Dengue Cases : తెలంగాణ వైద్యారోగ్య శాఖ అలర్ట్‌ ... డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి...!-dengue cases are on rise in telangana health dept report details read here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Dengue Cases : తెలంగాణ వైద్యారోగ్య శాఖ అలర్ట్‌ ... డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి...!

Dengue Cases : తెలంగాణ వైద్యారోగ్య శాఖ అలర్ట్‌ ... డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి...!

Maheshwaram Mahendra Chary HT Telugu
Jul 06, 2024 09:41 AM IST

Dengue Cases in Telangana: తెలంగాణలో డెంగ్యూ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. జూన్ నెలలో మొత్తం 263 డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

తెలంగాణలో పెరుగుతున్న డెంగ్యూ కేసులు
తెలంగాణలో పెరుగుతున్న డెంగ్యూ కేసులు (image source unsplash.com/)

Dengue Cases in Telangana:  వర్షాకాలం వచ్చిందంటే దోమల బెడద పెరుగుతుంది, వాటితో రోగాలు పెరుగుతాయి. గత కొద్దిరోజులుగా తెలంగాణలో   డెంగ్యూ కేసుల సంఖ్య పెరుగుతోంది. వర్షాలు కురుస్తుండటంతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. రాష్ట్రంలో గత నెల జూన్ లో మొత్తం 263 డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక 9 మలేరియా కేసులు రికార్డు అయినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది.

గతేడాదితో పోల్చితే ఈ ఏడాది డెంగ్యూ పాజిటివ్ కేసులు స్వల్పంగా తగ్గాయని పేర్కొంది. సీజనల్ వ్యాధులు విజృంభించేందుకు అనుకూలమైన వాతావరణం ఉన్న నేపథ్యంలో…. అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ఆదేశించింది.

గతేడాది జూన్ లో తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 284 కేసులు నమోదు కాగా... ఈ ఏడాది జూన్ లో 263 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. గతేడాదితో పోల్చితే 21 కేసులు తగ్గాయి. ఇక గతేడాది జూన్ లో మొత్తం 14 మలేరియా కేసులు నమోదవ్వగా.. గత నెల జూన్ లో కేవలం 9 కేసులు రికార్డయ్యాయి. అయితే ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో…  కేసుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి.

డెంగ్యూ కేసులు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో…. మానవ వనరులు, మందులు, ఔషధాల లభ్యతపై దృష్టి పెట్టాలని ఆరోగ్యశాఖ… జిల్లా అధికారులకు సూచించింది. రోజువారీ కేసు రిపోర్టింగ్ తో పాటు అవగాహన కార్యక్రమాలకు సంబంధించి జిల్లా అదనపు కలెక్టర్లతో పాటు పంచాతయతీ కార్యదర్శులతో సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలని వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఆదేశించారు.

మరోవైపు అన్ని ప్రైవేటు ఆస్పత్రుల నుంచి డెంగ్యూ కేసుల వివరాలను సేకరిస్తున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. దోమల ఉత్పత్తిని అరికట్టేందుకు 10 నుంచి 15 రోజులకు ఒకసారి ఫాగింగ్‌ చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఫాగింగ్‌ లాగ్‌బుక్స్‌ను సక్రమంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

డెంగ్యూ కూడా దోమల ద్వారా సంక్రమించే వ్యాధి. ప్రత్యేకంగా ఏడిస్ ఈజిప్టి అనే దోమ కాటు ద్వారా వ్యాప్తి చెందుతుంది, ఈ దోమలు రాత్రి కంటే కూడా పగటిపూట ఎక్కువ దాడి చేస్తాయి. కాబట్టి పగటివేళలో కుట్టే దోమలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సాధారణంగా చెప్పలేని జ్వరం, నిరంతర తలనొప్పి, కళ్ళలో నొప్పి (కనురెప్పల చుట్టూ), ఒళ్లు నొప్పులు, మంటతో కూడిన కీళ్ల నొప్పులు, అనారోగ్యానికి గురైన కొద్ది రోజులలో దద్దుర్లు కనిపించడం వంటి లక్షణాలు ఉంటాయి. అదనంగా నిరంతర వాంతులు, చిగుళ్లలో రక్తస్రావం, సులభంగా గాయాలు, కడుపు నొప్పి వంటి ఇతర సూచికలను గమనించాలి. ఈ లక్షణాలలో ఏవైనా వ్యక్తమైతే, తక్షణ వైద్య సహాయం తీసుకోవడం అత్యవసరం అని డాక్టర్లు చెబుతున్నారు.

దోమకాటుకు గురికాకుండా ఉండేందుకు శరీరాన్ని నిండుగా కప్పి ఉంచే దుస్తులు, ఫుల్ స్లీవ్‌లు ధరించాలని సూచిస్తున్నారు. అలాగే శరీరానికి దోమల వికర్షక క్రీములు కూడా రాసుకోవాలని, ఇంటి పరిసరాల్లో దోమలు వృద్ధి చెందకుండా ఉండేందుకు నీరు నిల్వకాకుండా చూసుకోవాలని చెబుతున్నారు. దోమల నివారణ మందులు, దోమతెరలు వాడాలని సూచించారు.

Whats_app_banner