Bandi Sanjay : భైంసా పేరు మారుస్తాం.. దత్తత తీసుకుంటాం
Bandi Sanjay Comments On KCR : ముఖ్యమంత్రి కేసీఆర్ కు మూడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని అప్పులపాల్జేసి ప్రజలను కష్టాలపాల్జేసిన కేసీఆర్ ఏం సాధించారని, ఇచ్చిన హామీలను నెరవేర్చారా? అని ప్రశ్నించారు.
భైంసా(Bhainsa) సమీపంలో 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర(Praja Sangrama Yatra) ప్రారంభ బహిరంగసభ జరిగింది. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ తోపాటుగా.. కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, సోయం బాపూరావు, బీజేపీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సభలో టీఆర్ఎస్(TRS) పార్టీపై బండి సంజయ్ విమర్శలు గుప్పించారు.
రాబోయేది బీజేపీ(BJP) ప్రభుత్వమేనని ఉద్ఘాటించిన బండి సంజయ్ బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే భైంసా పేరును మైసా (మహిషా) మారుస్తామని ప్రకటించారు. అలాగే భైంసా బాధితులపై పెట్టిన కేసులన్నీ ఎత్తేస్తామని, ఉద్యోగాలు కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని అర్హులైన అందరికీ ఉచితంగా నాణ్యమైన విద్య-వైద్యం అందించడంతోపాటు నిలువనీడ లేని వాళ్లందరికీ పక్కా ఇండ్లు కట్టిస్తామని ప్రకటించారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తామన్నారు.
'మేం కోర్టును, చట్టాన్ని గౌరవిస్తాం. భైంసాలో ఫుల్ జోష్. 3 వేల కుర్చీలేస్తే పోలీసోళ్లు 144 సెక్షన్ పెట్టారట. ఇన్ని వేల మంది వచ్చారు. మీ అందరినీ దర్శించుకునే మాలో జోష్ పెరుగుతోందని ఇక్కడికి వచ్చాను. భైంసాకు రావాలంటే వీసా తీసుకోవాలా? ఏం పాపం చేశారు ప్రజలు?' అని బండి సంజయ్(Bandi Sanjay) అన్నారు.
ఈరోజు బీజేపీ(BJP)ని భైంసాకు రాకుండా నిషేధించారు? భైంసా పాకిస్తాన్, బంగ్లాదేశ్, అప్ఘనిస్తాన్ లో ఉందా? వీసా తీసుకుని రావాలా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. మతవిద్వేషాలు రగిలించే నాయకులు ఎక్కడైనా తిరగొచ్చా అని అడిగారు. దేశం కోసం, ధర్మం కోసం హిందు ధర్మాన్ని కాపాడే బీజేపీ వాళ్లు మాత్రం సభలు పెట్టుకోవద్దట.. ఒక్కసారి ఆలోచించండని బండి సంజయ్ కోరారు.
ఇకపై తెలంగాణ(Telangana)లో ఏ ఎన్నికలు జరిగినా కాషాయ జెండా రెపరెపలాడించాలె. బీజేపీ ఏర్పడ్డాక భైంసాను దత్తత తీసుకుంటాం. భైంసా అల్లర్లలో గాయపడ్డ బాధితులపై పెట్టిన కేసులను ఎత్తిపారేస్తాం. వాళ్లకు పక్కా ఉద్యోగాలిస్తాం. మా పార్టీ అధికారంలోకి వస్తే.. మనోళ్ల గురించి ఆలోచిస్తా.. మీ కోసమే కష్టపడుతున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడేందుకు కష్టపడుతున్నాం. కేసీఆర్(KCR)కు మూడింది.. భైంసా అంటేనే కేసీఆర్ కు భయం.. ఇక్కడ పెట్టిన సభకు వచ్చిన జన స్పందనను చూసి ఫుల్ బాటిల్ తాగుతడు.
- బండి సంజయ్
రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులపాల్జేశాడని బండి సంజయ్(Bandi Sanjay) ఆరోపించారు. 5 లక్షల కోట్ల అప్పుల చేసి ఒక్కో వ్యక్తి పై 1.2 లక్షల అప్పు మోపారన్నారు. ఒక్క ఉద్యోగమియ్యలే.... నరేంద్రమోదీ ప్రభుత్వం పోయిన నెలలో ఒకేసారి 75 వేల మందికి, ఈనెలలో 70 వేల మందికి ఏకకాలంలో ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిందన్నారు. లక్షల కోట్ల అప్పులు చేసిన కేసీఆర్.. ఎంతమందికి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చినవ్? రుణమాఫీ చేసినవ్? దళిత బంధు(Dalit Bandhu) ఇచ్చినవో...? దళిత, గిరిజనులకు ఎన్ని ఎకరాల భూమి ఇచ్చినవ్? చెప్పాలేని బండి సంజయ్ అడిగారు. అన్ని పార్టీలకు అధికారమిచ్చారని, ఒక్కసారి బీజేపీకి అవకాశమివ్వండని కోరారు.