T Congress : బీఆర్ఎస్ ను గద్దె దించేందుకే కాంగ్రెస్ లో చేరుతున్నా, రాహుల్ గాంధీతో భేటీ తర్వాత పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
Telangana Congress : మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ మంత్రి జూపల్లితో సహా కాంగ్రెస్ నేతలు దిల్లీలో రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. జులై 2న ఖమ్మంలో జరిగే సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించారు.
Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్ నేతలు దిల్లీలో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశం అయ్యారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌కు చెందిన దాదాపు 35 మంది నేతలు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీని వీడిన పలువురు నేతలు తిరిగి సొంతగూటికి చేరుతుండటం సంతోషంగా ఉందని రాహుల్ గాంధీ అన్నారని కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఘర్ వాపసీ కార్యక్రమం విజయవంతంగా జరుగుతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుందని అందుకు పార్టీ నేతలు సమష్ఠిగా కృషి చేయాలని రాహుల్ గాంధీ అన్నట్లు నేతలు పేర్కొన్నారు. "కేసీఆర్ హఠావో తెలంగాణ బచావో" అనే నినాదంలో పార్టీ నేతలు ముందుకెళ్లాలని రాహుల్ గాంధీ సూచించారన్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, కేసీ వేణుగోపాల్, జానారెడ్డి, షబ్బీర్ అలీ, మధుయాష్కీతోపాటు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అరికెల నర్సారెడ్డి, గురునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో జులై 2 ఖమ్మంలో జరిగే సభలో పార్టీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ దిల్లీలో ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని వీరిద్దరూ వారిద్దరు కలిశారు. జులై 2న ఖమ్మంలో నిర్వహించనున్న సభకు రావాలని రాహుల్ గాంధీని టీపీసీసీ నేతలు ఆహ్వానించారు. ఆ సభలో పొంగులేటి, జూపల్లి సహా మరింత మంది నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నిజామాబాద్ మాజీ ఎమ్మెల్సీ అరికెలా నర్సారెడ్డి, ఇతర నేతలు గుర్నాథ్ రెడ్డి, ముద్దప్పా దేశ్ ముఖ్, కిష్టప్ప హస్తం పార్టీలో చేరనున్నారు.
జులై 2న ఖమ్మంలో కనీవినీ ఎరుగని సభ
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నప్పటికీ అనుకున్న అభివృద్ధి జరగలేదని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పాలనపై విమర్శలు చేశారు. అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానన్న ఆయన... జులై 2న పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రం ఏర్పడినా తెలంగాణ బిడ్డలు ఏం కోరుకున్నారో అవి జరగలేదని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం అవినీతి వల్ల ప్రజలకు దక్కాల్సినవి దక్కడం లేదన్నారు. మోసపూరిత హామీలతో ప్రజలను మభ్యపెట్టి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. జులై 2 ఖమ్మంలో కనీవినీ ఎరుగని సభ నిర్వహిస్తామన్నారు. కేసీఆర్ కు అధికారం ఇచ్చినందుకు రాష్ట్రంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ దెబ్బతీశారని విమర్శించారు. తనను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారనో, పదవుల కోసమే తాను పార్టీ మారడంలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకే కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు పొంగులేటి స్పష్టం చేశారు. పదవులు ఇవ్వలేదని బీఆర్ఎస్ నుంచి బయటకు రాలేదన్నారు. బీఆర్ఎస్‌ను గద్దె దించేందుకే పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వెల్లడించారు. తనకు పదవులు ముఖ్యం కాదన్న ఆయన... పదవుల కంటే తనకు ఆత్మాభిమానమే ముఖ్యమని తెలిపారు. ఓ దశలో ప్రాంతీయ పార్టీ పెట్టాలని భావించినా...కొత్త పార్టీతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందని భావించి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.