BRS MP attacked : ఎంపీపై కత్తితో దాడి, ఖండించిన నేతలు - రేపు దుబ్బాక బంద్ కు BRS పిలుపు-brs party call for dubbaka bandh on tuesday over attack on kotha prabhakar reddy ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Brs Mp Attacked : ఎంపీపై కత్తితో దాడి, ఖండించిన నేతలు - రేపు దుబ్బాక బంద్ కు Brs పిలుపు

BRS MP attacked : ఎంపీపై కత్తితో దాడి, ఖండించిన నేతలు - రేపు దుబ్బాక బంద్ కు BRS పిలుపు

HT Telugu Desk HT Telugu
Oct 30, 2023 09:31 PM IST

Attack on Kotha Prabhakar Reddy Incident: ఎన్నికల ప్రచారంలో ఉన్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కత్తితో దాడి చేయటాన్ని బీఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. చికిత్స పొందుతున్న ప్రభాకర్ రెడ్డిని కేసీఆర్, కేటీఆర్ పరామర్శించారు. మరోవైపు మంగళవారం దుబ్బాక బంద్ కు పిలుపునిచ్చింది బీఆర్ఎస్.

ప్రభాకర్ రెడ్డిని పరామర్శిస్తున్న కేసీఆర్
ప్రభాకర్ రెడ్డిని పరామర్శిస్తున్న కేసీఆర్

Attack on Kotha Prabhakar Reddy Incident: బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి,మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సోమవారం దుబ్బాక నియోజికావర్గం, దౌల్తబద్ మండలం , సూరంపల్లి లో ఎన్నికల ప్రచారం చేస్తుండగా రాజు అనే దుండగుడు మద్యం మత్తులో కొత్త ప్రభాకర్ రెడ్డి కుడివైపు కడుపులో కత్తితో పొడిచి హత్యాయత్నం చేశాడు.దాంతో తీవ్ర రక్తస్రావంతో గాయపడ్డ ఎంపీని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ యశోదకు తరలించారు. ప్రభాకర్ రెడ్డిని సీఎం కేసీఆర్, కేటీఆర్ తో పాటు పలువురు మంత్రులు పరామర్శించారు. వైద్యులను అడిగి వివరాలను తెలుసుకున్నారు.

yearly horoscope entry point

ఇటుదాడికి పాల్పడ్డ రాజు అనే వ్యక్తిని స్థానికులు పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు.కాగా నిందుతుడు రాజుకు బిఆర్ఎస్ కార్యకర్తలు దేహశుద్ధి చెయ్యడంతో గాయాలపాలైన నిందుతుడు రాజును స్థానిక ఆస్పత్రికి తరలించి దాడి గురించి విచారిస్తున్నారు.

దాడి నాపై జరిగినట్టే : కేసీఆర్

ఇదిలా ఉంటే ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై జరిగిన దాడిని పలువురు నాయకులు తీవ్రంగా ఖండించారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా బాన్సువాడ బహిరంగ సభా వేదికగా కేసిఆర్ స్పందిస్తూ…. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఆస్కారం లేదని కేసీఆర్ అన్నారు. ఎన్నికల్లో ప్రజా తీర్పును ఎదుర్కోలేక భౌతిక దాడులు, హత్యా రాజకీయాలకు తెగబడడం సిగ్గుచేటని సీఎం అన్నారు. ఎన్నికల సమయంలో ఇటువంటి సంఘ విద్రోహుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు, బీఆర్ఎస్ నేతలకు, కార్యకర్తలకు అధినేత పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నాయకులపై, కార్యకర్తలపై ఎవరు దాడులకు పాల్పడ్డా సహించేది లేదని సీఎం అన్నారు. ఈ దాడి దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రె డ్డిపై జరిగిన దాడి కాదని అది కేసీఆర్ పై జరిగిన దాడి అని కేసిఆర్ స్పష్టం చేశారు.తెలంగాణ ఏర్పడి పదేళ్లు అవుతున్నా ఇలాంటి హత్య రాజకీయాలు జరగలేదని అయన గుర్తు చేశారు.

