Karimnagar : కరీంనగర్ లోని హోటల్ లో పోలీసుల తనిఖీలు - రూ. 6 కోట్ల నగదు సీజ్
Cash seized in Karimnagar: కరీంనగర్ లో రూ. 6 కోట్ల నగదును సీజ్ చేశారు పోలీసులు. తనిఖీల్లో ఐటీ అధికారులు కూడా పాల్గొన్నారని కరీంనగర్ ఏసీపీ వెల్లడించారు.
Cash seized in Karimnagar : ఎన్నికల వేళ తెలంగాణ పోలీసులు అప్రమత్తమవుతున్నారు. నగదును తరలించే అవకాశం ఉన్న నేపథ్యంలో…. సోదాలకు దిగింది. తాజాగా కరీంనగర్ సిటీలోని ప్రతిమ మల్టిపెక్ట్స్ హోటల్ లో తనిఖీలు చేపట్టారు పోలీసులు. ఐటీ అధికారులతో కలిసి సోదాలు చేయగా… రూ. 6 కోట్ల నగదు పట్టుబడింది. ఇందుకు సంబంధించిన ప్రాథమిక వివరాలను కరీంనగర్ ఏసీపీ నరేందర్ వెల్లడించారు.
శుక్రవారం అర్ధరాత్రి తర్వాత 1.30 గంటల సమయంలో ఈ సోదాలు జరిగాయి. ఈ హోటల్ బీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎంపీ బంధువుదిగా గుర్తించారు. మొత్తం 6,67,32,050 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంంబంధించిన సరైన పత్రాలు లేవని పోలీసులు వెల్లడించారు. పూర్తి విచారణ తర్వాత వివరాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు.
ఉదయం వరకు సోదాలు….
కరీంనగర్ ఏసీపీ ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి. పోలీసులను మోహరించి మల్టీప్లెక్స్ లో తనిఖీలు నిర్వహించారు. అట్టపెట్టెల్లో తరలించేందుకు సిద్దం చేసిన ఆరు కోట్ల 65 లక్షల నగదు సీజ్ చేశారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం వరకు కూడా ఈ తనిఖీలు జరిగాయి. అయితే ఈ డబ్బు ఎవరిది?.. ఎక్కడి నుంచి వచ్చింది?.. ఎటు తీసుకు వెళ్తున్నారనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
ఈ హోటల్ లో కార్యాలయం నుంచే బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ రాజకీయ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ డబ్బు… సదరు ఎంపీకి చెందినదేనా అన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరికొద్దిగంటల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడుతున్న తరుణంలో… భారీ మొత్తం క్యాష్ సీజ్ చేయటం సంచలనంగా మారింది. సోదాల్లో దొరికిన 6 కోట్ల 65 లక్షల నగదు సీజ్ చేశామని, పట్టుబడ్డ డబ్బులను కోర్టులో డిపాజిట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు. ఆధారాలు ఉంటే విడుదల చేస్తామన్నారు.