UP Warriorz vs Gujarat Giants: వరుసగా రెండోసారి ఓడిన గుజరాత్.. అదరగొట్టిన యూపీ
UP Warriorz vs Gujarat Giants: డబ్ల్యూపీఎల్ 2023లో భాగంగా ముంబయి డీవై పాటిల్ స్టేడియం వేదికగా గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్ విజయం సాధించింది. చివరి వరకు పోరాడి 3 వికెట్ల తేడాతో గెలిచింది. యూపీ బ్యాటర్ గ్రేస్ హ్యారిస్ అద్భుత అర్ధశతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది.
UP Warriorz vs Gujarat Giants: వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ పరాజయం పాలైంది గుజరాత్ జెయింట్స్. ఆరంభ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ చేతిలో ఘోరంగా ఓడిన గుజరాత్.. ఆదివారం నాడు యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి వరకు పోరాడి పరాజయం పాలైంది. ముంబయి డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో యూపీపై 3 వికెట్ల తేడాతో ఓడింది. 170 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని యూపీ చివరి ఓవర్ వరకు ఆడి ఛేదించింది. యూపీ బ్యాటర్లలో కిరణ్ నావ్‌గిరే(53), గ్రేస్ హ్యారిస్(59) అర్ధశతకాలతో రాణించి జట్టుకు విజయాన్ని అందించారు. గుజరాత్ బౌలర్లలో కిమ్ గార్త్ 5 వికెట్లు తీసినప్పటికీ తమ టీమ్‌కు గెలుపును అందించలేకపోయింది.
170 పరుగుల లక్ష్య ఛేధనలో బరిలోకి దిగిన యూపీ వారియర్స్ జట్టుకు శుభారంభమేమి దక్కలేదు మూడో ఓవర్‌లోనే ఓపెనర్ ఆలిసా హేలీని(7) కిమ్ గార్త్ ఔట్ చేసింది. అదే ఓవర్లో మరో ఓపెనర్ శ్వేత(5), తహిల మెక్‌గ్రాత్‌ను(0) ఔట్ చేసి యూపీని కోలుకోలేని దెబ్బకొట్టింది. 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడిన యూపీని కిరణ్(53), దీప్తి శర్మలు(11) ఆదుకున్నారు. వీరిద్దరూ నిలకడగా బ్యాటింగ్ చేస్తూ స్కోరు వేగాన్ని పెంచారు. ముఖ్యందా కిరణ్ వేగంగా ఆడుతూ అదరగొట్టింది. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 64 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.
అయితే ఈ సారి మానసి జోషి.. దీప్తిని ఔట్ చేసి యూపీని ఇబ్బందుల్లోకి నెట్టింది. మరి కాసేపటికే దూకుడుగా ఆడుతున్న కిరణ్‌ను కిమ్ గార్త్ పెవిలియన్ చేర్చింది. ఆ తదుపరి బంతికే సిమ్రన్ షేక్‌ను(0) కూడా క్లీన్ బౌల్డ్ చేసి కిమ్ 5 వికెట్లతో యూపీ పతనాన్ని శాసించింది. దీంతో 88 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమిని అంచున నిలిచింది. ఇలాంటి సమయంలో అద్భుతమే చేసింది యూపీ బ్యాటర్ గ్రేస్ హ్యారిస్. దూకుడుగా ఆడుతూ స్కోరు వేగాన్ని పెంచింది. ఓ పక్క బౌండరీలు సాధిస్తూనే స్ట్రైక్ రొటేట్ చేస్తూ అదరగొట్టింది. మధ్య మధ్యలో వికెట్లు పడుతున్నప్పటికీ సోఫీ ఎకెల్ స్టోన్(22) సాయంతో లక్ష్యం దిశగా ప్రయాణించింది.
అదరగొట్టిన చేసిన గ్రేస్..
చివరి ఓవర్‌లో యూపీ విజయానికి 22 పరుగులు అవసరం కాగా.. సిక్సర్లు, బౌండరీలతో జట్టుకు గ్రేస్ అద్భుత విజయాన్ని అందించింది. సదర్లాండ్ వేసిన ఆ ఓవర్‌లో తొలి ఐదు బంతుల్లోనే లక్ష్యాన్ని పూర్తి చేసింది. మొదటి బంతినే సిక్సర్‌గా మలిచిన గ్రేస్.. రెండో బంతి వైడ్ కాగా.. ఆ తర్వాత రెండు పరుగులు చేసింది. ఇంక మూడో బంతిని బౌండరికీ తరలించింది. మళ్లీ నాలుగో బంతికి వైడ్ అయింది. ఇప్పుడు లక్ష్యం మూడు బంతుల్లో 5 పరుగులుగా మారింది. నాలుగో బంతిని బౌండరీకి తరలించగా.. ఐదో బంతిని సిక్సర్‌గా మలిచింది. ఈ క్రమంలోనే ఆమె అర్థ శతకం కూడా పూర్తి చేసుకుంది. మొత్తంగా 26 బంతుల్లో 59 పరుగులు చేసింది. చివరకు గుజరాత్‌పై యూపీ 3 వికెట్ల తేడాతో గెలిచింది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. హర్లీన్ డియోల్ 46 పరుగులతో ఆకట్టకోగా.. చివర్లో గార్డనర్(25), హేమలత(21) మెరుపులు మెరిపించారు. యూపీ బౌలర్లలో దీప్తి శర్మ, ఎకెల్ స్టోన్ చెరో రెండు వికెట్లతో రాణించారు.
సంబంధిత కథనం