Siddipet Akunuru Village : సిద్ధిపేట జిల్లాలో దేవాలయాల నగరం - ఈ 'ఆకునూరు' గ్రామ చరిత్ర చదవాల్సిందే..!-akunuru village in siddipet is a city of temples ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Siddipet Akunuru Village : సిద్ధిపేట జిల్లాలో దేవాలయాల నగరం - ఈ 'ఆకునూరు' గ్రామ చరిత్ర చదవాల్సిందే..!

Siddipet Akunuru Village : సిద్ధిపేట జిల్లాలో దేవాలయాల నగరం - ఈ 'ఆకునూరు' గ్రామ చరిత్ర చదవాల్సిందే..!

HT Telugu Desk HT Telugu
Apr 07, 2024 01:34 PM IST

Temples City Akunuru Village in Siddipet: సిద్ధిపేటలోని ఆకునూరు గ్రామం(Akunuru)… ఎన్నో చారిత్రాక ఆధారాలకు కేరాఫ్ గా నిలుస్తోంది. ఈ గ్రామంలో ఉన్న ఆలయాలు, ఇప్పటి వరకు దొరికిన చారిత్రక ఆధారాలెంటో తెలుసుకోవాలంటే…ఈ కథనం చదవాల్సిందే…!

ఆకునూరులోని శివాలయం
ఆకునూరులోని శివాలయం ( ఫోటోగ్రఫీ: కొలిపాక శ్రీనివాస్, కొత్తతెలంగాణ చరిత్రబృందం)

Akunuru village in Siddipet: ఆకునూరు…. సిద్ధిపేట జిల్లాలోని పురా గ్రామం. చేర్యాల సమీపంలో ఉంటుంది. ఆకునూరు(Akunuru) చరిత్రలో చెరగని చారిత్రకాధారాలున్న పాతనగరం. చరిత్ర సంపన్నమైన ఈ గ్రామంలో రాష్ట్రకూట చక్రవర్తి అమోఘవర్షుని రాజప్రతినిధి,బంధువు అయిన శంకరగండరస శాసనముంది. కాకతీయుల కాలంలో కాకతీయ సైనికులు ఎక్కటీలు(ఒక్కరే అనేక ఆయుధాలతో పోరాడగల సైనికులు, ఇప్పటి కమెండోలవంటివారు) రుద్రదేవుని పేరన ఆకునూరులో రుద్రేశ్వరాలయం కట్టించినపుడు వేసిన కాకతీయ శాసనం వుంది. ఈ రెండు శాసనాలు చారిత్రకంగా చాలా విలువైనవి. ఈ శాసనాలలో మనం ఆనాటి సామాజిక సంస్కృతిని తెలుసుకునే ఆధారాలున్నాయి.

కొలనుపాక ఆకునూరు బంధం...…

తేదీలేని ఆకునూరు(Akunuru) మొదటి శాసనం మహాసామంతాధిపతి, రట్ట శూరరు, జయధీర, విట్టి నారాయణ, ధర్మరత్నాకర, బిరుదులున్న శంకరగండరస కొలనుపాక-20,000ను పాలిస్తున్న సమయంలో ఆకునూరు పాలకుడు ఇందుపయ్య కొలనుపాకలోని జైనబసదికి ఇచ్చిన దానం, త్రవ్వించిన రట్టసముద్రం చెరువు గురించి తెలియజేస్తున్నది.

ఆకునూరులోని రెండవశాసనం......

ఆకునూరులోని రెండవశాసనం క్రీ.శ.1172 మార్చి 31నాడు వేయబడ్డది. మహామండలేశ్వరుడు, అనుమకొండ పురవరాధీశ్వరుడు, శ్రీ కాకతీయ రుద్రదేవ మహారాజు పాలనాకాలంలో ఆకునూరుకు వచ్చి తనపేరిట ఎక్కటీలు కట్టించిన రుద్రేశ్వరదేవరకు మ్రొక్కి, అంగరంగభోగానికి ఆయం(ఆదాయం) ఏర్పాటుచేసినాడు. రాటనాలు నడిపేవారు మాడలు, తోట రాట్నాల రాటనానికి 3సిన్నాలు, తమ్మళివారు 8గద్యాణాలు, గొల్లవారు 2 గద్యాణాలు, అనామికులు 4గద్యాణాలు, కుమ్మరులు 1గద్యాణం, శ్రీమంగలి 5రూకలు, వసదివారు 5రూకలు, సంకటేలు 5రూకలు, మాలకరులు 5రూకలు, మాచరాశి 5రూకలు, ఎక్కటీలు 12గద్యాణాలు, ఇంకా కొన్ని సుంకాలు వసూలు చేయడం ద్వారా దేవాలయానికి ఆదాయం కల్పించాడు.బ్రాహ్మణులకు వ్రిత్తులు ఏర్పరచినాడని శాసనసారాంశం.

