TG Cold Wave Alert : తెలంగాణలో గణనీయంగా తగ్గుతున్న ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు కోల్డ్ వేవ్ అలర్ట్
TG Cold Wave Alert : తెలంగాణపై చలి పంజా విసురుతోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు చలితో వణికిపోతున్నాయి. ఉదయం 9 దాటినా బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. చలితోపాటు.. ఈదురు గాలులు రావడంతో.. ప్రజలు వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో.. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
తెలంగాణలో డిసెంబర్ 12 నుండి 14 వరకు ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని.. భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు చలిగాలుల హెచ్చరికను జారీ చేసింది. ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లోని పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. డిసెంబర్ 16 వరకు 4 నుండి 10 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలకు నమోదు కావొచ్చని ఆరెజ్ హెచ్చరిక జారీ చేసింది.
ఐఎండీ ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గుతాయి. పొడి వాతావరణం కొనసాగుతుండగా.. శీతాకాలపు చలి తీవ్ర తరం అవుతుందని ఐఎండీ అంచనా వేసింది. గురువారం, ఆదిలాబాద్‌లోని బేలాలో రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత 7 డిగ్రీలుగా నమోదైంది. ఇటు హైదరాబాద్ సమీపంలోని బీహెచ్ఈఎల్ ఏరియాలో కనిష్టంగా 10.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ఆదిలాబాద్‌లో ఉష్ణోగ్రతలు తగ్గుతూనే ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో గురువారం 7.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అంతకుముందు రోజు 9.7గా ఉంది. మైదాన ప్రాంతాలతో పోలిస్తే కొండ ప్రాంతాలు 1 నుంచి 2 డిగ్రీల వరకు చల్లగా ఉంటాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. రాబోయే 48 గంటల్లో హైదరాబాద్‌లో ఉదయం పూట పొగమంచు కురుస్తుందని అధికారులు చెబుతున్నారు. ఆకాశం మేఘావృతమైన ఉంటుందని అంచనా వేశారు.
ఏపీలో స్కూళ్లు బంద్..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల చిరు జల్లులు కురుస్తున్నాయి. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు, నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో పరివాహక ప్రాంతాల ప్రజలు, లోతట్టు ప్రాంతాలవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాలకు కాళంగి రిజర్వాయర్, అరణియార్ ప్రాజెక్ట్ నుండి నీటిని విడుదల చేశారు. జిల్లాలోని మిగిలిన ప్రాజెక్టుల్లోనూ.. డ్యామ్‌లలోనూ పూర్తిస్థాయిలో నీటి నిలువ చేరుకున్నాయి. భారీ వర్షాలు.. వాగులు వంకల పొంగిపొర్లుతోన్న నేపథ్యంలో తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ జిల్లాల పరిధిలోని స్కూళ్లు, కాలేజీలు, అంగన్‌వాడీ సెంటర్లు మూతపడ్డాయి.