TG Aarogyasri : క్యాడర్ మార్పుతో పాటు జీతం పెంపు - సమ్మె విరమించిన ఆరోగ్యమిత్రలు
రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ లో భాగంగా పని చేస్తున్న ఆరోగ్య మిత్రలు సమ్మె విరమించారు. సమ్మెను విరమిస్తున్నట్లు సంఘ ప్రతినిధులు లేఖను విడుదల చేశారు. ఆరోగ్యమిత్రల వేతనం పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి దామోదర ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్రంలోని ఆరోగ్య మిత్రలు సమ్మె విరమించారు. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ చొరవ తీసుకొని వారి సమస్యలను పరిష్కారం దిశగా చర్చలు జరిపారు. గత పది సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఆరోగ్య మిత్రల ప్రధాన డిమాండైనా క్యాడర్ మార్పు (డేటా ఆపరేటర్)ను అంగీకరించారు. వేతనాన్ని కూడా 15,600 నుంచి 19,500 కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని మంత్రి దామోదర ప్రకటించారు.
మంత్రి దామోదర్ రాజనర్సింహ చొరవతో సమ్మె విరమిస్తూ ఆరోగ్య మిత్రలు లేఖను విడుదల చేశారు. ప్రభుత్వం సానుకూలంగా తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవల విధులలో పాల్గొంటున్నట్టుగా ప్రకటించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంతో పాటు మంత్రి దామోదర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు అనుసంధానమైన అన్ని దవాఖానల్లో ఆరోగ్యమిత్రలు పని చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 800 మందికిపైగా ఆరోగ్యమిత్రలు సేవలు అందిస్తున్నారు. రోగులు ఆహార భద్రత కార్డును తీసుకెళ్లి వీరికి చూపిస్తే… ఆరోగ్యశ్రీ కౌంటర్‌లో రిజిస్టర్ చేస్తారు. అక్కడి నుంచి ఉచితంగా వైద్యసేవలు అందించే బాధ్యతను ఆరోగ్యమిత్రలు తీసుకుంటారు.
రాష్ట్రంలో చూస్తే ప్రతి నెల సగటును పది లక్షల మందికిపైగా రోగులు ఆరోగ్య శ్రీ ద్వారా వైద్య సేవలు పొందుతున్నారు. వీరికి కావాల్సిన ప్రాథమిక సమాచారం, రిజిస్ట్రేషన్ తో పాటు మొదలుగు ప్రక్రియలన్నింటిని ఆరోగ్యమిత్రలు పర్యవేక్షిస్తారు.
ఉచితంగా ఓపీ, ఐపీ సేవలు అందేలా కూడా ఆరోగ్యమిత్రలే చూస్తారు. అర్హతలను బట్టి ఆరోగ్యశ్రీ కిందికి వస్తారా లేరా అనేది నిర్ణయిస్తారు. రోగులకు అందే ఆహారం, చికిత్స తీరు, డయాలిస్ సేవలను కూడా పర్యవేక్షిస్తుంటారు. రోగికి ఇబ్బంది లేకుండా తగిన సమాచారం అందజేస్తుంటారు.