London Love: టాక్సీ డ్రైవర్ మోజులో లండన్ నుంచి వచ్చేసిన వివాహిత, గోవాలో పట్టుకున్న పోలీసులు
London Love: పెళ్లై ఇద్దరు పిల్లలు తల్లైన యువతి ఓ టాక్సీ డ్రైవర్‌పై మోజుతో భర్త, పిల్లల్ని వదిలేసి లండన్ నుంచి హైదరాబాద్ వచ్చేసింది. భార్య కనిపించక పోవడంతో పోలీసుల్ని ఆశ్రయించడంతో ఓ టాక్సీ డ్రైవర్ కోసం ఇండియా వచ్చేసినట్టు గుర్తించి అవాక్కయ్యారు. ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి లండన్ విమానం ఎక్కించారు.
London Love: సోషల్ మీడియా స్నేహం మత్తులో ఓ వివాహిత భర్త, పిల్లల్ని వదిలేసి టాక్సీ డ్రైవర్ కోసం లండన్ నుంచి ఇండియా వచ్చేసింది. క్యాబ్ డ్రైవర్‌తో ఏర్పడిన పరిచయం, అతను చెప్పిన మాయమాటలు నమ్మేసి, అతనితో వెళ్లిపోయి కాపురంలో నిప్పులు పోసుకుంది. భర్త, పిల్లల్ని వదిలేసి హైదరాబాద్ వచ్చేసింది. ఆమె అచూకీ అరా తీసిన పోలీసులు విషయం తెలిసి అవాక్కయ్యారు. నాలుగు చివాట్లు పెట్టి బుద్దిగా కాపురం చేసుకోవాలని హెచ్చరించి లండన్ తిప్పి పంపారు.
లండన్‌లో స్థిర పడిన ప్రవాస కుటుంబానికి చెందిన మహిళ ఇటీవల అదృశ్యమైంది. ఆమె భర్తకు లండన్‌లో మంచి ఉద్యోగంతో పాటు వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. యూకేలో సంతోషంగా జీవిస్తున్న ఆమె ఓ టాక్సీ డ్రైవర్ వలలో పడింది. అతని మాటలు నమ్మేసి భర్త, పిల్లల్ని వదిలేసి లండన్ నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చేసింది. భార్య కనిపించడం లేదని భర్త ఫిర్యాదు చేయడంతో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పోలీసులు గాలించి ఆమె గోవాలో ఉన్నట్టు గుర్తించారు. క్యాబ్ డ్రైవర్‌తో పాటు వివాహితను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చి లండన్ విమానం ఎక్కించారు.
హైదరాబాద్ అల్వాల్ ప్రాంతానికి చెందిన జంటకు 17 ఏళ్ల క్రితం వివాహమైంది. ఈ కుటుంబం ప్రస్తుతం లండన్‌లో నివసిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో యువతి తల్లి హైదరాబాద్‌లో మృతి చెందడంతో ఆస్తికల నిమజ్జనం కోసం స్వదేశానికి వచ్చింది. స్థానికంగా ట్యాక్సీఅద్దెకు తీసుకుని తిరిగింది. క్యాబ్ డ్రైవర్ ఛార్జీలను ఆన్ లైన్లో చెల్లించింది.
ట్యాక్సీ డ్రైవర్ శివ ఆమె సెల్‌ఫోన్ నంబరును సేవ్ చేసుకుని ఆమెతో చాటింగ్ మొదలు పెట్టాడు. క్రమంగా ఆ వివాహితురాలు అతని మాయమాటలకు ఆకర్షితురాలైంది. ఈ ఏడాది సెప్టెంబరు 16న యువతి అత్త మృతి చెందడంతో , భర్త ఒంటరిగా హైదరాబాద్ వచ్చాడు. ఈ క్రమంలో లండన్‌లో ఉంటున్న యువతి పిల్లలను వదిలేసి సెప్టెంబరు 30న ఇంట్లో ఎవరికీ చెప్పుకుండా... ప్రియుడి జన్మదిన వేడుకల కోసం హైదరాబాద్ వచ్చేసింది.
తల్లి కనిపించకపోవడంతో పిల్లలు హైదరాబాద్‌లో ఉంటున్న తండ్రికి సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన లండన్ వెళ్లి ఆరా తీయడంతో భార్య హైదరాబాద్ వెళ్లినట్లు తేలింది. ఆమెను సంప్రదించేందుకు ప్రయత్నిస్తుండగా ఆమె సంబరు అందుబాటులోకి వచ్చింది. ఈ నెల 5న లండన్ రావడానికి టికెట్ తీసుకున్నానని ఓసారి, ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరానని మరోసారి, క్యాబ్ డ్రైవర్ కిడ్నాప్ చేసి శంషాబాద్‌లోని ప్రైవేట్ హాస్టల్లో ఉంచాడని మరోసారి భర్తకు చెప్పింది.
దీంతో ఆందోళనకు గురైన భర్త, హైదరాబాద్‌లో ఉన్న స్నేహితుల సాయంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సెల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా వివాహిత గోవాలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అక్కడకు వెళ్లి ఆమెను హైదరాబాద్ తీసుకొచ్చారు. ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి లండన్ పంపేశారు. వివాహితను ట్రాప్ చేసి అపహరించిన ట్యాక్సీ డ్రైవర్ శివపై కేసు నమోదు చేసి ఆర్జీఐ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.