Vijay Mallya: క్రిస్‌ గేల్‌ను కలిసిన విజయ్‌ మాల్యా.. వైరల్‌గా మారిన ఫొటో-vijay mallya met chris gayle and pic is now going viral now ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Vijay Mallya Met Chris Gayle And Pic Is Now Going Viral Now

Vijay Mallya: క్రిస్‌ గేల్‌ను కలిసిన విజయ్‌ మాల్యా.. వైరల్‌గా మారిన ఫొటో

Hari Prasad S HT Telugu
Jun 22, 2022 09:24 AM IST

విజయ్‌ మాల్యా, క్రిస్‌ గేల్‌ కలిసిన ఫొటో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ ఫొటో చూసినప్పటి నుంచీ సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ ఓ రేంజ్‌లో రీట్వీట్లు, కామెంట్స్‌, లైక్స్‌, షేర్స్‌ చేస్తున్నారు.

క్రిస్ గేల్ తో విజయ్ మాల్యా
క్రిస్ గేల్ తో విజయ్ మాల్యా (Vijay Mallya Twitter)

న్యూయార్క్‌: ఒకరు లికర్‌ కింగ్‌.. మరొకరు యూనివర్స్‌ బాస్‌.. ఈ లికర్‌ కింగ్‌ ఒకప్పుడు ఈ యూనివర్స్‌ బాస్‌ను తన టీమ్‌లోకి తీసుకున్నాడు. అతడు వచ్చిన తర్వాతే రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు రాత మారింది. ఇన్నాళ్ల తర్వాత ఈ ఇద్దరూ ఒక్క చోట చేరడంపై ఇంటర్నెట్‌లో పెద్ద చర్చే నడుస్తోంది. విజయ్‌ మాల్యా, క్రిస్‌ గేల్‌ కలిసి దిగిన ఫొటో ఇది.

నిజానికి క్రిస్‌ గేల్‌ రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌లోకి వచ్చిన తర్వాతే ఐపీఎల్‌లో పరుగుల సునామీ అంటే ఏంటో ప్రపంచానికి తెలిసొచ్చింది. తనను తాను యూనివర్స్‌ బాస్‌గా చెప్పుకున్న గేల్‌.. ఆర్సీబీ తరఫున ఎన్నో మరుపురాని ఇన్నింగ్స్‌ ఆడాడు. అందులో 30 బాల్స్‌లోనే సెంచరీ చేసిన ఇన్నింగ్స్‌ కూడా ఉంది. ఇలాంటి ఇన్నింగ్స్‌తోనే డివిలియర్స్‌తో కలిసి ఐపీఎల్‌ తొలి హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లోకి ఎక్కిన ప్లేయర్‌గా క్రిస్‌ గేల్‌ నిలిచాడు.

గేల్‌ను కలిసిన సందర్భంగా మాల్యా ఇవే జ్ఞాపకాలను పంచుకున్నాడు. తన ట్విటర్‌లో గేల్‌తో కలిసి ఫొటోను షేర్‌ చేస్తూ.. "నా మంచి స్నేహితుడు, యూనివర్స్‌ బాస్‌ క్రిస్టొఫర్‌ హెన్రీ గేల్‌తో కలవడం చాలా ఆనందంగా ఉంది. అతన్ని నేను ఆర్సీబీలోకి తీసుకున్నప్పటి నుంచే ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఇప్పటికీ ఇదే అత్యుత్తమ ప్లేయర్‌ ఎంపిక" అని మాల్యా అన్నాడు.

క్రిస్‌ గేల్‌ 2011లో ఆర్సీబీలో చేరాడు. 2017 వరకూ అదే టీమ్‌కు ఆడాడు. 91 మ్యాచ్‌లలో ఏకంగా 3420 రన్స్‌ చేశాడు. అతని స్ట్రైక్‌ రేట్‌ 154 కాగా.. 5 సెంచరీలు, 21 హాఫ్‌ సెంచరీలు కూడా చేశాడు. ఇప్పటికీ ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు అయిన 175 రన్స్‌ను గేల్‌ ఆర్సీబీ తరఫునే చేశాడు. ఈ మధ్యే గేల్‌ తన మరో ఐపీఎల్‌ ఓనర్‌ ప్రీతి జింటాను కూడా కలిశాడు.

లికర్‌ కింగ్‌గా పేరుగాంచి, బ్యాంకులకు వేల కోట్ల ఎగనామం పెట్టిన మాల్యా దేశం వదిలి పారిపోయిన విషయం తెలిసిందే. లండన్‌లో తలదాచుకున్న అతన్ని ఇండియాకు అప్పగించాల్సిందిగా 2019లోనే యూకే కోర్టు ఆదేశించినా.. ఇంకా అతన్ని దేశానికి తీసుకురాలేకపోయారు. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌తోపాటు యూబీ గ్రూప్‌ ఛైర్మన్‌గా ఉన్న మాల్యా.. 2008లో ఆర్సీబీ టీమ్‌ను కొనుగోలు చేశాడు.

WhatsApp channel

టాపిక్