ ఆయనను నమ్ముకున్న కేడర్, సీనియర్ నాయకులు ఉన్నారు. ఇపుడు ఈ నియోజకవర్గంలో మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నారు.
మందుల సామేలుతో పాటు వచ్చి చేరిన వారు, ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత కలిసి వచ్చిన వారు రెండు గ్రూపులుగా తయారయ్యారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ అన్న విధంగా పరిస్థితి తయారైంది. శనివారం అర్వపల్లి లో డీసీసీ ఉపాధ్యక్షులు యోగానంద చారి ఆధ్వర్యంలో ‘దగాపడ్డ కాంగ్రెస్ నాయకుల్లారా కదలి రండి..’ పేరుతో కీలక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు.
ఈ సమావేశం జరగకుండా పోలీసుల అడ్డంకులు కల్పించారు. నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల ముందస్తు అరెస్టులు కూడా జరిగినట్లు సమాచారం. కొద్ది రోజులుగా ఎమ్మెల్యే మందుల సామేలు తీరుపై సీనియర్ కాంగ్రెస్ నేతలు అసంతృప్తితో ఉండడమే ఈ విభేదాలకు కారణంగా కనిపిస్తోంది.
మరో వైపు మరో ఎస్సీ రిజర్వుడు స్థానమైన నకిరేకల్ లో బహిరంగంగా గ్రూపులు బయటకు కనిపించడం లేదు. కానీ ఎన్నికల ముందట బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచిన వేముల వీరేశం వెంట పార్టీలోకి వచ్చిన వారికి, ముందు నుంచీ కాంగ్రెస్ తో కొనసాగిన వారి మధ్య పొసగడం లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 2018 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిచింది. కానీ, అప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ ను వీడి, బీఆర్ఎస్ లో చేరారు. కానీ, చాలా మంది నాయకులు, ముఖ్య కేడర్ చిరుమర్తితో వెళ్లకుండా కాంగ్రెస్ లోనే ఉండిపోయారు.
2023 ఎన్నికల సమయంలో వీరేశం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి రావడంతో ఆయన వెంట పెద్ద సంఖ్యలోనే బీఆర్ఎస్ కేడర్, వీరేశం సొంత అనుచర వర్గం అంతా కాంగ్రెస్ కు వచ్చారు. ఎన్నికల్లో అంతా కలిసి పని చేసినట్లు కనిపించినా ఇపుడు పాత, కొత్త కేడర్ గా విడిపోయినట్లు సమాచారం. మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్న నాయకులు ఎమ్మెల్యేకు దగ్గర కాలేకపోతున్నారు చెబుతున్నారు.
మిర్యాలగూడెం నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే వర్గం, వ్యతిరేక వర్గంగా కాంగ్రెస్ చీలిపోయినట్లు చెబుతున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బత్తుల లక్ష్మారెడ్డి (బి ఎల్ ఆర్) గెలిచారు. ఈ నియోజకవర్గంపై ముందు నుంచీ సీనియర్ నాయకుడు జానారెడ్డికి మంచి పట్టుంది. ఆయనతో కలిసి నడిచే సీనియర్ నాయకుల సంఖ్య ఎక్కువ.
జానారెడ్డి పెద్ద తనయుడు రఘువీర్ రెడ్డి పార్లమెంటు ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా విజయం సాధించారు. ఆయన మిర్యాలగూడెం కేంద్రంగానే ఎంపీ కార్యాలయాన్ని నిర్వహిస్తూ అక్కడి నుంచి పనిచేసుకుంటున్నారు. కాగా.. కాంగ్రెస్ లోని మెజారిటీ కేడర్ ఆయన వెంట ఉండగా, ఎమ్మెల్యే నామమాత్రం అయ్యారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇక్కడా రెండు గ్రూపులుగా పార్టీ రాజకీయం జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట నియోజకవర్గాల్లో వస్తున్న గ్రూపుల లొల్లి పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపే వీలుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.