Khammam Visible Policing: విజిబుల్ పోలిసింగ్ తో నేరాల నియంత్రణ..ఖమ్మంలో భారీగా కేసుల నమోదు
Khammam Visible Policing: చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, అక్రమ రవాణాలకు ముకుతాడు వేసేందుకు ఖమ్మం జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపట్టింది.
Khammam Visible Policing: చట్ట వ్యతిరేక శక్తులను కట్టడి చేసేందుకు పోలీస్ కమిషనరేట్ పరిధిలో విస్తృత తనిఖీల వేగం పెంచారు. విజబుల్ పోలీసింగ్ పటిష్టంగా అమలు చేస్తేనే నేరాలు నియంత్రణ సాధ్యమని భావించి ఖమ్మం పోలీసులు చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఆకస్మిక తనిఖీలు, సోదాలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణ సరిహద్దు రాష్ట్రాల మీదుగా గంజాయి, రేషన్ బియ్యం, ఇసుక వంటి అక్రమ రవాణాను అరికట్టడానికి జిల్లా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు పోలీస్ యంత్రాంగం వాహన తనిఖీలను ముమ్మరం చేశారు.
ఇటీవల పొరుగు రాష్ట్రాల నుంచి భద్రాద్రి కొత్తగూడెం మీదుగా ఖమ్మం చేరుకుని హైదరాబాద్ తరలుతున్న గంజాయి పెద్ద ఎత్తున పట్టుబడిన క్రమంలో ఖమ్మం జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్లను కమిషనర్ ఎలర్ట్ చేశారు. ఇందులో భాగంగానే తనిఖీలు చేపడుతూ రవాణా శాఖ నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలు,
ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలపై కేసులు నమోదు చేయడంతో పాటు జరిమానాలు విధిస్తున్నారు. అలాగే రోడ్లపై తోటి వాహనదారులను భయబ్రాంతులకు గురి చేసేవిధంగా ర్యాష్ డ్రైవింగ్ కు పాల్పడినా, ఇతరులకు అసౌకర్యం కలిగేలా బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించినా, మద్యం తాగి వాహనాలు నడిపినా అలాంటి వారిపై ఎలాంటి రాజీ లేకుండా e-petty కేసులు నమోదు చేస్తున్నారు.
ఈ ఏడాది రెండు నెలల వ్యవధిలో జనవరి, ఫిబ్రవరి నెలల్లో 4822 e-petty కేసులు నమోదు కాగా ఇప్పటికీ 1014 కేసుల్లో న్యాయస్థానం జరిమానా విధించడం జరిగింది. మరో 3354 కేసుల్లో చార్జిషీట్ దాఖలు చేశారు. అదేవిధంగా దొంగతనాలు జరగకుండా పాత నేరస్తుల కదలికలను కట్టడి చేసేలా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసు అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
అనుమానిత వ్యక్తులు గాని, వాహనాలు గాని తారసపడితే వాటి గురించి పూర్తి వివరాలను సేకరించి ఎలాంటి నేర ప్రవృత్తికి పాల్పడటంలేదని నిర్ధారించుకున్నాకే వారికి ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తున్నారు.
(రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం)