Datta Jayanthi: దత్త జయంతి ఎప్పుడు? తేదీ, కథ, ప్రాముఖ్యతతో పాటు పాటించాల్సిన ఆచారాలు తెలుసుకోండి-date story significance and rituals of datta jayanthi festival ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Datta Jayanthi: దత్త జయంతి ఎప్పుడు? తేదీ, కథ, ప్రాముఖ్యతతో పాటు పాటించాల్సిన ఆచారాలు తెలుసుకోండి

Datta Jayanthi: దత్త జయంతి ఎప్పుడు? తేదీ, కథ, ప్రాముఖ్యతతో పాటు పాటించాల్సిన ఆచారాలు తెలుసుకోండి

Ramya Sri Marka HT Telugu
Dec 13, 2024 12:00 PM IST

Datta Jayanthi: త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శివుడు కలిసి దత్తాత్రేయుడి అవతారంలో జన్మించిన రోజును దత్త జయంతిగా జరుపుకుంటారు. ఈ రోజు గురు దత్తాత్రేయుడిని పూజిస్తే జ్ఞానం, వివేకం, ధార్మికత, భక్తి, ఆత్మవిశ్వాసం కలుగుతాయని విశ్వాసం.

దత్తాత్రేయ జయంతి 2024
దత్తాత్రేయ జయంతి 2024

హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులైన త్రిమూర్తుల ఏకైక రూపం దత్తాత్రేయుడు. మార్గశిర పౌర్ణమి రోజున త్రిమూర్తులు దత్తాత్రేయ అవతారంలో జన్మించారు. అందుకే ప్రతియేటా మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమిని దత్త జయంతి పండుగగా జరుపుకుంటారు. ఈ రోజును చాలా పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు. దత్త జయంతి రోజున గురు దత్తుడిని పూజించడం వల్ల త్రిమూర్తుల అనుగ్రహం లభిస్తుందనీ, భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరతాయని నమ్మిక.ప్రపంచానికి ధార్మిక, ఆత్మవిశ్వాసం, భక్తి జ్ఞానాన్ని అందించిన భగవంతుడు దత్తాత్రేయుడు కనుక ఈయన్ని గురుదత్తాత్రేయుడిగా పిలుస్తారని పురాణాల్లో పేర్కొన్నారు. దత్త జయంతి రోజున ప్రత్యేక పూజలు చేయడం వల్ల భక్తులకు ఆరోగ్యం, ధనం, భక్తి, ధార్మిక జ్ఞానం, శాంతి ప్రసాదించబడతాయని నమ్మిక.

దత్త జయంతి తేదీ..

వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఏడాది మార్గశీర మాసంలో పౌర్ణమి డిసెంబర్ 14 సాయంత్రం 4:58 గంటలకు ప్రారంభమై డిసెంబర్ 15 మధ్యాహ్నం 2:31 గంటలకు ముగుస్తుంది. డిసెంబర్ 14న దత్త జయంతిని జరుపుకుంటారు.

దత్త జయంతి కథ..

పురాణాల ప్రకారం అత్రి అనే మహర్షి భార్య అయిన అనసూయ చాలా పవిత్రమైన, ధర్మబద్దమైన స్త్రీ. ఒకానొక సందర్భంలో ఆమె త్రిమూర్తులతో సమానమైన కుమారుడిని పొందడానికి తపస్సు చేసింది. దానికి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మమేశ్వరులు ప్రసస్నం అయ్యారు. కానీ త్రిమూర్తుల భార్యలైన సరస్వతి, లక్ష్మీ, పార్వతులు అనసూయను చూసి అసూయ పడ్డారు. ఆమె ధర్మాన్ని పరీక్షించాలని త్రిమూర్తులను కోరారు. దీంతో వారు సాదువుల వేషంలో అనసూయ వద్దకు వచ్చారు. బిక్షం వేయమని అడిగారు. కానీ ఆ భిక్షం నగ్నంగా వేస్తేనే స్వీకరిస్తామని అన్నారు. దీంతో కోపానికి గురైన అనసూయ సాధువుల రూపంలో ఉన్న త్రిమూర్తులను తన తపో బలంతో పసిబిడ్డలుగా మార్చేసింది. పసిపిల్లలుగా ఉన్న వారికి నగ్నంగా భిక్షాటన చేసింది(వారికి పాలిచ్చింది.ఆ సమయంలో ఆశ్రమానికి వచ్చిన అనసూయ భర్త అత్రి మహర్షి ఆ ముగ్గురిని దగ్గర చేసి మూడు తలలు, ఆరు చేతులు కలిగిన ఒకే శిశువుగా మార్చాడు.

ఇదంతా తెలుసుకున్న త్రిమూర్తుల సతీమణులు తమ భర్తల కోసం అత్రి, అనసూయల వద్దకు వచ్చారు. ఆమె క్షమించమని , తమ భర్తలకు తమకు తిరిగి ఇవ్వమని వేడుకున్నారు. వారి అభ్యర్థనను అంగీకరించి అనసూయ త్రిమూర్తులను తిరిగి సహజ రూపంలోకి మార్చింది. అప్పుడు త్రిమూర్తులు అనసూయ కోరికకు తగ్గట్టుగా త్రిమూర్తులకు సమానమైన కొడుకును ముగ్గురి అంశలను కలిగి కుమారుడిని ప్రసాదించారు. ఆయనే దత్తాత్రేయుడు.

దత్త జయంతి రోజున పాటించాల్సిన ఆచారాలు..

ఆ రోజున గంగలో పవిత్ర స్నానం చేయడం శుభాన్ని కలిగిస్తుంది. లేదంటే స్నానం చేసే నీటిలో గంగాజలం కలుపుకోవచ్చు.సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. అలాగే దత్త జయంతి రోజున దత్తాత్రేయ స్వామికి పూలు, ధూప, దీప నైవైద్యాలు, నీటితో పంచోపచార పూజ చేయడం అత్యంత శుభదాయకం. ఉపవాస దీక్ష చేసేవారు ఈ రోజు దత్తాత్రేయ భగవానుడి కథ, భోదనలను వినాలి. దత్తాత్రేయ మంత్రాన్ని పఠించాలి. ఈ రోజున దత్త భగవానుడికి ఇష్టమైన ఆవులు, కుక్కలను పూజించడం కూడా అత్యంత పవిత్రమైన కార్యంగా చెబుతారు. ఈ రోజు భక్తి శ్రద్ధలతో దత్త భగవానుడిని పూజించడం, దత్త క్షేత్రాలను సందర్శిచడం వల్ల భక్తుల పాపాలు తొలగిపోయి జీవితం సకల ఐశ్వర్యాలు, సుఖసంతోషాలతో నిండిపోతుందని విశ్వాసం.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner