CM Jagan : హాస్టళ్ల విద్యార్థులకు సీఎం జగన్ గుడ్ న్యూస్
సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేయాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఏడాదిలోగా అన్ని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో నాడు-నేడు కింద అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో సమూల మార్పులు తేవాలన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు, నాడు-నేడుపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు, వసతి గృహాలకు కొత్త రూపు తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.గురుకులాలు, వసతి గృహాల నిర్వహణ ఖర్చులు, డైట్ ఛార్జీలను పెంచాలని చెప్పారు. హాస్టళ్లలో ఉంటే ఎలాంటి సౌకర్యాలు కోరుకుంటామో.. అదే స్థాయిలో నిర్వహణ ఉండాలన్నారు.
'బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వెల్ఫేర్ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్ల ఎలా ఉన్నాయన్నదానిపై పరిశీలన చేయించాం. స్వయంగా ఈ విషయాన్ని పర్యవేక్షించాను. ఆ వివరాలు చూస్తే చేయాల్సింది చాలా ఉంది. సరైన కార్యాచరణ ఉండాలి. ఈ ఏడాది మొత్తం అన్ని గురుకులాలు, హాస్టళ్లను నాడు-నేడు కింద యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేయాలి. ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ పరిధిలో నాడు – నేడు కింద తొలిదశలో స్కూళ్లను అభివృద్ధి చేశాం. మొదటి దశలో చేసిన స్కూళ్లకు సంబంధించి అదనపు తరగతి గదులు నిర్మించే పనికూడా జరుగుతోంది. సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలను కూడా ఇదే తరహాలో అభివృద్ధి చేయాలి.' అని సీఎం జగన్ అన్నారు.
స్కూళ్ల మెయింటెనెన్స్ ఫండ్ మాదిరిగానే హాస్టళ్ల మెయింటెనెన్స్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తే బాగుంటుదేమోనని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. ప్రతి హాస్టల్‌లోనూ తప్పనిసరిగా వార్డెన్లను నియమించాలని చెప్పారు. హాస్టళ్లలో ఉండాల్సిన ఇతర సిబ్బంది కచ్చితంగా ఉండేట్టుగా చూడాలన్నారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌లో వైద్యుడు తప్పనిసరిగా హాస్టల్ విద్యార్థులను చూసుకోవాలన్నారు. డైట్ ఛార్జీలపై పూర్తిగా పరిశీలన చేయాలన్నారు సీఎం. విద్యార్థులకు మంచి ఆహారాన్ని అందించేలా డైట్ ఛార్జీలను పెంచాలని తెలిపారు.
దశాబ్దాలుగా సంక్షేమ హాస్టళ్లను, గురుకులాలను పట్టించుకునే నాథుడు లేడు. అధికారులుగా వీటి అభివృద్ధి పనుల్లో మీ ముద్ర కనిపించాలి. అభివృద్ధి పనులు చేశాక వీటి నిర్వహణకూడా బాగా చేసేలా దృష్టిపెట్టాలి. దీనిపై ప్రత్యేక కార్యాచరణ కూడా సిద్ధంచేయాలి. ఒక వ్యవస్థ ఉండాలి. హాస్టళ్ల నిర్వహణ కోసం ఇప్పుడున్న మొత్తాన్ని పెంచాలి. పిల్లలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించడానికి ఎంత కావాలో నిర్ణయించాలి. గత ప్రభుత్వం కేవలం ఎన్నికలకు ముందు డైట్ ఛార్జీలను పెంచింది. అప్పటివరకూ హాస్టల్ విద్యార్థుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. అద్దె ప్రాతిపదికన ఉన్న వసతి గృహాలను వెంటనే పరిశీలన చేయాలి. నాడు-నేడులో భాగంగా.. శాశ్వత భవనాలను నిర్మించాలి.
- సీఎం జగన్
సంబంధిత కథనం