Karimnagar : కలకలం సృష్టిస్తున్న శిశు మరణాలు.. రెండేళ్లలో 519 మంది మృతి-519 infant deaths in karimnagar district in two years ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Karimnagar : కలకలం సృష్టిస్తున్న శిశు మరణాలు.. రెండేళ్లలో 519 మంది మృతి

Karimnagar : కలకలం సృష్టిస్తున్న శిశు మరణాలు.. రెండేళ్లలో 519 మంది మృతి

HT Telugu Desk HT Telugu
Sep 22, 2024 09:22 AM IST

Karimnagar : తొలిసారి తల్లి కాబోతున్న మహిళలకు మాతృత్వం ఓ వరం. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం.. ఎదుగుదల గురించే ఆలోచిస్తారు. అయితే.. సరైన వైద్యం లేక నెలలు నిండక ముందే ప్రసవం కావడం, తక్కువ బరువుతో జన్మించడం, జన్యులోపాలు, గుండెలో రంధ్రాలు వంటి కారణాలతో శిశువులు చనిపోతున్నారు. ఇది ఆందోళన కలిగిసస్తోంది.

కలకలం సృష్టిస్తున్న శిశు మరణాలు
కలకలం సృష్టిస్తున్న శిశు మరణాలు

కరీంనగర్ జిల్లాలో శిశు మరణాలు కలకలం సృష్టిస్తున్నాయి. రెండేళ్ల వ్యవధిలో ఏకంగా 519 మంది పసికందులు చనిపోయారు. మృతుల్లో 90 శాతం గ్రామీణ ప్రాంతాలకు చెందిన సామాన్య మధ్యతరగతి, నిరుపేద కుటుంబాలకు చెందిన వారే. శిశు మరణాలు.. గ్రామీణ పేదలను, అధికారులను ఆందోళనకు గురి చేస్తుంది. శిశు మరణాలను అరికట్టేందుకు గర్భిణీలకు పౌష్టికాహారం అందించి, ఆరోగ్య సూత్రాలు పాటించేలా కరీంనగర్ కలెక్టర్ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

పౌష్టికాహార లోపంతో కడుపులోని బిడ్డ శరీర అవయవాలు ఎదగకపోవడం, శ్వాసకోశ సమస్యలు శిశు మరణాలను పెంచుతున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 2023లో 350 మంది, ఈ ఏడాదిలో ఇప్పటివరకు 169 మంది.. మొత్తం 519 మంది పసికందులు చనిపోయారు. ఇన్ఫాంట్ మెటర్నిటీ రేట్ (ఐఎంఆర్).. అంటే ప్రతీ 1000 మంది పిల్లల్లో మొదటి పుట్టిన రోజు జరుపుకోకుండానే మృతి చెందినవారి సంఖ్యలో కరీంనగర్‌లో 23గా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

కరీంనగర్ జిల్లాలో మాతాశిశు ఆరోగ్య కేంద్రంతో పాటు.. 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరు పట్టణ ఆరోగ్య కేంద్రాలు, మూడు కమ్యూనిటీ ఆస్పత్రుల్లో గర్భిణులకు వైద్యసేవలు సేవలందిస్తున్నారు. కానీ, డెలివరీలు మాత్రం మాతాశిశు ఆరోగ్య కేంద్రం, హుజూరాబాద్, జమ్మికుంట ఆసుపత్రిల్లో మాత్రమే జరుగుతున్నాయి. ఇన్ని ప్రభుత్వ ఆస్పత్రులున్నా.. వైద్యులు సమయపాలన పాటించకపోవడంతో కొన్నిచోట్ల ఇబ్బందులు వస్తున్నాయనే ఆరోపణలున్నాయి.

అవగాహన లోపమే కారణం..

ఆరోగ్యం, ఆహారంపై దృష్టి లేదు. కడుపులో బిడ్డ ఆరోగ్యంగా పెరగాలంటే గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలి. కానీ, గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలు ఆరోగ్యం ఆహారంపై దృష్టిపెట్టడం లేదు. గర్భం దాల్చిన నాటినుంచి ప్రతినెలా వైద్యులను సంప్రదించి మందులు వాడాలి. కానీ, తీరిక దొరికినప్పుడే ఆస్పత్రికి వెళ్తూ.. మందులు ఇష్టానుసారంగా వాడుతున్నారు. సరైన అవగాహన లేకపోవడంతో 50 శాతం మంది రక్తహీనతతో బాధ పడుతున్నారు.

కొందరిలో హైబీపీ, డయాబెటిక్, థైరాయిడ్, మూర్చ వంటి సమస్యలు ఉంటున్నాయి. దీనివల్ల పుట్టబోయే పిల్లలు అనారోగ్యంతో, ఒక్కోసారి మృత శిశువుగా కూడా జన్మిస్తున్నారు. దీన్ని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్న గర్భిణులకు ఒక్కొక్కరికి రెండు సార్లు న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేస్తోంది.

కలెక్టర్ ప్రత్యేక చొరవ..

జిల్లాలో శిశు మరణాలు విస్మయానికి గురిచేస్తుండడంతో.. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. స్త్రీ, శిశు సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషిని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి అవగాహన కల్పించేందుకు శుక్రవారం సభ కార్యక్రమం చేపట్టారు. ప్రతి శుక్రవారం గ్రామాల్లో అంగన్వాడీల ఆధ్వర్యంలో ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. పౌష్టికాహారం అందించనున్నారు.

ప్రతి మంగళ, గురువారాల్లో మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మూడు నెలలకు ఒకసారి మహిళలు తప్పక ఆరోగ్య పరీక్షలు చేయించుకునేలా చర్యలు చేపట్టారు. సమయం ప్రకారం వైద్య పరీక్షలు చేయించుకోకపోవడం వల్లే మరణించిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని కలెక్టర్ వివరించారు. గర్భిణీ ఆరోగ్య పరిస్థితి గురించి స్థానిక ఆరోగ్య కార్యకర్త, అంగన్వాడీ, ఏఎన్ఎం సిబ్బందికి ఎక్కువగా అవగాహన ఉంటుందని.. వారి సమక్షంలో ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ కావడం మంచిదని సూచిస్తున్నారు.

(రిపోర్టింగ్- కె వి రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రతినిధి, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)