Bandi Sanjay : నా గురువు కేసీఆర్ ను కేటీఆర్ ఏం చేసిండో, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Bandi Sanjay : తన గురువు కేసీఆర్ ఆరోగ్యంపై ఆందోళనగా ఉందని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ ను కేటీఆర్ ఏమైనా చేసిరనే అనుమానం ఉందన్నారు.
Bandi Sanjay : ఆదిలాబాద్ బీజేపీ జనగర్జన సభలో కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సంచలన వ్యా్ఖ్యలు చేశారు. తన గురువు సీఎం కేసీఆర్ కనబడటం లేదని, కేటీఆర్ ఆయనను ఏదో చేశారని ఆరోపించారు. కేసీఆర్ కనిపించకపోవడం చాలా బాధగా ఉందన్నారు. కేసీఆర్ తనకు గురువని, ఆయన్ని చూసి మాట్లాడటం నేర్చుకున్నానన్నారు. కేసీఆర్ కనబడటం లేదంటే కేటీఆర్ ఏం చేసిండో అని అనుమానం కలుగుతోందన్నారు. కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉందో వివరాలను వెల్లడించాలన్నారు. తెలంగాణను కేసీఆర్ ను అప్పుల ఊబిలో నెట్టేశారని మండిపడ్డారు. కేసీఆర్ ఎందుకు రూ.5 లక్షల కోట్లు అప్పులు చేశారో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఇంకోసారి బీఆర్ఎస్ కు ఓటు వేస్తే ఐదేళ్లు బర్బాత్ అయిపోతామన్నారు. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు మంచి జరుగుతుందన్నారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కుమ్మక్కు
భైంసాలో పీడీ యాక్టు పెట్టిన ఘటనను గుర్తుచేసుకోండి. మహిళలు, యువకులపై దాడులు చేసిన వారిపై బీజేపీ ప్రభుత్వం రాగానే కఠిన చర్యలు తీసుకుంటామని బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో మోదీ రాజ్యం రాగానే.. మైనర్లపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని నడిరోడ్డుపై ఉరికించి కొడతామన్నారు. కాంగ్రెస్, ఎంఐఎం, బీజేపీ రాష్ట్రంలో అధికారం పంచుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ఏంచేసిందని ఓటు వేయాలని బండి సంజయ్ ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఒక్క గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ పూర్తి చేయలేదని విమర్శించారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు.
కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు
తెలంగాణ వచ్చేది మోదీ రాజ్యమని, దీన్ని ఎవరూ అడ్డుకోలేరని బండి సంజయ్ అన్నారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు, పట్టాలు ఇస్తే బీఆర్ఎస్ కు ఓటు వేయాలన్నారు. ఒకటో తేదీన జీతాలు, ప్రమోషన్లు, బదిలీలు సరిగ్గా చేస్తే వాళ్లకే ఓటు వేయాలన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే, రైతులకు న్యాయం చేస్తే, మహిళలపై అత్యాచారాలు అడ్డుకునే దమ్ముంటే బీఆర్ఎస్ ఓటు వేయాలన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారని విమర్శించారు. గ్రూప్ 1 పరీక్ష వాయిదాల పర్వం కొనసాగుతోందన్నారు. ప్రధాని మోదీ డబ్బులు ఇస్తే బీఆర్ఎస్ తమ పేరు ప్రచారం చేసుకుంటుందని ఆరోపించారు. బీసీ నేత కాబట్టే మోదీపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. భైంసాలో విధ్వంసం సృష్టించిన వాళ్లను బజార్ లో కొట్టాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ లోని 5 నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని అమిత్ షా ధీమాగా ఉన్నారన్నారు. ఈ తొమ్మిదిన్నరేళ్లలో కేవలం సీఎం కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని బండి సంజయ్ పేర్కొన్నారు.