రెండు దేవాలయాలు

ఆకునూరులో రెండు దేవాలయాలున్నాయి. ఒకటి శివాలయం. రెండవది రామాలయం. రెండు గుడుల మంటపాలలో ఒకేవిధమైన చాళుక్య, పూర్వకాకతీయశైలి రాతిస్తంభాలున్నాయి. శివాలయంలో చాళుక్యశైలి శివలింగం, కాకతీయశైలి శివలింగం వేర్వేరు గర్భగుడులలో ఉండటం విశేషం. శివాలయ ప్రవేశద్వారానికి రెండువైపుల ఉన్న శైవద్వారపాలకులు చతుర్భుజులు. పై చేతులలో శంఖువు, ఢమరుకాలు, అభయహస్తం, త్రిశూలాలతో ఊర్ధ్వజానుభంగిమలో నిల్చునివున్నారు. శిల్పాలులేని చాళుక్యశైలి స్తంభాలు మంటపంలో అగుపిస్తున్నాయి. జైనమతప్రభావం ఉన్నటువంటిది, పూర్తిగా కాకతీయులశైలి కలశంగా మారని పూర్వరూప కలశం దేవాలయద్వారం మీదున్నది. సర్వతోభద్రగోపురంలో, మూలబంధాసనంలో కూర్చున్న గజలక్ష్మి లలాటబింబంగా ఉన్నది. రెండువైపుల రెండు ఏనుగులచేత అభిషేకించబడుతున్న ద్విభుజి లక్ష్మీదేవి రెండు చేతులలో తామరపూమొగ్గలున్నాయి. గర్భగుడి ద్వారబంధం గజలక్ష్మి, కలశాలు కాక నిరాలంకారంగా వుంది. ఈ తీరు ద్వారబంధాలు జైనబసదులకు కనిపిస్తుంటాయి. కాకతీయశైలిలలో చెక్కిన ద్వారబంధమైతే కాదు.

ఆకునూరుకు రెండు పాటిగడ్డలు.......

ఆకునూరులో రెండుచోట్ల పాటిగడ్డలు(పాతవూరి జాడలు)న్నాయి. అందులో ఒకటి కోటిలింగాల గడ్డ. ఈ గడ్డమీదనే జైన సర్వతోభద్రశిల్పం, జైన మహావీరుని విగ్రహశకలం లభించాయి. మరొక పాటిగడ్డ కొంచెం దూరంలో వుంది. అక్కడ సాతవాహన కాలంనాటి గోటినొక్కుల డిజైన్ల ఎరుపురంగు కుండపెంకులు, కొన్ని కుండల కంఠ్లాలు, నీటికూజా ముక్కు(నీళ్ళుపోసేగొట్టం), ఎన్నో సాతవాహనకాలంనాటి ఇటుకల ముక్కలు, నూరుడు రాళ్ళు, దంపుడురాళ్ళు, దొరికాయి. ఇవికాక కొత్తరాతియుగంనాటి రాతిగొడ్డలిముక్క ఒకటి దొరికింది. అంటే ఆకునూరులో రాతియుగాలనాటినుంచి మానవుల ఆవాసాలిక్కడ వుండేవని చెప్పడానికి ఆధారాలు లభించినట్లయింది.

అక్కడే ఇక్ష్వాకుల కాలానికి చెందిన శైలిలో టెర్రకోట స్త్రీ శిల్పం దొరికింది. ఈ టెర్రకోటబొమ్మ తలపైనున్న ‘మకరిక’ శిరోజాలంకరణ, నుదుట చూడామణి, చెవులకు కుండలాలు, కను, ముక్కుతీరు నాగార్జునకొండ, కొండాపూర్ లలో దొరికిన టెర్రకోట బొమ్మలనే పోలి ఉంది ఆకునూరులో కొత్త ‘వీరులు’ విగ్రహాలు..!.

రిపోర్టింగ్ - ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

Whats_app_banner