TG Rains : 365 జాతీయ రహదారిపై భారీ వర్షానికి కూలిన ఆర్చీలు.. తప్పిన ప్రమాదం
TG Rains : ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. వరంగల్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో వచ్చిన భారీ వర్షానికి నర్సంపేట పట్టణంలో ఏర్పాటు చేసి ఆర్చీలు కూలిపోయాయి. కూలిపోయిన సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో.. ప్రమాదం తప్పింది.
తెలంగాణలో ఆదివారం సాయంత్రం పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో చాలాచోట్ల వర్షం కురిసింది. వరంగల్ జిల్లా నర్సంపేటలో కురిసిన వర్షానికి.. దేవీ నవరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన ఆర్చీలు కూలిపోయాయి. ఆ సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
నర్సంపేట పట్టణం లోని అంబేడ్కర్ కూడలిలో రెండు వైపులా దేవి శరన్నవరాత్రి వేడుకలకు తాత్కాలిక స్వాగత ఆర్చీలను ఏర్పాటు చేశారు. అయితే.. భారీ వర్షం, ఈదురుగారులకు ఆర్చీలు నేలకొరిగాయి. 365 జాతీయ రహదారిపై అంబేడ్కర్ సర్కిల్ నుంచి మల్లంపల్లి రోడ్డు స్టేడియం సమీపం వరకూ ఆర్చీలను ఏర్పాటు చేశారు. ఈదురు గాలులకు ఐదారుచోట్ల ఆర్చీలు కూలిపోయాయి.
డిగ్రీ కాలేజీకి వెళ్లే రోడ్డు ఎదరుగా, వల్లభనగర్ డివైడర్ చివరన ఏర్పాటు చేసిన ఆర్చీలు కూడా నేలకొరిగాయి. వల్లభనగర్‌లో కరెంట్ తీగలపై కూలాయి. దీంతో కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వెంటనే స్పందించిన అధికారులు, నవరాత్రి ఉత్సవ నిర్వాహకులు.. కూలిపోయిన ఆర్చీలను తొలగించి సరఫారను పునరుద్ధరించారు. ఆర్చీల కోసం తీసుకొచ్చిన కర్రలను మొత్తం తీసేసి పక్కనబెట్టారు.
ఇటు అరవింద థియేటర్ ఎదురుగా ఏర్పాటు చేసిన భారీ ఆర్చీ కూలి.. రోడ్డుపై పడింది. సరిగ్గా అక్కడే రోడ్డు మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి. అక్కడ రోడ్డు వెడల్పు తక్కువగా ఉంది. ఆ రోడ్డురై ఆర్చీ పడిపోయింది. కూలిపోయిన సమయంలో ఓ కారు దానికి సమీపంలోకి వెళ్లింది. కానీ.. కారుపై పడకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇటు వర్షం కారణంగా పట్టణంలోని రహదారులు జలమయం అయ్యాయి.
అపారనష్టం..
వరంగల్ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో పంటలకు నష్టం జరిగింది. ఇప్పుడిప్పుడే పొట్టకు వచ్చిన వరిపైరు నేలకొరిగింది. మొక్కజోన్న చేన్లు ఈదురు గాలులకు పడిపోయాయి. అటు మిరప నాటు వేసిన రైతులు తలలు పట్టుకుంటున్నారు. వర్షం కారణంగా భారీగా నష్టం జరిగిందని రైతులు ఆవేదన చెందుతున్నారు.