Hyderabad : ఈడీ విచారణకు హాజరైన అజారుద్దీన్.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కేసులో 8 ముఖ్యాంశాలు
Hyderabad : భారత మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ఈడీ విచారణకు హాజరయ్యారు. అక్టోబర్ 3న ఆయనకు నోటీసులు ఇవ్వగా.. మంగళవారం ఆయన అధికారుల ఎదుట హాజరయ్యారు. తనపై తప్పుడు అభియోగాలు మోపారని ఆరోపించారు. త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తానని అజారుద్దీన్ స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లో ఈడీ విచారణకు హాజరయ్యారు ఫేమస్ క్రికెటర్ అజారుద్దీన్. మనీలాండరింగ్ కేసులో విచారణకు సంబంధించి ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. హెచ్‌సీఏ (హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్)లో రూ.3.8కోట్ల అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. 2020-23లో హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్నారు అజారుద్దీన్. ఆయనకు ఇప్పటికే ముందస్తు బెయిల్ మంజూరు అయ్యింది. అయితే.. తనపై తప్పుడు అభియోగాలు మోపారని.. విచారణ తర్వాత వివరాలు వెల్లడిస్తానని అజారుద్దీన్ స్పష్టం చేశారు.
1.కాంగ్రెస్ నేత అజారుద్దీన్‌కు అక్టోబర్ 3న ఈడీ నోటీసులు ఇచ్చింది. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మనీ లాండరింగ్ జరిగిందని.. దాదాపు రూ.20 కోట్ల అవకతవలు జరిగాయని అజారుద్దీన్‌కు నోటీసులు ఇచ్చింది ఈడీ.
2.గతంలో హెచ్‌సీఏ అధ్యక్షుడిగా పనిచేసిన అజారుద్దీన్ తన హయాంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి.
3.హైదరాబాద్‌లోని ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం కోసం.. డీజిల్ జనరేటర్లు, అగ్నిమాపక వ్యవస్థలు, క్యానోపీల సేకరణ కోసం కేటాయించిన రూ.20 కోట్లను దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
4.2023 అక్టోబర్‌లో హైదరాబాద్ పోలీసులు నాలుగు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. విశ్వాస ఉల్లంఘన, మోసం, ఫోర్జరీ, కుట్ర అభియోగాలు మోపారు.
5. హెచ్‌సీఏ అభ్యర్థన మేరకు నిర్వహించిన మార్చి 2020, ఫిబ్రవరి 2023 మధ్య ఫండ్ దుర్వినియోగంపై ఫోరెన్సిక్ ఆడిట్ జరిగింది. ప్రైవేట్ ఏజెన్సీలకు నిధుల మళ్లీంపును గుర్తించారు. ఈ వ్యవహారంపై హెచ్‌సీఏ సీఈవో సునీల్ కాంటే బోస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
6.తనపై ఫిర్యాదు చేసినప్పుడు అజారుద్దీన్ స్పందించారు. తన ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర జరిగిందని ఆరోపించారు. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత అభియోగం అని వ్యాఖ్యానించారు.
7. అజారుద్దీన్‌పై కేసుల నేపథ్యంలో ఆయన కోర్టును ఆశ్రయించారు. దీంతో 2023 నవంబర్‌లో అతనికి ముందస్తు బెయిల్ మంజూరు అయ్యింది.
8.మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద విచారణ జరిపారు. ఈ విచారణంలో భాగంగా హెచ్‌సీఏ మాజీ ఆఫీస్ బేరర్లు గడ్డం వినోద్, శివలాల్ యాదవ్, అర్షద్ అయూబ్‌ల ఇళ్లతో సహా.. తెలంగాణలోని తొమ్మిది ప్రదేశాలలో ఈడి సోదాలు నిర్వహించింది. ఈ దాడుల్లో డిజిటల్ పరికరాలు, నేరారోపణ పత్రాలు, లెక్కల్లో చూపని నగదు రూ.10.39 లక్షలు లభించాయి.