SL vs BAN: బంగ్లాపై శ్రీలంక థ్రిల్లింగ్ విక్టరీ - సూపర్ ఫోర్ బెర్త్ ఖాయం
SL vs BAN:గురువారం బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో అసమాన పోరాటాన్ని కనబరిచిన శ్రీలంక రెండు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకున్నది. ఈ గెలుపుతో సూపర్ ఫోర్ బెర్తును ఖాయం చేసుకుంది.
SL vs BAN:ఆసియా కప్ లో భాగంగా బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య గురువారం జరిగిన మ్యాచ్ ఫ్యాన్స్ కు అసలైన క్రికెట్ మజాను అందించింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ లో రెండు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ పై విజయాన్ని సాధించిన శ్రీలంక సూపర్ ఫోర్ బెర్త్ ను ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 183 పరుగులు చేసింది. కుషాల్ మెండిస్ తో పాటు కెప్టెన్ షనక మెరుపులతో 19.2 ఓవర్లలో శ్రీలంక విజయాన్ని అందుకున్నది.
బంగ్లాదేశ్ కు ఓపెనర్ మిరాజ్ తో పాటు కెప్టెన్ షకీబ్ చక్కటి ఆరంభాన్ని అందించారు. మిరాజ్ 26 బాల్స్ లో రెండు సిక్సర్లు, రెండు ఫోర్లలో 38 రన్స్ చేశాడు. షకీబ్ 24 రన్స్ చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత హోస్సైన్ 22 బాల్స్ లో రెండు సిక్సర్లు నాలుగు ఫోర్లతో 39 రన్స్ తో మెరిశాడు చివర్లో హుస్సైన్ తొమ్మిది బాల్స్ లో నాలుగు ఫోర్లతో 24 రన్స్ చేయడంతో బంగ్లా భారీ స్కోరు సాధించింది. లంక బౌలర్లలో హసరంగ, కరుణరత్నే తలో రెండు వికెట్లు తీసుకున్నారు.
184 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన శ్రీలంక ఇన్నింగ్స్ ను కుషాల్ మెండిస్, నిసాంక ధాటిగా ఆరంభించారు. వీరిద్దరి దూకుడుతో ఐదు ఓవర్లలోనే లంక 45 పరుగులు చేసింది. నిసాంకతో పాటు అసలంక, గుణతిలక, రాజపక్స వెనువెంటనే ఔట్ కావడంలో లంక కష్టాల్లో పడింది. కెప్టెన్ షనకతో పాటు కలిసి కుషాల్ మెండిస్ లంకను విజయం వైపు నడిపించాడు. ఇద్దరు సమయోచితంగా బ్యాటింగ్ చేయడంతో శ్రీలంక సులభంగా గెలిచేలా కనిపించింది.
కానీ చివరల్లో బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంలో మ్యాచ్ ఉత్కంఠను రేకెత్తించింది. చివరి రెండు ఓవర్లలో 25 పరుగులు అవసరమైన తరుణంలో టెయిలెండర్లు కరుణరత్నే, ఫెర్నాండో అద్భుతంగా పోరాడి శ్రీలంకకు విజయాన్ని అందించారు.