Gulab jamun: ఎర్ర దుంపలతో గులాబ్ జామ్ చేసేయండి, ఎంతో ఆరోగ్యం టేస్టీ కూడా
Gulab jamun: గులాబ్ జామూన్ అంటే ఎంతో మందికి ఇష్టం. చలికాలంలో అధికంగా దొరికే చిలగడదుంపలతో రుచికరమైన గులాబ్ జామూన్ చేసి చూడండి. ఈ జామూన్ తినడానికి చాలా రుచిగా ఉంటుంది. చిలగడదుంప గులాబ్ జామూన్ రెసిపిని ఎలా తయారు చేయాలో తెలుసుకోండి.
గులాబ్ జామూన్ పేరు చెబితేనే నోరూరిపోతుంది. ఎప్పుడూ బయట దొరికే ఇన్ స్టంట్ మిక్స్ తోనే గులాబ్ జామూన్ చేసుకుంటూ ఉంటారు. ఆ మిక్స్ ను మైదా పిండితో చేస్తారు. వాటి కన్నా ఇంటిలోనే టేస్టీగా చిలగడదుంపలతో గులాబ్ జామూన్ తయారు చేసి చూడండి. ఇలా చాలా రుచిగా ఉంటుంది. చలికాలంలో చిలగడ దుంపలు అధికంగా దొరుకుతాయి. ఈ రెసిపీని అప్పుడప్పుడు ప్రయత్నించండి. తప్పకుండా మీకు నచ్చుతుంది. కాబట్టి స్వీట్ పొటాటో గులాబ్ జామూన్ రెసిపీని ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
స్వీట్ పొటాలో గులాబ్ జామూన్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
చిలగడ దుంపలు - మూడు
పాలపొడి - అరకప్పు
మైదా పిండి - రెండు స్పూన్లు
బేకింగ్ పౌడర్ - అర స్పూను
నెయ్యి - ఒక టీ స్పూను
పాలు - ఒక టీ స్పూను
పంచదార - ఒక కప్పు
నీళ్లు - ఒక కప్పు
చిలగడదుంప గులాబ్ జామూన్ రెసిపీ
- చిలగడ దుంపలు నీటిలో వేసి ఉడికించాలి. అవి చల్లారాక పైన పొట్టు తీసి ఒక గిన్నెలో వేయాలి.
- ఆ చిలగడ దుంపలను చేత్తోనే మెత్తగా మెదిపి ముద్దలా చేసుకోవాలి.
- ఆ గిన్నెలోనే పాల పొడి, మైదా పిండి, బేకింగ్ పొడి, నెయ్యి వేసి బాగా కలపాలి. అందులో పాలు కూడా వేసి కలుపుకోవాలి.
- ఈ పిండిని పూరీ పిండిలా కలుపుకోవాలి. పావుగంట పాటూ మూత పెట్టి వదిలేయాలి.
- ఇప్పుడు పంచదార సిరప్ తయారుచేసుకుని పెట్టుకోండి.
- ఒక గిన్నెలో పంచదార, నీరు వేసి పంచదార సిరప్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. పిండి నుంచి చిన్న భాగాన్ని తీసుకుని లడ్డూల్లా చుట్టి నూనెలో వేసి వేయించుకోవాలి.
- వీటిని రంగు మారేవరకు వేయించి వాటిని తీసి పంచదార సిరప్ లో వేయాలి.
- ఒక గంట పాటూ వదిలేయాలి. చల్లారాక తింటే చాలా రుచిగా ఉంటుంది.
- ఇంటికి అతిధులు వచ్చినప్పుడు ఇలా గులాబ్ జామూన్ చేసుకుని చూడండి… మీకు కచ్చితంగా నచ్చుతుంది.
గులాబ్ జామూన్ లు ఎవరికైనా నచ్చుతాయి. దీపావళి, దసరా వంటి పండుగలు వస్తే చాలు ఈ స్వీట్లు ఎక్కువగా ఇంట్లో వండుతూ ఉంటారు. బయట దొరికే ఇన్ స్టెంట్ మిక్స్ తో చేసే స్వీట్ కన్నా ఇలా స్వీట్ పొటాటోతో వండితే ఆరోగ్యానికి కూడా మంచిది. అయితే దీనిలో మనం పంచదారను అధికంగా వాడాము. కాబట్టి డయాబెటిస్ పేషెంట్లు తినకపోవడమే ఉత్తమం.