KCR : మన గళం బలంగా వినిపించాలి, త్వరలోనే ప్రజల మధ్యకి వస్తా - కేసీఆర్-kcr hold parliamentary party meeting discuss about upcoming parliament sessions ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kcr : మన గళం బలంగా వినిపించాలి, త్వరలోనే ప్రజల మధ్యకి వస్తా - కేసీఆర్

KCR : మన గళం బలంగా వినిపించాలి, త్వరలోనే ప్రజల మధ్యకి వస్తా - కేసీఆర్

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 26, 2024 06:27 PM IST

BRS Parliamentary Party Meeting 2024: వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. శుక్రవారం ఎంపీలతో భేటీ అయిన ఆయన… పలు అంశాలపై చర్చించారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (BRS Twitter)

BRS Parliamentary Party Meeting 2024: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఆ పార్టీ ఎంపీలు శుక్రవారం ఎర్రవెల్లిలో భేటీ అయ్యారు. ఈనెలలో ప్రారంభం కానున్న పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన అంశాలపై చర్చించారు. ప్రధానంగా కృష్ణాబోర్డుకు ప్రాజెక్టుల అప్పగింత అంశంపై మాట్లాడారు. ఈ భేటీ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్.. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో పార్లమెంట్ లో బీఆర్ఎస్ పార్టీ తరపున గట్టిగా పోరాడాలని చెప్పారు. కృష్ణాబోర్డుకు ప్రాజెక్టులు అప్పగిస్తే తెలంగాణకు నష్టం జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

ఉభయ సభల్లో బీఆర్ఎస్ ఎంపీలు బలంగా గళం వినిపించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ బలంగా ఉందని... త్వరలోనే తాను కూడా ప్రజల మధ్యకి వస్తానని చెప్పారు. తెలంగాణ హక్కులకోసం పోరాడే దళం బీఆర్ఎస్ పార్టీ ఒక్కటేనని… రాబోయే పార్లమెంటు సమావేశాల్లో బీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణ హక్కుల సాధన కోసం గళం విప్పాలని దిశానిర్దేశం చేశారు.

నదీ జలాల కేటాయింపులు, ఉమ్మడి ఆస్తుల పంపకాలతో పాటు పెండింగులో వున్న రాష్ట్ర విభజన హామీల సాధనకోసం ఇప్పడికే ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదేనన్నారు కేసీఆర్. నాడైనా నేడైనా తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లే సందర్భాల్లో అడ్డుకుని కాపాడలవలసిన బాధ్యత మరోసారి బీఆర్ఎస్ ఎంపీలదేనని స్పష్టం చేశారు. దాదాపు మూడు గంటల పాటు సాగిన సమావేశంలో, పార్లమెంటు ఉభయ సభల్లో, పలు అంశాలపై అనుసరించాల్సిన వ్యూహాలను చర్చించాల్సిన విధానాలపై పార్టీ అధినేత కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.

ఈ సమావేశంలో రాజ్యసభ, లోకసభ పార్లమెంటరీ పార్టీ నేతలు కె కేశవరావు, నామా నాగేశ్వర్ రావు సహా పార్టీ ఎంపీ లు పోతుగంటి రాములు, బీబీ పాటిల్, పసునూరి దయాకర్, మన్నె శ్రీనివాస్ రెడ్డి, కెఆర్ సురేష్ రెడ్డి, వెంకటేష్ నేతకాని, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత, పార్థసారథి రెడ్డి, జోగినపల్లి సంతోష్ కుమార్, దేవకొండ దామోదర్ రావు, గడ్డం రంజిత్ రెడ్డి వీరితో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావ్ పాల్గొన్నారు.

తెలంగాణకు తీవ్ర అన్యాయం - హరీశ్ రావు

ఈ సమావేశం తర్వాత మాజీ మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన విధానంపై సుదీర్ఘ చర్చ జరిగిందన్నారు. కృష్ణా రివర్ బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించడం సరికాదని… ఫలితంగా తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులను కృష్ణ రివర్ బోర్డుకు అప్పగిస్తూ సంతకాలు పెట్టిందని తెలిపారు. కేంద్రం దీనికి సంబంధించిన మినట్స్ కూడా బయట పెట్టిందని గుర్తు చేశారు.

“కృష్ణా జలాల్లో మన వాటా తేలకుండా బోర్డుకు ఎలా అప్పగిస్తారు. ఇప్పుడు ప్రాజెక్టుపైకి తెలంగాణ అధికారులు అడుగుపెట్టే అవకాశం లేకుండా పోయింది. ఓవైపు రాష్ట్ర మంత్రి మేం సంతకాలు పెట్టలేదని మాట్లాడుతున్నాడు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో ఘోరంగా ఫెయిల్ అయ్యింది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని బీఆర్ఎస్ పార్లమెంటరీ బృందం కలిస్తుంది. గతంలోనూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణకు అన్యాయం చేశాయి. పార్లమెంటు గట్టిగా గొంతు వినిపిస్తాం.. కాంగ్రెస్ పార్టీలో పూటకో మాట మాట్లాడుతున్నారు. ఆరు గ్యారంటీల్లో 13 హామీలు ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే హామీలు అమలు చేయాలి.మాకు ఓపిక ఉంది, ప్రజల కోసం ప్రశ్నిస్తాం. మార్చి 17వ తేదీకి వంద రోజులు నిండుతుంది. అంతలోపు ఎన్నికల కోడ్ వస్తుంది. మహిళల విషయంలో ఒకే హామీ అమలు చేసి అన్నీ అమలు చేశామంటే ఎలా..? నిరుద్యోగ భృతిపై అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెబుతున్నారు. ఇప్పటికైనా వివరణ ఇవ్వండి ఎప్పటి నుండి అమలు చేస్తారో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పాలి. ఎన్నికల కోడ్‌కు ముందే హామీలు అమలు చేయకపోతే దాటవేసినట్లే” అవుతుందని హరీశ్ రావు అన్నారు.

Whats_app_banner