Rain Alert : అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
పశ్చిమ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 48 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశాలున్నాయి. ఈ ప్రభావంతో నేడు ఉత్తర, దక్షిణకోస్తా, రాయలసీమకు వర్ష సూచనలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
హైదరాబాద్‌లో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండగా నేడు కూడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. మిగిలిన జిల్లాలోనూ భారీ వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది.
కర్ణాటక, దక్షిణ తెలంగాణ, ఉత్తర కోస్తా మీదుగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం వరకు ద్రోణి కొనసాగుతుండడమే వర్షాలకు కారణమని వాతావరణ శాఖ వివరించింది. అల్పపీడన ప్రభావంతో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. గురువారం హైదరాబాద్‌లోని కాప్రాలో గరిష్ఠంగా 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో అత్యల్పంగా 6.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
భారీ వర్షాలకు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరిందని అధికారులు తెలిపారు. హైదరాబాద్ జంట రిజర్వాయర్ల గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఉస్మాన్‌సాగర్ నుంచి 2 గేట్లు, హిమాయత్‌సాగర్ నుంచి 2 గేట్లు ఎత్తినట్లు అధికారులు చెప్పారు. ఉస్మాన్‌సాగర్ ఇన్‌ఫ్లో 600, ఔట్‌ఫ్లో 422 క్యూసెక్కులు, హిమాయత్‌సాగర్ ఇన్‌ఫ్లో 500, ఔట్‌ఫ్లో 678 క్యూసెక్కులుగా ఉంది. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
హైదరాబాద్‌లో రెండు రోజుల నుంచి అకస్మాత్తుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రాత్రి రెండు గంటలపాటు ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి నగరంలోని ప్రధాన రోడ్లన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అంతేకాదు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు.
సముద్రంలోకి కృష్ణా జలాలు....
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు వరద వచ్చి చేరింది. ప్రాజెక్టు నుంచి 22 గేట్లు ఎత్తి నీటి దిగువకు విడుదల చేశారు. ఇన్‌ఫ్లో 3.92 లక్షల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 4.33 లక్షల క్యూసెక్కులుగా ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590, ప్రస్తుతం 588 అడుగులు ఉందని అధికారులు తెలిపారు. నాగార్జునసాగర్ పూర్తి నీటినిల్వ 312, ప్రస్తుతం 309 టీఎంసీల నీరు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి, 65 గేట్లు ఎత్తివేత - ప్రకాశం బ్యారేజీ ఇనో ఫ్లో, ఔట్ ఫ్లో 4.06 లక్షల క్యూసెక్కులు - నేడు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం వరద ప్రభావిత ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు