Siddipet Swimmer: జాతీయ సివిల్ సర్వీసెస్ స్విమ్మింగ్ పోటీలకు సిద్ధిపేట టీచర్
Siddipet Swimmer: ఆటలపై ఆసక్తి అతనిని నిత్య క్రీడాకారుడిగా మార్చింది. ఐదు పదుల వయసు దాటినా నేటికి ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొంటున్నారు. ఓవైపు పలు క్రీడల్లో క్రీడాకారులకు శిక్షణనిస్తూనే తాను సైతం రాష్ట్ర, జాతీయ స్థాయిలో పాల్గొంటూ పలువురిచే ప్రశంసలు అందుకుంటున్నాడు.
Siddipet Swimmer: ప్రభుత్వ వ్యాయామ విద్యా ఉపాధ్యాయుడు జంగపల్లి వెంకట నరసయ్య సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మల్లంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యాయామ విద్యా ఉపాధ్యాయునిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. విద్యార్థి దశలో వెంకట నర్సయ్య కబడ్డీ ,వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో అంతర్ విశ్వవిద్యాలయాల స్థాయిలో పాల్గొన్నాడు.
తెలంగాణ రాష్ట్ర జట్టుకు ఎంపిక...
స్వతహాగా స్విమ్మింగ్ లో ప్రత్యేక ఆసక్తి కనపరిచే వెంకట నరసయ్య గత నెల అక్టోబర్ 18, 19వ తేదీలలో హైదరాబాదులో జరిగిన రాష్ట్రస్థాయి సివిల్ సర్వీసెస్ స్విమ్మింగ్ పోటీలో బ్రెస్ట్ స్ట్రోక్, ఫ్రీ స్టైల్, బ్యాక్ స్ట్రోక్ పోటీలలో పాల్గొని అత్యంత ప్రతిభ కనబరిచి తెలంగాణ రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు.
ఈ నెల 15 నుండి 17వ తేదీ వరకు న్యూఢిల్లీలో జరగనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ సిమ్మింగ్ పోటీల్లో భాగంగా బ్యాక్ స్ట్రోక్, ఫ్రీ స్టైల్ కేటగిరీలలో తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈ సందర్భంగా వెంకటనరసయ్య మాట్లాడుతూ బాల్యం నుండి సహజ సిద్ధంగా స్విమ్మింగ్ లో ఆసక్తి, నైపుణ్యంతోనే జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యానని, తనను ప్రోత్సహించిన అధికారులందరికీ ధన్యవాదాలు తెలిపారు.
పొన్నం ప్రభాకర్ అభినందన…
జంగపల్లి ఎంపిక పట్ల రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జిల్లా విద్యాశాఖాధికారి ఆర్. శ్రీనివాస్ రెడ్డి, డివైఎస్ఓ నాగేందర్, సిద్ధిపేట స్పోర్ట్స్ కౌన్సిల్ చైర్మన్ పాల సాయిరాం, సైక్లింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బండారుపల్లీ శ్రీనివాసులు, అక్కన్నపేట ఎంఈఓ ఎం. మొగుళ్ళ నరసింహారెడ్డి, మల్లంపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుగులోతు రంగా,ఉపాధ్యాయులు తదితరులు హర్షం వ్యక్తం చేస్తూ, ఆయనను అభినందించారు.sa