Sunil Joshi on Kuldeep: ఆస్ట్రేలియాపై ఇండియా సిరీస్ గెలవాలంటే కుల్దీప్ ఉండాల్సిందే: మాజీ సెలక్టర్
Sunil Joshi on Kuldeep: ఆస్ట్రేలియాపై ఇండియా సిరీస్ గెలవాలంటే కుల్దీప్ ఉండాల్సిందేనని అన్నాడు సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ సునీల్ జోషి. అతను వికెట్లు తీస్తున్న తీరు చూస్తుంటే.. కచ్చితంగా తుది జట్టులోకి తీసుకోవాలని అభిప్రాయపడ్డాడు.
Sunil Joshi on Kuldeep: చాలా రోజుల తర్వాత ఈ మధ్యే మళ్లీ టీమ్ లోకి వచ్చాడు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. అయితే వచ్చీ రాగానే తన లైఫ్ టైమ్ ఫామ్ లో కనిపిస్తున్నాడు. రెండేళ్ల తర్వాత గతేడాది బంగ్లాదేశ్ పై తొలి టెస్ట్ లో ఆడే అవకాశం రాగా.. 8 వికెట్లతో రాణించాడు. శ్రీలంకతో రెండు వన్డేలు ఆడే అవకాశం వచ్చినప్పుడూ కుల్దీప్ తన సత్తా చాటాడు.
దీంతో ఆస్ట్రేలియాతో జరగబోయే కీలకమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో జరగబోయే తొలి రెండు టెస్టుల కోసం ఎంపిక చేసిన టీమ్ లో కుల్దీప్ చోటు దక్కించుకున్నాడు. అయితే అతనికి తుది జట్టులో మాత్రం అంత సులువుగా చోటు దక్కేలా లేదు. ముఖ్యంగా జడేజా రంజీట్రోఫీలో తన ఫిట్ నెస్ నిరూపించుకోవడంతో అశ్విన్ తో కలిసి జడేజా కచ్చితంగా తుది జట్టులో ఉంటాడు. ఒకవేళ మూడో స్పిన్నర్ ను తీసుకోవాలని అనుకుంటే మాత్రం కుల్దీప్ ఉండాలని సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ సునీల్ జోషి అన్నాడు.
"అతని ఫామ్ చూస్తే కచ్చితంగా టీమ్ లో ఉండాలి. అతడు వికెట్లు బాగా తీస్తున్నాడు. ఓ మాజీ క్రికెటర్ గా అతడు వికెట్లు ఎలా తీస్తున్నాడో జాగ్రత్తగా గమనిస్తున్నాను. ఓ స్పిన్నర్ గా బ్యాటర్లను బౌల్డ్ చేయడం, స్లిప్ క్యాచ్, స్టంపింగ్, మిడాఫ్ లేదా మిడాన్ లలో క్యాచ్ ఇచ్చేలా చేస్తున్నాడు. ఓ స్పిన్నర్ కచ్చితంగా ఈ ఫీల్డింగ్ ఏరియాల్లోనే వికెట్లు తీయాలని అనుకుంటాడు" అని జోషి ఈఎస్పీఎన్ క్రికిన్ఫోతో అన్నాడు.
కుల్దీప్‌ను ఆడించేందుకు ఇండియా స్పిన్‌కు అనుకూలించే కండిషన్స్ కోసం ఎదురు చూడకూడదని కూడా అతడు చెప్పాడు. "ఒకవేళ అశ్విన్ తొలి ఆప్షన్ అయితే, జడేజా ఆడకపోతే అప్పుడు కుల్దీప్, అక్షర్ ఆడాలి. ఒకవేళ జడేజా అందుబాటులో ఉండి, ముగ్గురు స్పిన్నర్లను ఆడించాలనుకుంటే కుల్దీప్ కచ్చితంగా ఆడాలి. ఎక్కడ ఆడుతున్నారు? మన స్పిన్నర్లు వాళ్లను కట్టడి చేస్తారా లేదా అన్నది చూడొద్దు.
కుల్దీప్ వికెట్లు తీసిన విధానం చూడండి. అతని వికెట్లన్నీ 30 గజాల సర్కిల్ లోపే ఉన్నాయి. ఓ బౌలర్ గొప్పతనం ఇక్కడే ఉంది. అతడు మంచి లైన్ అండ్ లెంత్ తో బౌలింగ్ చేస్తున్నాడనడానికి ఇదే నిదర్శనం. ఒకవేళ ఆస్ట్రేలియాపై ఇండియా సిరీస్ గెలవాలంటే కుల్దీపే కీలకపాత్ర పోషించబోతున్నాడు" అని సునీల్ జోషి అన్నాడు. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
సంబంధిత కథనం