Nakrekal Politics : నకిరేకల్ కాంగ్రెస్ లో వీరేశం తుపాన్, టికెట్ కోసం భారీ పోటీ!
Nakrekal Politics : నకిరేకల్ కాంగ్రెస్ లో టికెట్ కోసం భారీగా పోటీ నెలకొంది. ఒక్కో నేతకు ఒక్కో సీనియర్ మద్దతు తెలపడంతో టికెట్ ఎవరికి దక్కుతుందో అన్న టెన్షన్ నెలకొంది. బీఆర్ఎస్ నేత వేముల వీరేశం కాంగ్రెస్ లో చేరితే ఆయనకే టికెట్ దక్కే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది.
Nakrekal Politics : ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం నకిరేకల్ లో రాజకీయ చర్చలు జోరందుకున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. 2018 శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆ తర్వాత బీఆర్ఎస్ లోకి మారడంతో కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ స్థానిక నాయకత్వం లేకుండా పోయింది. పలువురు కాంగ్రెస్ నాయకులు చిరుమర్తి వెంటే కాంగ్రెస్ ను వీడి గులాబీ కండువాలు కప్పుకున్నారు.
నాయకత్వ లేమి
నకిరేకల్ మున్సిపల్ రాజకీయాల్లో ఉన్న నాయకుడు దైద రవీందర్.. నకిరేకల్ వరకే పరిమితమయ్యారు. ఉమ్మడి ఆంధ్రపదేశ్ గా ఉన్నప్పుడు 2009 అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి నకిరేకల్ టికెట్ కావాలని కొండేటి మల్లయ్య కోరుతున్నారు. ఈయన సీనియర్ నాయకుడు కుందూరు జానారెడ్డికి సన్నిహిత అనచరుడిగా ఉన్నారు. నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని నిడమనూరుకు మల్లయ్య జెడ్పీటీసీ సభ్యునిగా కూడా చేశారు. జానారెడ్డి అండతో ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన నకిరేకల్ టికెట్ కావాలని ప్రయత్నించారు. అయితే నల్లగొండ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి 2009 ఎన్నికల్లో తన అనుచరుడు చిరుమర్తి లింగయ్యకు టికెట్ ఇప్పించుకుని ఆ ఎన్నికల్లో గెలిపించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ సిట్టింగ్ అభ్యర్థిగా ఉన్న చిరుమర్తి లింగయ్య ఓటమి పాలయ్యారు. తిరిగి 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచి, గులాబీ కండువా కప్పుకున్నారు. అయితే ప్రతీ ఎన్నికల్లో కొండేటి మల్లయ్య ఇక్కడి టికెట్ ను ఆశిస్తూనే ఉన్నారు. ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ లోకి వెళ్లడంతో తనకు టికెట్ వస్తుందని ఆశించారు. కానీ ఈ లోగా బీఆర్ఎస్ నుంచి టికెట్ రాని మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకుంటారని, ఆయనకే కాంగ్రెస్ టికెట్ రిజర్వు చేశారని తెలియడంతో పార్టీని నమ్ముకున్న వారు ఆందోళన చెందుతున్నారు.
ఒక్కో నేతకు మరో నేత అభయహస్తం
వాస్తవానికి నకిరేకల్ కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేయాలని భావిస్తున్న నాయకుల సంఖ్య భారీగానే ఉంది. జానారెడ్డి అనుచరునిగా ఉన్న కొండేటి మల్లయ్య, కోమటిరెడ్డి అనుచరునిగా ఉన్న దైద రవీందర్, టీపీసీసీ మాజీ చీఫ్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశీస్సులు ఉన్న ప్రసన్న రాజుతో పాటు కొద్ది నెలలుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రోత్సహిస్తున్న సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే వేదాసు వెంకయ్య తనయుడు వేదాసు శ్రీధర్.. వీరందరూ కాకుండా తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ చెరుకు సుధాకర్ భార్య చెరుకు లక్ష్మీ.. వీరంతా కాంగ్రెస్ నుంచి టికెట్ పై ఆశలు పెట్టుకున్న వారే.
కాంగ్రెస్ లో వేముల వీరేశం అలజడి
చివరి నిమిషం దాకా బీఆర్ఎస్ నుంచి తనకే టికెట్ వస్తుందని ఆశించిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశానికి గులాబీ నాయకత్వం షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ నుంచి వచ్చి తమ పార్టీలో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకే టికెట్ ఇవ్వడంతో కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నారు వీరేశం. బీఆర్ఎస్ నాయకత్వంతో విభేదించి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్న వేముల వీరేశం, ఆయన కోటాలో టికెట్ తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. పొంగులేటి అడిగిన రెండు మూడు నియోజకవర్గ టికెట్లలో నకిరేకల్ ఒకటని చెబుతున్నారు. ఈ కారణంగానే భువనగిరి ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా ఒప్పించారని తెలుస్తోంది. ఈ సమాచారం అందుకుంటున్న నియోజకవర్గ ఇతర నేతలు , బీఆర్ఎస్ లో టికెట్ రాని వారిని తీసుకుని వెంటనే వారికెలా టికెట్ ఇస్తారని, ముందు నుంచీ పార్టీలో ఉన్న తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.