What is Dexa Scan Test: టీమిండియా ప్లేయర్స్‌ ఫిట్‌నెస్‌ తెలుసుకోవడానికి డెక్సా టెస్ట్‌.. ఇదేంటో తెలుసా?-what is dexa scan test bcci introduced for team india players ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  What Is Dexa Scan Test Bcci Introduced For Team India Players

What is Dexa Scan Test: టీమిండియా ప్లేయర్స్‌ ఫిట్‌నెస్‌ తెలుసుకోవడానికి డెక్సా టెస్ట్‌.. ఇదేంటో తెలుసా?

Hari Prasad S HT Telugu
Jan 02, 2023 07:09 AM IST

What is Dexa Scan Test: టీమిండియా ప్లేయర్స్‌ ఫిట్‌నెస్‌ తెలుసుకోవడానికి డెక్సా స్కాన్‌ టెస్ట్‌ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. దీంతోపాటు యో యో టెస్ట్‌ను కూడా తప్పనిసరి చేసింది. అయితే ఈ డెక్సా టెస్ట్‌ ఏంటన్నది మాత్రం చాలా మందికి తెలియని విషయం.

ప్లేయర్స్ ఫిట్ నెస్ పై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించిన బీసీసీఐ
ప్లేయర్స్ ఫిట్ నెస్ పై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించిన బీసీసీఐ (AFP)

What is Dexa Scan Test: ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌లోకి ఎంపిక కావడానికి ఆట మాత్రమే సరిపోదు. అందుకు తగిన ఫిట్‌నెస్‌ కూడా నిరూపించుకోవాలి. దీనికోసం చాలా రోజులుగా యో యో టెస్ట్‌ నిర్వహిస్తున్నారు. ఈ టెస్ట్‌ ఎలా ఉంటుందో చాలా మంది క్రికెట్‌ అభిమానులకు తెలుసు. అయితే కరోనా తర్వాత ఈ యో యో కాస్త కష్టమే అని భావించిన బోర్డు.. ప్లేయర్స్‌ 2 కి.మీ. (7.30 నిమిషాల లోపు) పరుగు ద్వారా ఫిట్‌నెస్‌ నిర్ణయించాలని భావించారు.

ట్రెండింగ్ వార్తలు

దీంతో కొన్నాళ్ల పాటు యో యోను పక్కన పెట్టారు. కానీ తాజాగా బీసీసీఐ ఆదివారం (జనవరి 1) జరిపిన రివ్యూ మీటింగ్‌లో మరోసారి యో యోను తప్పనిసరి చేశారు. దీంతోపాటు డెక్సా స్కాన్‌ ఫలితాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించించారు. కేవలం యో యో స్కోరుపై ఆధారపడటం సరి కాదని, నైపుణ్య ఆధారిత టెస్ట్‌ కూడా నిర్వహించాలన్న ఉద్దేశంతో డెక్సా స్కాన్‌ టెస్ట్‌ నిర్వహించాలని బీసీసీఐకి సిఫారసు చేసినట్లు ఇండియన్‌ టీమ్‌ మాజీ కండిషనింగ్ కోచ్‌ రామ్‌జీ శ్రీనివాసన్‌ వెల్లడించాడు.

అసలేంటీ డెక్సా స్కాన్‌ టెస్ట్?

2011లోనే తాను ఈ సిఫారసు చేసినట్లు చెప్పాడు. ఈ టెస్ట్‌ ద్వారా క్రికెటర్ల శరీరంలోని కొవ్వు శాతం, కండరాల శక్తి, శరీరంలోని నీరు, ఎముక దృఢత్వంలాంటివి తెలుసుకోవచ్చని అతడు వెల్లడించాడు. శరీరంలో ఎక్కడ కొవ్వు ఎక్కువగా ఉందో తెలుసుకోవడంతోపాటు ప్రస్తుతం ట్రైనింగ్‌ పద్ధతులు సరైన ఫలితాలను అందిస్తున్నాయా తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని తెలిపాడు.

