Karimnagar Crime: కరీంనగర్ లో చైన్ స్నాచింగ్.. సిరిసిల్లలో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్..
Karimnagar Crime: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చైన్ స్నాచర్స్, దొంగలు రెచ్చిపోయారు. కరీంనగర్ లో ఓ యువకుడిపై దాడి చేసి చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు. తాళ్ళం వేసి ఉన్న ఇంట్లో చోరీ కి పాల్పడ్డారు.
Karimnagar Crime: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చైన్ స్నాచర్స్, దొంగలు రెచ్చిపోయారు. కరీంనగర్ లో ఓ యువకుడిపై దాడి చేసి చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు. తాళ్ళం వేసి ఉన్న ఇంట్లో చోరీ కి పాల్పడ్డారు. సిరిసిల్ల జిల్లా పోలీసులు చైన్ స్నాచర్ ఒకరిని అరెస్టు చేశారు. మరొకరి కోసం గాలిస్తున్నారు.
కరీంనగర్ లో చైన్ స్నాచింగ్ జరిగింది. యువకుడిపై దాడి చేసి మెడలోని బంగారు గొలుసును మరో ఇద్దరు యువకులు అపహరించుకుపోయారు. దాడి, చైన్ స్నాచింగ్ సిసి కెమెరా ఫుటేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బైక్ పై వెళుతున్న ఇద్దరు, మరో వ్యక్తి బైక్ పై వెళ్తున్న కట్టరాంపూర్ కు చెందిన పిట్టల సామంత్ ను తిరుమలనగర్ వద్ద ఆపి దాడి చేశారు. మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్ళారు.
పెనుగులాటలో బంగారు చైన్ రోడ్డు పక్కన గల ఇంటి ఆవరణలో పడిపోగా దానిని వెతికి మరీ తీసుకెళ్ళారు చైన్ స్నాచర్ లు. ఈ ఘటన ఓ ఇంటిముందు ఉన్న సీసీ కెమెరాలో రికార్డయింది. సిసి ఫుటేజ్ ఆధారంగా భాదితుడు పిట్టల సామంత్ పోలీసులకు పిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు బైక్ పై వచ్చిన ఇద్దరు యువకులు ఎవరనేది విచారణ చేపట్టారు. మైసమ్మ బోనాల సందర్బంగా గుడి వద్దకు వెళ్ళి తెల్లవారుజామున ఇంటికి వెళ్తుండగా ఇద్దరు బైక్ పై వెంబడించి దాడి చేసి మెడలోని రెండున్నర తులాల బంగారం చైన్ లాక్కెల్లారని బాధితుడు సామంత్ తెలిపారు.
కట్టరాంపూర్ లో చోరీ...
కరీంనగర్ లోని గిద్దెపెరుమాండ్ల స్వామి ఆలయ సమీపంలోని కట్టరాంపూర్ లో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగింది. బంగారు వెండి ఆభరణాలు చొరికి గురైనట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం వారి అందుబాటులో లేకపోవడంతో ఏమి పోయాయో తెలియడం లేదు.
రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు చైన్ స్నాచర్ ఒకరిని అరెస్టు చేశారు. మరొకరు పరార్ కాగా అతని కోసం గాలిస్తున్నారు. అందుకు సంబంధించిన వివరాలు సిరిసిల్ల రూరల్ సిఐ మొగిలి వెల్లడించారు. మెదక్ జిల్లా గజ్వేల్ కి చెందిన పర్వతం నర్సింహులు, సిద్దిపేట జిల్లా దుబ్బాక కు చెందిన మరో వ్యక్తి తో కలసి చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు.
తంగళ్ళపల్లి మండలం మల్లాపూర్ లో మహిళా బాసా ఎల్లవ్వ గత నెల జూన్ 21న రాత్రి ఇంటిముందు నిద్రిస్తుండగా ఇద్దరు వ్యక్తులు ఆమె మెడలోని బంగారు పూసలతాడును తెంపుకొని ద్విచక్రవాహనంపై పారిపోయారు. చైన్ స్నాచింగ్ పాల్పడిన ఇద్దరు దారిలో తాటిపల్లి బాలకిషన్, ఎడ్ల రమేష్ ఇద్దరి మొబైల్ ఫోన్స్ కూడా ఎత్తుకెళ్లారు. ఎల్లవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా చైన్ స్నాచింగ్ పాల్పడ్డ వారిలో ఒకరు పర్వతం నర్సింహులు తంగళ్ళపల్లి శివారులో పట్టుబడ్డారని సీఐ ప్రకటించారు. అతని నుంచి మూడు తులాల బంగారు చైన్ ,ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చెసుకున్నామని తెలిపారు.
పట్టించిన మొబైల్స్...
చైన్ స్నాచింగ్ పాల్పడ్డ వారిని ఎత్తుకెళ్ళిన మొబైల్ ఫోన్ పట్టించాయి. ఎత్తుకెళ్లిన మొబైల్ ఫోన్ తో పర్వతం నర్సింహులు తంగళ్ళపల్లి శివారులో సంచరిస్తుండగా నిఘా పెట్టిన పోలీసులకు చిక్కాడు. మొబైల్ నెంబర్ ఆధారంగా సాంకేతిక పరిజ్ఞానంతో నిందుతులు సిరిసిల్ల వైపు వస్తున్నారన్న సమాచారం మేరకు తంగళ్ళపల్లి వద్ద తనిఖీలు చేపట్టగా పర్వతం నర్సింహులు అరెస్టు చేశామని తెలిపారు. పరారీలో ఉన్న మరో నిందుతుణ్ణి గుర్తించామని త్వరలో పట్టుకోవడం జరుగుతుందని సిఐ తెలిపారు.
(రిపోర్టింగ్: కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)