ప్రభాకర్ రెడ్డిని యశోద ఆస్పత్రికి తరలిస్తున్నారని సమాచారం అందుకున్న మంత్రి హరీష్ రావు హుటాహుటిన సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి చేరుకున్నారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడి అత్యంత గర్హనియమన్నారు.ఈ ఘటనను అటు ప్రభుత్వం ఇటు బిఅర్ఎస్ పార్టీ సీరియస్ గా తీసుకుంటుందని హరీష్ రావు స్పష్టం చేశారు. ఎంపీ గన్ మ్యాన్ ఉండడం వల్ల ఎక్కువ దాడి జరగలేదని,ప్రస్తుతం ప్రభాకర్ రెడ్డికి సర్జరీ జరుగుతున్నట్లు హరీష్ రావు వెల్లడించారు.రాజకీయంగా ఎదురుకునే దమ్ము లేక ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారాని హరీష్ రావు మండిపడ్డారు.

నిరాశలో ఉండి దాడులకు దిగుతుంది : కేటీఆర్

ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై జరిగిన దాడిని తాను తీవ్రంగా ఖండిస్తునట్లు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ తెలిపారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోతమని తెలిసి నిరాశలో ఉండి బిఅర్ఎస్ నాయకులపై భౌతిక దాడికి దిగుతున్నారాని కేటీఆర్ ఆరోపించారు.తమ నేతలను భౌతికంగా అంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని అయన మండిపడ్డారు. థర్డ్ రెట్ క్రిమినల్ ను టిపిసిసి ప్రెసిడెంట్ గా నియమించనప్పుడే ఇలాంటి ఘటనలను ఊహించుకోవచ్చు అని అయన అన్నారు.ప్రజాస్వామ్యంలో హింస,హత్య రాజకీయాలకు తావు లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.ఈ ఘటనపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందని తాను భావిస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.

తెలంగాణ ప్రజలు సహించరు: కవిత

ఇదే ఘటనపై బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు.బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి, ఎంపీ కొత్తా ప్రభాకర్ రెడ్డి పై జరిగిన హత్యాయత్యాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నాట్లు ఆమె పేర్కొన్నారు.హత్య రాజకీయాలకు తెలంగాణలో స్థానం లేదని, రాజకీయంగా ఎదుర్కోలేక భౌతికదాడులకు దిగడం సరికాదన్నారు. ఎన్నికలను ఎదుర్కోలేక ఇలాంటి సంఘవిద్రోహక చర్యలకు పాల్పడడాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ సహించబోరని ఆమె స్పష్టం చేశారు.

ప్రతిపక్షాలు గుండాలకు టిక్కెట్లు ఇచ్చారు : మల్లారెడ్డి

ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ల్యాండ్ గ్రాబర్లకు, రౌడీలు, గూండాలకు టిక్కెట్లు ఇచ్చారని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై జరిగిన దాడి హేయమైన చర్య అని మల్లారెడ్డి అన్నారు. మైనంపల్లి హన్మంతు రావు కూడా తనను బెదిరిస్తున్నాడని తనపై కూడా దాడి జరుగుతుందేమో అని తనకు భయంగా ఉందన్నారు.కాగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో రేపు దుబ్బాక బంద్ కు పార్టీ పిలుపునిచ్చింది.

ఖండించిన బీజేపీ, కాంగ్రెస్

మరోవైపు ఈ ఘటనపై ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ స్పందించాయి. దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన దాడికి తానే కారణమని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.ఇక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందిస్తూ… దాడిని తీవ్రంగా ఖండించారు. ఘటనపై సమగ్ర విచారణ జరపాలని, పార్టీలకు అతీతంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ హింసను ఎప్పుడూ నమ్ముకొదని స్పష్టం చేశారు.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్

Whats_app_banner

సంబంధిత కథనం