క్రికెటర్లలో కొవ్వు శాతం ఎంత వరకూ ఉండొచ్చు?

ఈ మధ్య ఇండియన్‌ టీమ్‌లో గాయాల బెడద ఎక్కువైంది. కొందరు ప్లేయర్స్‌ తమ గాయాలను దాచి పెట్టి టీమ్‌లోకి రావడానికి తొందర పడుతున్నారు. ఇలాంటి ప్లేయర్స్‌ ఫిట్‌నెస్‌ను మరింత క్షుణ్ణంగా పరిశీలించాలని బీసీసీఐ నిర్ణయించింది. అందులో భాగంగానే ఈ డెక్సా స్కాన్‌ టెస్ట్‌ను తప్పనిసరి చేసింది.

దీని ప్రకారం.. ఓ క్రికెటర్‌ శరీరంలో కొవ్వు శాతం 10 కంటే తక్కువగా ఉండాలని రామ్‌జీ శ్రీనివాసన్‌ చెప్పాడు. ఒకవేళ 10 నుంచి 12 మధ్య ఉంటే అది తగ్గించుకోవాల్సిందేనని తెలిపాడు. నిజానికి ఫుట్‌బాల్ ప్లేయర్స్‌కు ఇది 5-8 శాతం వరకే ఉండాలని, క్రికెటర్లకు మాత్రం 10 వరకూ ఉన్నా ఫర్వాలేదని తెలిపాడు. శరీరంలో కొవ్వు తక్కువగా ఉంటే.. కండరాల శక్తి ఎక్కువగా ఉంటుందని, దీని కారణంగా శరీరానికి ఎక్కువ బలం, శక్తి, వేగం, చురుకుదనం లభిస్తాయని చెప్పాడు.

డెక్సా స్కాన్‌ టెస్ట్‌ ద్వారా క్రికెటర్ల పూర్తి ఫిట్‌నెస్‌ను అంచనా వేయడంతోపాటు ఆటగాడిని బట్టి ప్రత్యేకంగా రోజువారీ కార్యకలాపాలు, ఆహారం, శిక్షణ పద్ధతులను నిర్ణయించే వీలు కలుగుతుంది. కీలక ప్లేయర్స్‌ పెద్ద టోర్నీలకు ముందు గాయపడి దూరం కావడం వల్ల ఆ ప్రభావం టీమ్‌ విజయావకాశాలపై పడుతుంది. దీంతో ఆట కంటే ముందు ప్లేయర్‌ ఫిట్‌నెస్‌ను సమగ్రంగా అంచనా వేయాలని బీసీసీఐ నిర్ణయించింది.

2021 అయినా, 2022 టీ20 వరల్డ్‌కప్‌ అయినా గాయాల కారణంగా కొందరు కీలక ఆటగాళ్లు లేకుండా ఇండియన్‌ టీమ్‌ బరిలోకి దిగింది. దీంతో ఈ మెగా టోర్నీల్లో వైఫల్యాలు తప్పలేదు. ప్రస్తుతం బుమ్రా, జడేజా, దీపక్‌ చహర్‌, వాషింగ్టన్‌ సుందర్‌లాంటి ప్లేయర్స్‌ గాయాల కారణంగా తరచూ కీలక సిరీస్‌కు దూరమవుతున్నారు. ఈ ఏడాది సొంతగడ్డపై జరుగుతున్న వరల్డ్‌కప్‌లో ఇలాంటి చేదు అనుభవాలు ఎదురు కాకుండా ఉండేందుకు ఇప్పటి నుంచే బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది.

ఇప్పటికే 20 మంది ప్లేయర్స్‌ను ఈ మెగా టోర్నీ కోసం షార్ట్‌ లిస్ట్‌ చేసింది. ఫిట్‌నెస్‌ విషయంలో కఠినంగా వ్యవహరించడం వల్ల తరచూ గాయాలు, మ్యాచ్‌లపై వాటి ప్రభావాన్ని తగ్గించాలని చూస్తోంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్