KCR : ఫిబ్రవరి 1న ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం…!
BRS chief KCR News: తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలిచారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తుంటి ఎముక విరగిన కారణంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే ఫిబ్రవరి 1వ తేదీన శాసనసభ్యుడిగా ప్రమా ణం చేయనున్నట్లు ఆ పార్టీ వర్గాల మేరకు తెలిసింది.
BRS Chief KCR News: తుంటి ఎముక గాయం నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోలుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఫామ్ హౌస్ లో గాయపడిన కేసీఆర్… గత రెండు నెలలుగా విశ్రాంతి తీసుకుంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ గాయం కారణంగా ప్రమాణస్వీకారం చేయలేదు. అయితే ఫిబ్రవరి 1వ తేదీన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్ లో గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిసింది.
తాజాగా పార్టీకి చెందిన ఎంపీలతో సమావేశం కూడా అయ్యారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. దాదాపు 3 గంటలపాటు ఈ భేటీ జరిగింది. ఉభయ సభల్లో బీఆర్ఎస్ ఎంపీలు బలంగా గళం వినిపించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ బలంగా ఉందని... త్వరలోనే తాను కూడా ప్రజల మధ్యకి వస్తానని చెప్పారు. తెలంగాణ హక్కులకోసం పోరాడే దళం బీఆర్ఎస్ పార్టీ ఒక్కటేనని… రాబోయే పార్లమెంటు సమావేశాల్లో బీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణ హక్కుల సాధన కోసం గళం విప్పాలని దిశానిర్దేశం చేశారు. నదీ జలాల కేటాయింపులు, ఉమ్మడి ఆస్తుల పంపకాలతో పాటు పెండింగులో వున్న రాష్ట్ర విభజన హామీల సాధనకోసం ఇప్పడికే ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదేనన్నారు. నాడైనా నేడైనా తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లే సందర్భాల్లో అడ్డుకుని కాపాడలవలసిన బాధ్యత మరోసారి బీఆర్ఎస్ ఎంపీలదేనని స్పష్టం చేశారు.
2023 నవంబర్ 30న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 64 స్థానాలను గెలుచుకొని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 39 స్థానాల్లో గెలిచిన బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షస్థానానికి పరిమితమైంది. ఈ ఎన్నికల్లోనూ మరోసారి గజ్వేల్ నుంచి పోటీ చేసిన కేసీఆర్…45,031 ఓట్ల తేడాతో గెలిచారు. రెండో స్థానంలో బీజేపీ నుంచి పోటీ చేసిన ఈటల రాజేందర్ నిలిచారు. ఇదే ఎన్నికల్లో కామారెడ్డిలో కూడా పోటీ చేసిన కేసీఆర్… బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇక్కడ రెండో స్థానంలో నిలిచారు.