Harish launches KCR Nutrition Kit : కేసీఆర్ వి న్యూట్రిషన్ పాలిటిక్స్ - విపక్షాలవి పార్టీషన్ పాలిటిక్స్ : హరీశ్ రావు-minister harish rao launches kcr nutrition kit at kamareddy ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Minister Harish Rao Launches Kcr Nutrition Kit At Kamareddy

Harish launches KCR Nutrition Kit : కేసీఆర్ వి న్యూట్రిషన్ పాలిటిక్స్ - విపక్షాలవి పార్టీషన్ పాలిటిక్స్ : హరీశ్ రావు

HT Telugu Desk HT Telugu
Dec 21, 2022 04:46 PM IST

Harish launches KCR Nutrition Kit : మాతా శిశు సంరక్షణకు పెద్ద పీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో విప్లవాత్మకమైన పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలో ఇప్పటికే ప్రారంభించిన కేసీఆర్‌ కిట్‌ సూపర్‌ హిట్‌ కాగా, ఇదే స్ఫూర్తితో కేసీఆర్‌ న్యూట్రీషన్‌ కిట్ల పంపిణీ చేపట్టింది. కిట్లు అందించే కార్యక్రమాన్ని మంత్రి హరీశ్ రావు కామారెడ్డి జిల్లాలో ప్రారంభించారు.

మంత్రి హరీశ్ రావు
మంత్రి హరీశ్ రావు

Harish launches KCR Nutrition Kit : రాష్ట్రంలో గర్భిణులు రక్తహీనతతో బాధపడకూడదని... సంపూర్ణ ఆరోగ్యంతో పండంటి బిడ్డకు జన్మనిచ్చి.. తల్లి, బిడ్డ క్షేమంగా ఉండాలనే సంకల్పంతో... ముఖ్యమంత్రి కేసీఆర్.. న్యూట్రిషన్ కిట్లు ఇస్తున్నారని ... ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. తల్లి మనసుతో ఆలోచించి కేసీఆర్ ఈ పథకాన్ని తీసుకొచ్చారని చెప్పారు. బిడ్డ కడుపులో పడగానే కేసీఆర్ న్యూట్రీషన్ కిట్.. కాన్పు కాగానే కేసీఆర్ కిట్ ఇస్తూ... తల్లీ బిడ్డల ఆరోగ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి మంత్రి హరీశ్ రావు.. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని వర్చువల్ గా 9 జిల్లాల్లో ప్రారంభించారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ... పేద మహిళల క్షేమం కోసం ఆలోచించే కేసీఆర్ ఈ గొప్ప పథకానికి రూపకల్పన చేశారని వెల్లడించారు. ప్రతి గర్భిణికి రెండు సార్లు ఇచ్చే ఈ కిట్ లను కేవలం వారు మాత్రమే ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రస్తుతం రక్తహీనత ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఈ స్కీమ్ ను ప్రారంభించామని... త్వరలో అన్ని జిల్లాల్లో అమలు చేస్తామని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా... కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మంత్రి హరీశ్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం పనులు ఎక్కువగా చేస్తుంటే.. మోదీ ప్రభుత్వం పన్నులు ఎక్కువగా వేస్తోందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ న్యూట్రిషన్ పాలిటిక్స్ చేస్తుంటే... విపక్షాలు పార్టీషన్ ( విభజన) పాలిటిక్స్ చేస్తున్నాయని ఆరోపించారు. ప్రజలకు ఏం కావాలో ఆలోచించే నాయకుడు కేసీఆర్ అని అన్నారు. కళ్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, అమ్మ ఒడి వాహనాలను.. ఎవరూ అడగకున్నా.. ప్రజల మేలు కోసం కేసీఆర్ ఈ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో మాతాశిశు మరణాలు బాగా తగ్గాయని హరీశ్ చెప్పారు.

అత్యధికంగా ఎనీమియా (రక్త హీనత) ప్రభావం ఉన్న 9 జిల్లాలు ఆదిలాబాద్‌, భ‌ద్రాద్రి కొత్తగూడెం, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, జోగులాంబ గ‌ద్వాల్‌, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, ములుగు, నాగ‌ర్ క‌ర్నూల్‌, వికారాబాద్ ల‌లో ఈ కిట్లను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. అంచనాల ప్రకారం, 1.25 లక్షల మంది గ‌ర్బిణుల‌కు ఇది ఉప‌యోగ‌ప‌డనుంది. మొత్తంగా రెండున్నర లక్షల కిట్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దీని కోసం ప్రభుత్వం రూ. 50 కోట్లు ఖర్చు చేస్తోంది.

ప్రోటీన్స్‌, మిన‌ర‌ల్స్‌, విట‌మిన్స్ ల‌ను పోష‌కాహారం ద్వారా అందించి ర‌క్త హీన‌త త‌గ్గించ‌డం, హీమోగ్లోబిన్ శాతం పెంచ‌డం న్యూట్రీషన్‌ కిట్ల లక్ష్యం. ఇందులో భాగంగా ఒక్కో కిట్‌కు రూ. 2000 తో రూపొందించి, కిట్లను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. 13-27 వారాల మధ్య జరిగే రెండో ఏఎన్‌సీ చెకప్‌ సమయంలో ఒకసారి.... 28-34 వారాల మధ్య చేసే మూడో ఏఎన్‌సీ చెకప్‌ సమయంలో రెండో సారి ఈ కిట్లను ఇస్తారు. 9 జిల్లాల్లోని 231 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ప్రభుత్వం ఈ పంపిణీ జరుగుతుంది.

న్యూట్రీషన్‌ కిట్లలో ఉండేవి…

1. కిలో న్యూట్రీష‌న్ మిక్స్ పౌడ‌ర్

2. కిలో ఖ‌ర్జూర‌

3. ఐర‌న్ సిర‌ప్ 3 బాటిల్స్‌

4. 500 గ్రాముల నెయ్యి

5. ఆల్‌బెండ‌జోల్ టాబ్లెట్‌

6. కప్పు

7. ప్లాస్టిక్ బాస్కెట్‌

మాతా శిశు సంరక్షణ కోసం ఇప్పటికే అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మాతృ మరణాలు తగ్గించడంలో గొప్ప వృద్ధిని నమోదు చేసింది. ఈ నెలలో కేంద్ర ప్రభుత్వ శాంపిల్‌ రిజిస్ట్రేషన్‌ సర్వే ప్రకారం, మాతృ మరణాల రేటు 2014లో 92 ఉండగా, ప్రస్తుతానికి 43కు తగ్గింది. మాతృమరణాలు తగ్గించడంలో దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. ఈ సంఖ్యను మరింత తగ్గించేందుకు గాను కేసీఆర్‌ న్యూట్రీషన్‌ కిట్స్‌ పథకాన్ని అమలు చేస్తోంది.

IPL_Entry_Point