WTC final: రేపే ఇంగ్లండ్‌కు కోహ్లి.. మరో ఏడుగురు కూడా..-wtc final to be held in june as kohli and seven others heading to england on june 7th ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Wtc Final To Be Held In June As Kohli And Seven Others Heading To England On June 7th

WTC final: రేపే ఇంగ్లండ్‌కు కోహ్లి.. మరో ఏడుగురు కూడా..

Hari Prasad S HT Telugu
May 22, 2023 05:41 PM IST

WTC final: రేపే ఇంగ్లండ్‌కు కోహ్లితోపాటు మరో ఏడుగురు కూడా వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. జూన్ 7 నుంచి ప్రారంభం కానున్న డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం తొలి విడతగా మంగళవారం (మే 23) వీళ్లు వెళ్లనున్నట్లు సమాచారం.

డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం మంగళవారమే ఇంగ్లండ్ వెళ్లనున్న విరాట్ కోహ్లి
డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం మంగళవారమే ఇంగ్లండ్ వెళ్లనున్న విరాట్ కోహ్లి (AFP)

WTC final: ఐపీఎల్ చివరి వారానికి వచ్చేసింది. ఇక సీన్ ఐపీఎల్ నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరనుంది. జూన్ 7 నుంచి ఓవల్ లో ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. దీనికోసం టీమిండియాలోని కొందరు ప్లేయర్స్ మంగళవారమే (మే 23) ఇంగ్లండ్ కు వెళ్లనున్నట్లు స్పోర్ట్స్ స్టార్ తన రిపోర్టులో వెల్లడించింది. తొలి విడతగా 8 మంది ప్లేయర్స్ ఇంగ్లండ్ ఫ్లైటెక్కనున్నారు.

ట్రెండింగ్ వార్తలు

ఐపీఎల్లో ఇప్పటికే ఇంటికెళ్లిపోయిన టీమ్స్ లోని ప్లేయర్స్ ఈ ఫస్ట్ బ్యాచ్ లో ఉన్నారు. ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, ఆ టీమ్ ప్లేయర్ మహ్మద్ సిరాజ్ కూడా వీళ్లలో ఉన్నారు. ఆర్సీబీ ప్లేఆఫ్స్ చేరకుండానే ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరితోపాటు స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్, పేసర్లు ఉమేష్ యాదవ్, జైదేవ్ ఉనద్కట్ ఉన్నారు.

నిజానికి జైదేవ్ ఉనద్కట్ ఐపీఎల్ టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్స్ చేరుకున్నా.. అతడు అంతకుముందే గాయం కారణంగా టీమ్ కు దూరమయ్యాడు. అటు ఉమేష్ యాదవ్ కూడా ముందే టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఈ ఇద్దరూ ఇప్పటికే నేషనల్ క్రికెట్ అకాడెమీలో ఫిట్‌నెస్ టెస్టులు పాసైనట్లు తెలిసింది. ఈ ఏడుగురితోపాటు రిజర్వ్ ప్లేయర్స్ లో ఉన్న ముకేశ్ కుమార్ కూడా ఇంగ్లండ్ వెళ్లనున్నాడు.

చెతేశ్వర్ పుజారా ఇప్పటికే ఇంగ్లండ్ లో ఉన్నాడు. అతడు ససెక్స్ టీమ్ తరఫున కౌంటీ క్రికెట్ ఆడుతున్నాడు. ఇక వీళ్లు కాకుండా రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, మహ్మద్ షమి, కేఎస్ భరత్, అజింక్య రహానేలాంటి వాళ్లు ఐపీఎల్ ప్లేఆఫ్స్ ఆడుతున్న జట్లలో ఉన్నారు. వీళ్లు ఐపీఎల్ ముగిసిన తర్వాతే ఇంగ్లండ్ వెళ్తారు. మరోవైపు ఈ డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడబోయే ఆస్ట్రేలియా నుంచి కేవలం ముగ్గురు ప్లేయర్స్ మాత్రమే ఐపీఎల్లో ఆడారు.

రెండు నెలల పాటు ఐపీఎల్ ఆడి అలసిపోయిన ఇండియన్ ప్లేయర్స్ కంటే ఆస్ట్రేలియా మానసికంగా మరింత మెరుగ్గా సంసిద్ధమైందని ఆ టీమ్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అన్న విషయం తెలిసిందే. డబ్ల్యూటీసీ తొలి ఫైనల్లో ఆడిన టీమిండియా.. న్యూజిలాండ్ చేతుల్లో ఓడిపోయింది. ఇప్పుడు వరుసగా రెండోసారి ఈ ఫైనల్లో ఆడబోతోంది.

WhatsApp channel

సంబంధిత కథనం