TG Rythu Bharosa Scheme : ఈసారి పెట్టుబడి సాయం లేదు..! వచ్చే రబీ సీజన్ నుంచే రైతు భరోసా, కీలక ప్రకటన-agri minister tummala nageshwar rao key statement about rythu bharosa ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Rythu Bharosa Scheme : ఈసారి పెట్టుబడి సాయం లేదు..! వచ్చే రబీ సీజన్ నుంచే రైతు భరోసా, కీలక ప్రకటన

TG Rythu Bharosa Scheme : ఈసారి పెట్టుబడి సాయం లేదు..! వచ్చే రబీ సీజన్ నుంచే రైతు భరోసా, కీలక ప్రకటన

Maheshwaram Mahendra Chary HT Telugu
Oct 19, 2024 01:05 PM IST

కేబినెట్ సబ్ కమిటీ రిపోర్టు వచ్చాకే రైతు భరోసా అమలు చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల చెప్పారు. ఈ సీజన్(వానాకాలం) కు పంట పెట్టుబడి సాయం ఉండదని… వచ్చే సీజన్ నుంచే అందిస్తామని తెలిపారు. సబ్ కమిటీ రిపోర్ట్ వచ్చాకే స్కీమ్ అమలవుతుందన్నారు.

రైతు భరోసాపై కీలక ప్రకటన
రైతు భరోసాపై కీలక ప్రకటన

వానాకాలం సీజన్ పంట పెట్టుబడి సాయంపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే సీజన్ రబీ నుంచే రైతు భరోసా ఇస్తామని చెప్పారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన… ఈ ఖరీప్ సీజన్ కు పంట పెట్టుబడి సాయం ఉండదని ఓ ప్రశ్నకు జవాబునిచ్చారు.

రైతు భరోసా స్కీమ్ పై మంత్రి ఉపసంఘం ఏర్పాటు చేశామని మంత్రి తుమ్మల తెలిపారు. సబ్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే.. స్కీమ్ ను అమలు చేస్తామని ప్రకటించారు. అంటే ఈ సీజన్ కు రైతు భరోసా ఉండబోదని… వచ్చే సీజన్ రబీ నాటికి పంట పెట్టుబడి సాయం అందిస్తామన్నారు. అర్హత ఉన్న రైతుకు ప్రతి ఎకరానికి రూ. 7500 చెల్లిస్తామని పేర్కొన్నారు.

ఈనెలఖారుకు రుణమాఫీ…!

తెలంగాణ ప్రభుత్వం రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియలో ఇప్పటికే రైతులకు రుణమాఫీ కాగా...పలు సాంకేతిక కారణాలతో పలువురికి రుణమాఫీ నిలిచిపోయింది. రుణమాఫీ కాని వారి సమస్యలు పరిష్కరించి...అర్హులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ అయ్యేలా చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు అధికారులు సాంకేతిక అడ్డంకులు తొలగించే పనిలో ఉన్నారు. మరో 15 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రభుత్వంలోని మంత్రులు ప్రకటనలు చేస్తున్నారు.

ఇదే విషయంపై ఇటీవలే మాట్లాడిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. అక్టోబర్ 31 నాటికి రూ.2 లక్షలలోపు రుణాలు ఉన్న, అర్హులైన వారందరికీ రుణమాఫీ పూర్తి చేస్తామని స్పష్టమైన ప్రకటన చేశారు. నవంబర్ 1 నుంచి రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణాలున్న రైతుల రుణమాఫీపై ప్రక్రియ చేపడతామన్నారు. దీంతో రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణాలు ఉన్న రైతులు... ముందుగా పైన ఉన్న రుణాన్ని అక్టోబర్ 31లోపు క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మొదటి పంట కాలంలోనే రూ.31 వేల కోట్ల రైతుల పంట రుణాలు మాఫీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం నల్లగొండలో మాట్లాడిన మంత్రి…ఇప్పటి వరకూ 22 లక్షల రేషన్ కార్డులు కలిగిన రైతులకు రూ.18 వేల కోట్ల రుణమాఫీ నగదు ఖాతాల్లో జమ చేశామన్నారు. ఈ నెలాఖరు నాటికి రేషన్ కార్డులు మిగిలిన 4 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామన్నారు. రూ.2 లక్షల పైన రుణాల మాఫీపై షెడ్యూల్ ప్రకటిస్తామన్నారు. ఎట్టి పరిస్థితులలో ఈ పంట కాలంలోనే రూ.31 వేల కోట్లు రుణమాఫీ చేసి తీరుతామని తుమ్మల స్పష్టం చేశారు.

Whats_app_banner