Cyclone Fengal School Holidays : ఫెంజల్ తుపాను ప్రభావం.. సోమవారం స్కూళ్లకు సెలవులు ఉన్నాయా?
Cyclone Fengal Holidays : ఫెంజల్ తుపాను ప్రభావం భారీగా ఉంది. దీంతో తమిళనాడు, పుదుచ్చేరిలో తీవ్రమైన వర్షాలు కురుస్తున్నాయి. ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పాఠశాలలకు సెలవు ఉందా లేదా? అనేది చాలా మందికి సందిగ్ధంగా ఉంది.
ఫెంజల్ తుపాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావం తమిళనాడు, పుదుచ్చేరిపై కొనసాగుతోంది. అనేక జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలను మూసివేశారు. తమిళనాడులోని విల్లుపురం, తిరువళ్లూరు, కడలూరు, తంజావూరు, రామనాథపురం సహా తొమ్మిది జిల్లాల్లో పాఠశాలలు ఇప్పటికే మూసివేశారు. కొన్ని ప్రాంతాలలో మూసివేతలను అధికారులు ధృవీకరించినప్పటికీ హాలీడే కొనసాగే అవకాశం ఉంది. చెన్నైలోని పాఠశాలలకు సెలవుల గురించి ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన లేదు.
తమిళనాడులో ఫెంజల్ తుఫాను విధ్వంసం కొనసాగుతోంది. భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు సహా తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. పరిస్థితి విషమించడంతో రేపు డిసెంబర్ 2 పాఠశాలలకు సెలవు ప్రకటిస్తారా లేదా అని తల్లిదండ్రులు, విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సోమవారం సెలవు ప్రకటించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం లేదా విద్యా శాఖ నుండి ఎటువంటి ప్రకటన లేదు. కానీ దాదాపు సెలవు దినంగానే ఉండనుంది. ఎందుకంటే పరిస్థితులు ఇంకా చక్కబడలేదు. వర్షం పరిస్థితి త్వరగా మెరుగుపడక కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలు మూతపడే అవకాశం ఎక్కువగా ఉంది.
ఉదయం వెలువడే వాతావరణ సూచనపై సెలవు ఉంటుందా అనేది ఆధారపడి ఉంటుందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని, తదనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. తల్లిదండ్రులు, విద్యార్థులు.. విద్యా శాఖ, రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లు, సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను నిశితంగా గమనించాలి.
అవసరమైతే తప్ప బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. బయటికి వెళ్లకుండా ఉండాలని తెలిపింది. స్థానిక అధికారుల ఆదేశాలను అనుసరించాలని వెల్లడించింది. వరదలు ఉన్న రోడ్ల వైపు వెళ్లవద్దని ఐఎండీ పేర్కొంది.
తుపాను ప్రభావంపై దృష్టి సారించేందుకు అధికారులు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. చెన్నై, తిరువారూర్, కడలూరు, నాగపట్నం వంటి హైరిస్క్ ప్రాంతాలకు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF), జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) నుండి బృందాలను మోహరించాలని ప్రభుత్వం ఆదేశించింది.
మరోవైపు భారత వాతావరణ విభాగం (IMD) ఏపీ, తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఇప్పటికే హైదరాబాద్, ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. ఇంకోవైపు బెంగళూరుతో సహా కర్ణాటకలో భారీ వర్షాలు కురిసే హెచ్చరికలను జారీ చేసింది ఐఎండీ. పాఠశాలలు, కళాశాలలు ఇంకా అధికారికంగా సెలవులు ప్రకటించలేదు.