Telangana Formation Day : 'ఉద్యమ నాయకుడే పాలకుడై' - గులాబీ దళపతి రాజకీయ ప్రస్థానం ఇదే
Telangana Formation Day: తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001లో టీఆర్ఎస్ ను ఏర్పాటు చేశారు కేసీఆర్. 14 ఏళ్ల పాటు నిర్విరామంగా తన పోరాటాన్ని కొనసాగించారు. 2009 దీక్ష చేపట్టి... మలిదశ ఉద్యమానికి నాయకత్వం వహించారు. సాధించిన స్వరాష్ట్రంలో 2వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
KCR Role in Telangana Movement: కేసీఆర్(కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు).... ఈ పేరు వింటే వెంటనే గుర్తొచ్చేది తెలంగాణ..! తెలంగాణ అనే పేరు విన్నా... గుర్తొచే వ్యక్తి కూడా కేసీఆరే...! దీనిబట్టి అర్థం చేసుకోవచ్చు... తెలంగాణ అనే పదంతో ఆయనకున్న అనుబంధమేంటనేది..! టీఆర్ఎస్ ఏర్పాటుతో ఉద్యమ నేతగా సరికొత్త పంథాతో ముందుకొచ్చిన ఆయన.... విజయబావుటా ఎగరవేశారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించిన నేతగా పేరు సంపాదించారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అయినప్పటికీ... తెచ్చింది మాత్రం కేసీఆర్ అన్న పరిస్థితి వరకు తీసుకువచ్చారు..! అంతేనా రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విక్టరీని అందుకొని తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పీఠాన్ని కూడా అధిష్టించారు. అలా ఒక్కసారి కాదు... 2018 ఎన్నికల్లోనూ తిరుగులేని విజయాన్ని అందుకొని... ముందుకు సాగుతున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీఆర్ఎస్ ఏర్పాటు ఓ సంచలనం. ఇందుకు హైదరాబాద్ లోని జలదృశ్యం వేదికైంది. 2001 ఏడాదిలో ఏప్రిల్ 27వ తేదీన అతి తక్కవ మంది తెలంగాణవాదుల సమక్షంలో పార్టీని ప్రకటించారు కేసీఆర్. టీడీపీకి రాజీనామా చేసిన ఆయన.. పార్టీ ఆవిర్భావ సభలో కీలక ప్రసంగం చేశారు. తెలంగాణ ఏర్పాటే ఏకైక అజెండాగా టీఆర్ఎస్ వస్తుందని స్పష్టం చేశారు. అయితే పార్టీ ఏర్పడిన కొద్దిరోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఇందులో పోటీ చేసిన టీఆర్ఎస్... పలు స్థానాల్లో విజయం సాధించింది. ఇదే క్రమంలో తెలంగాణలోని పది జిల్లాల్లోనూ సభలు.. పాదయాత్రల పేరుతో రాష్ట్ర ఏర్పాటు విషయంలో భావజాలవ్యాప్తికి ఎంతో కృషి చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత, అవసరాన్ని ప్రజల్లోకి తీసుకెళుతూనే.. మరోవైపు రాజకీయంగా ఎదిగేలా పావులు కదిపారు కేసీఆర్. ఇందులో భాగంగా 2004లో కాంగ్రెస్ పార్టీతో జోడో కట్టారు. ఈ ఎన్నికల్లో 42 స్థానాల్లో పోటీ చేసి.. 26 స్థానాల్లో విక్టరీ కొట్టింది గులాబీ పార్టీ. 6 పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసి... ఐదింట్లో గెలిచి విజయబావుటా ఎగరవేసింది. ఇలా మొదలైన ప్రస్థానంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ మొండిచేయి చూపటంతో బయటికి వచ్చిన కేసీఆర్ ఉప ఎన్నికలకు వెళ్లారు. గతంలో కంటే కొన్ని స్థానాలను కోల్పోవాల్సి వచ్చింది. ఇక కరీంనగర్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ గెలుపు ఓ చరిత్ర అనే చెప్పొచ్చు. ఇక 2009లో మహాకూటమితో జట్టుకట్టిన కేసీఆర్… టీడీపీతో పాటు కమ్యూనిస్టులతో జై తెలంగాణ అనిపించగలిగారు. అయితే ఈ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నారు. ఓ దశలో టీఆర్ఎస్ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. ఆ తర్వాత 14 ఎఫ్ పై సుప్రీంతీర్పుతో కేసీఆర్ దీక్షకు దిగడంతో టీఆర్ఎస్ మళ్లీ ఫామ్ లో కి వచ్చేశారు. తిరుగులేని ఆదిపత్యాన్ని కొనసాగించారు. 2014 వరకు ఉద్యమాన్ని నడిపించటమే కాదు… స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రిగా గెలిచి రికార్డు సృష్టించారు. ఆయన రాజకీయ ప్రస్థానం చూస్తే…..
కేసీఆర్ రాజకీయ ప్రస్థానం...
-తొలి రోజుల్లో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1978లో యువజన నాయకునిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తెలుగుదేశం గూటికి చేరారు.
- 1983లో సిద్దిపేట నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో అతి స్వల్ప మెజార్టీతో ఓటమి పాలయ్యారు.
- 1985లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన 1989, 1994, 1996లో వరుసగా ఎమ్మెల్యేగా విక్టరీ కొట్టారు.1996లో కేబినెట్ హోదాలో రవాణా మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు.
-1999లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన కేసీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికయ్యారు.
- 2001లో ఏప్రిల్ 21న ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పదవులతో పాటు తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
- 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)ని ప్రకటించారు.
- 2004 లోక్‌సభ ఎన్నికలలో కరీంనగర్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. 2004 నుంచి 2006 వరకు కేంద్ర కార్మికశాఖ మంత్రిగా పని చేశారు. యూపీఏ కూటమి నుంచి బయటికి వచ్చిన కేసీఆర్…..ఎంపీ పదవికి రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళ్లారు. ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ పోరులో కేసీఆర్ భారీ విజయాన్ని దక్కించుకున్నారు. ఈ విజయం తెలంగాణ వాదానికి బలం చేకూర్చిన సందర్భమని చెప్పొచ్చు.
- మహా కూటమిలో భాగంగా 2009 ఎన్నికల్లో మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ ఎంపీగా గెలించారు. ఫ్రీజోన్ కు వ్యతిరేకంగా 2009 నవంబర్ 29న తెలంగాణ రాష్ర్టం కోసం ఆమరణ దీక్ష ప్రకటించారు. ఉద్యమం తీవ్రస్థాయికి చేరింది. 2009 డిసెంబర్ 9వ తేదీన కేంద్రం నుంచి ప్రకటన వచ్చింది.
- 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విక్టరీ కొట్టింది. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిష్టించారు.
- 2018 అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా సీట్లను గెలుచుకొని.…. రెండోసారి కూడా ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.
-2022లో టీఆర్ఎస్ ను కాస్త బీఆర్ఎస్ గా మార్చారు కేసీఆర్. జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో భారీ సభలను నిర్వహిస్తున్నారు.
సంబంధిత కథనం