Mulugu District : లిఫ్ట్ ఇచ్చి రేప్..! అడవిలో అంగన్వాడీ టీచర్ హత్య
Mulugu District Crime News : ములుగు అటవీ ప్రాంతంలో అంగన్ వాడీ టీచర్ దారుణ హత్యకు గురైంది. లిఫ్ట్ ఇచ్చిన ఇద్దరు వ్యక్తులు…. ఆమెపై రేప్ చేసి హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు.
Mulugu district News : బస్ మిస్ అవడంతో నడుచుకుంటూ వెళ్తున్న ఓ అంగన్ వాడీ టీచర్ దారుణ హత్యకు గురైంది. ఆమెకు లిఫ్ట్ ఇచ్చిన దుండగులు అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం బయటకు చెప్తుందేమోనన్న భయంతో ఆమెను అక్కడే హతమార్చి అక్కడి నుంచి పరారయ్యారు.
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని అటవీ ప్రాంతంలో ఈ నెల 14న అంగన్ వాడీ టీచర్ హత్య జరగగా.. మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఏటూరునాగారం మండలం రొయ్యూరు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడి హతమార్చినట్లు నిర్ధారించారు. ఈ మేరకు ఆ ఇద్దరు నిందితులను శుక్రవారం అరెస్ట్ చేశారు. వారి అరెస్ట్ కు సంబంధించిన వివరాలను డీఎస్పీ రవీందర్ వెల్లడించారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం… ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని చిన్నబోయినపల్లి గ్రామానికి చెందిన రడం సుజాత(50) తాడ్వాయి మండలం కాటాపూర్ గ్రామంలో అంగన్ వాడీ టీచర్ గా పని చేస్తున్నారు. రోజువారీలాగే ఈ నెల 14వ తేదీన కూడా తన విధులకు హాజరయ్యారు. విధులు ముగించుకున్న అనంతరం తిరిగి ఇంటికి ప్రయాణం కాగా, ఆమె వెళ్లాల్సిన బస్సు కొద్దిపాటి సమయంలోనే మిస్ అయ్యింది. దీంతో ఆమె కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్లేందుకు సిద్ధమైంది.
బైక్ పై తీసుకెళ్లి దారుణ హత్య
కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్లగా ఆమెకు ఆల్రెడీ పరిచయం ఉన్న ఏటూరు నాగారం మండలం కొయ్యూరు గ్రామానికి చెందిన ఆకుదారి రామయ్య ఆమె వద్దకు వచ్చాడు. తన బైక్ పై లిఫ్ట్ ఇస్తానని చెప్పి ఆమెను నమ్మించాడు. కాటాపూర్ గ్రామంలో ఆమెను బైక్ ఎక్కించుకున్నారు. అంతకుముందే ఆకుదారి రామయ్య కాటాపూర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న నీళ్ల ఒర్రె వద్ద రొయ్యూరు గ్రామానికి చెందిన పగిడి జంపయ్య అనే వ్యక్తిని దించాడు.
అనంతరం అంగన్ వాడీ టీచర్ రడం సుజాతను బైక్ పై ఎక్కించుకుని నీళ్ల ఒర్రె వద్దకు తీసుకెళ్లాడు. ఆ తరువాత రామయ్య, జంపయ్య ఇద్దరూ కలిసి ఆమెను అటవీ ప్రాంతంలో కొద్ది దూరం తీసుకెళ్లారు. అనంతరం బలవంతంగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తరువాత అంగన్ వాడీ టీచర్ మెడలో ఉన్న గోల్డ్ చైన్ ను లాక్కునే ప్రయత్నం చేయడంతో ఆమె తీవ్రంగా ప్రతిఘటించారు. దీంతో రామయ్య, జంపయ్య ఇద్దరూ కలిసి బలవంతంగా చైన్ లాక్కున్నారు.
ఆమె బతికి ఉంటే తమ బండారం బయట పడుతుందనే ఉద్దేశంతో సుజాత తలపై రాయితో బలంగా మోదారు. అప్పటికే ఆమె కింద పడిపోగా, రామయ్య ఆమె ఛాతిపై కూర్చుని గొంతు నులిమాడు. ఆ తరువాత ఆమె మెడలో ఉన్న చున్నీని గట్టిగా బిగించి ఊపిరాడకుండా చేసి హతమార్చారు.
సాక్ష్యాలు లేకుండా చేసే ప్రయత్నం…!
అంగన్ వాడీ టీచర్ ను హత్య చేసిన అనంతరం ఆమె మెడలోని మూడు తులాల బంగారం గొలుసు, పుస్తెల తాడును తీసుకున్నారు. తాము దొరక కూడదనే ఉద్దేశంతో సాక్ష్యాలను మాయం చేసే ప్రయత్నం కూడా చేశారు.
సుజాత మొబైల్ ఫోన్ ని పక్కనే ఉన్న నీళ్ల ఒర్రెలో పడేసి, ఆమె బ్యాగుని కూడా అటవీ ప్రాంతంలో దూరంగా విసిరేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ఆకుదారి రామయ్య, పగిడి జంపయ్య ఇద్దరూ తమ స్వగ్రామమైన రొయ్యూరు వెళ్లిపోయారు. కాగా అటవీ ప్రాంతంలో అంగన్ వాడీ టీచర్ దారుణ హత్యకు గురవడంతో స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
మృతురాలి కొడుకు రడం చరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన తాడ్వాయి పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. పస్రా సీఐ వంగపల్లి శంకర్, తాడ్వాయి ఎస్సై ననిగంటి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో రెండు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు సాగించారు. ఈ మేరకు పోలీసులు సీసీ ఫుటేజీలు, నిందితుల కాల్ డేటా ఆధారంగా పక్కా ఆధారాలు సేకరించారు. అనంతరం తగిన ఆధారాలతో శుక్రవారం రామయ్య, జంపయ్యను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారణ జరపగా.. అసలు విషయాలను ఒప్పుకున్నారు.
అనంతరం వారి నుంచి ఒక బైక్, మూడు తులాల బంగారు గొలుసు, వృద్ధురాలి హ్యాండ్ బాగ్, అందులో ఉన్న బ్యాంక్ పాస్ బుక్స్, ఆధార్ కార్డును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పస్రా సీఐ శంకర్, తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి, ఏఎస్సై చింత నారాయణ, హెడ్ కానిస్టేబుల్ కిషన్, పోలీస్ కానిస్టేబుల్స్ పూజారి రమేష్, సాంబయ్య, రమేష్, గోపు రాజీవ్, కాసగోని రాజేష్ లను ములుగు డీఎస్పీ రవీందర్ అభినందించారు.