Khammam News : నెంబర్ ప్లేట్ లేకుండా రోడ్డెక్కితే కేసులే, ఖమ్మంలో 44 వాహనాలు సీజ్!
Khammam News : నెంబర్ ప్లేట్ లేని, ట్యాంపరింగ్ చేసి ఖమ్మంలో చక్కర్లు కొడుతున్న 44 వాహనాలను ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. వాహనదారులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Khammam News : నెంబర్ ప్లేట్ (Number Plates)లేకుండా ఖమ్మం నగరంలో చక్కర్లు కొడుతున్న 44 వాహనాలు సీజ్ చేసినట్లు ఖమ్మం(Khammam) ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. జిల్లా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు నగరంలో నిబంధనలు అతిక్రమించి రోడ్లపై నడుపుతున్న వాహనాలపై నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్ తనిఖీలో భాగంగా మంగళవారం ప్రధాన కూడళ్లలో నెంబరు లేకుండా, రిజిస్టర్ లేకుండా హల్చల్ చేస్తున్న వాహనాలపై కేసులు నమోదు చేసి జరిమానా విధించినట్లు తెలిపారు. నెంబరు ప్లేట్ ట్యాంపరింగ్ చేసిన ఒక స్పోర్ట్స్ బైక్ పై కేసు నమోదు చేసేందుకు ఖమ్మం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లకు తరలించినట్లు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడుపుతున్న వారు చలనాల నుంచి తప్పించుకోవడంతో పాటు ట్రాఫిక్ పోలీసులు గుర్తించకుండా ఉండేందుకు రిజిస్ట్రేషన్ నంబర్ లోని టీఎస్, ఏపీ అక్షరాలతో పాటు చివరి రెండు నంబర్లు కనిపించకుండా స్టిక్కర్స్, ప్లాస్టర్స్, మాస్క్ లు వేస్తున్నారని తెలిపారు.
కేసులు నమోదు
కొన్ని వాహనాలకు ముందు నంబర్ ప్లేట్ కరెక్ట్ గా ఉన్నప్పటికీ వెనుక నంబర్ ప్లేట్ మాత్రం బెండ్ చేస్తున్నారని ట్రాఫిక్ ఏసీపీ తెలిపారు. ఇలాంటి రాంగ్ నెంబర్ ప్లేట్లతో రోడ్లపై ఇష్టమొచ్చినటుగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారని పేర్కొన్నారు. నంబర్ లేని బైక్స్ పై చైన్ స్నాచర్లు(Chain Snachers) నేరాలు చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. నంబర్ ప్లేట్ లేని, నిబంధనలకు విరుద్ధంగా వికృతమైన నంబర్ ప్లేట్‌లను కలిగిన వాహనాలపై 420/511, మోటార్ వెహికల్ చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి నెలలోనే 203 వాహనాలకు జరిమానా విధించామనని, మళ్లీ పునరావృతం అయితే తిరిగి అవే కేసులు నమోదు చేస్తునట్లు తెలిపారు. వాహనదారులు తమ వాహనాలకు నెంబర్ ప్లేట్లను మోటార్ వాహన చట్టానికి అనుగుణంగా ఏర్పాటు చేసుకుని పోలీసులకు సహకరించాలని లేని పక్షంలో కేసులు తప్పవని హెచ్చరించారు.
రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం