IPL 2023 Sixes Record: మోత మోగిస్తున్నారు.. సిక్స్‌లలోనూ ఐపీఎల్ 2023 కొత్త రికార్డు-ipl 2023 sixes record as this season surpassed the previous season for most number of sixes
Telugu News  /  Sports  /  Ipl 2023 Sixes Record As This Season Surpassed The Previous Season For Most Number Of Sixes
ఈ ఏడాది 36 సిక్స్‌లతో టాప్ లో ఉన్న ఫాఫ్ డుప్లెస్సి
ఈ ఏడాది 36 సిక్స్‌లతో టాప్ లో ఉన్న ఫాఫ్ డుప్లెస్సి (IPL Twitter)

IPL 2023 Sixes Record: మోత మోగిస్తున్నారు.. సిక్స్‌లలోనూ ఐపీఎల్ 2023 కొత్త రికార్డు

22 May 2023, 15:28 ISTHari Prasad S
22 May 2023, 15:28 IST

IPL 2023 Sixes Record: మోత మోగిస్తున్నారు.. సిక్స్‌లలోనూ ఐపీఎల్ 2023 కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ ఏడాది పరుగుల వరద పారుతున్న నేపథ్యంలో సిక్స్‌ల పరంగానూ ఈ సీజన్ గతంలోని అన్ని రికార్డులను బ్రేక్ చేసింది.

IPL 2023 Sixes Record: ఈ ఏడాది ఐపీఎల్లో పరుగుల వరద పారుతున్న సంగతి తెలుసు కదా. బ్యాటర్లు పండగ చేసుకుంటున్న ఈ సీజన్ లో ఇప్పటికే ఒక ఇన్నింగ్స్ లో 200కుపైగా స్కోర్లు అత్యధిక సార్లు నమోదైన రికార్డు నమోదైంది. ఇక తాజాగా సిక్స్‌ల రికార్డు కూడా బ్రేకయింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్స్‌లు నమోదైన సీజన్ గా ఐపీఎల్ 2023 నిలిచింది.

ఇంకా ప్లేఆఫ్స్ మ్యాచ్ లు మిగిలి ఉండగానే.. సిక్స్ ల రికార్డు బ్రేకవడం విశేషం. ఆదివారం (మే 21) ఆర్సీబీ, జీటీ మధ్య జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో ఈ రికార్డు నమోదైంది. జీటీ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కొట్టిన సిక్స్ తో ఈ రికార్డు క్రియేటైంది. అతడు ఈ సీజన్ లో జరిగిన 70వ మ్యాచ్ లో 1063వ సిక్స్ బాదాడు. దీంతో 2022లో నమోదైన 1062 సిక్స్ ల రికార్డు బ్రేకయింది.

ఇంకా ప్లేఆఫ్స్ మ్యాచ్ లు మిగిలి ఉన్న నేపథ్యంలో ఈ సిక్సర్ల రికార్డు మరింత మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. ఐపీఎల్ 2023లో లీగ్ స్టేజ్ ముగిసిన విషయం తెలిసిందే. మంగళవారం (మే 23) నుంచి ప్లేఆఫ్స్ మ్యాచ్ లు జరగబోతున్నాయి. గుజరాత్ టైటన్స్ తో పాటు చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ లో తలపడనున్నాయి.

ఐపీఎల్లో గతేడాదే తొలిసారి వెయ్యికిపైగా సిక్స్ లు నమోదయ్యాయి. ఇప్పుడు వరుసగా రెండో ఏడాది కూడా వెయ్యికి పైగా సిక్స్‌లు బాదడం విశేషం. అంతకుముందు 2018లో 872 సిక్స్ లతో తొలి స్థానంలో ఉండేది. ఇప్పుడా సీజన్ మూడోస్థానానికి పడిపోయింది.

అత్యధిక సిక్స్‌లలో టాప్ 5 వీళ్లే

ఇక ఈ సీజన్ లో అత్యధిక సిక్స్ లు కొట్టిన వాళ్లలో ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెస్సి టాప్ లో ఉన్నాడు. అతడు 730 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా ఉండగా.. 36 సిక్స్ లతో టాప్ ప్లేస్ సొంతం చేసుకున్నాడు.

ఇక రెండో స్థానంలో 33 సిక్స్ లతో శివమ్ దూబె, 31 సిక్స్ లతో గ్లెన్ మ్యాక్స్‌వెల్ మూడోస్థానంలో, 29 సిక్స్ లతో రింకు సింగ్ నాలుగోస్థానంలో, 28 సిక్స్ లతో రుతురాజ్ గైక్వాడ్ ఐదోస్థానంలో ఉన్నారు. చెన్నై ప్లేఆఫ్స్ చేరడంతో శివమ్ దూబె, రుతురాజ్ గైక్వాడ్ అత్యధిక సిక్స్ ల రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉంది.

సంబంధిత కథనం