Rahul Dravid on T20 Team: టీ20ల్లో కోహ్లి, రోహిత్‌లకు ఇక ఛాన్స్‌ లేనట్లే.. కోచ్‌ ద్రవిడ్‌ చెప్పేశాడు!-rahul dravid on t20 team hints at there is no place for rohit and virat in this format ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Rahul Dravid On T20 Team: టీ20ల్లో కోహ్లి, రోహిత్‌లకు ఇక ఛాన్స్‌ లేనట్లే.. కోచ్‌ ద్రవిడ్‌ చెప్పేశాడు!

Rahul Dravid on T20 Team: టీ20ల్లో కోహ్లి, రోహిత్‌లకు ఇక ఛాన్స్‌ లేనట్లే.. కోచ్‌ ద్రవిడ్‌ చెప్పేశాడు!

Hari Prasad S HT Telugu
Jan 06, 2023 11:02 AM IST

Rahul Dravid on T20 Team: టీ20ల్లో కోహ్లి, రోహిత్‌లకు ఇక ఛాన్స్‌ లేనట్లేనా? శ్రీలంకతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌ తర్వాత హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ పరోక్షంగా ఇదే విషయాన్ని చెప్పాడు.

కోచ్ రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ
కోచ్ రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ

Rahul Dravid on T20 Team: ఇండియన్‌ క్రికెట్‌కు గత దశాబ్ద కాలంగా మూలస్తంభాలుగా నిలుస్తున్న ప్లేయర్స్‌ విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ. అన్ని ఫార్మాట్లలోనూ టీమ్‌ భారాన్ని మోసే బ్యాటర్లు, కెప్టెన్లుగా వీళ్లు వ్యవహరించారు. అయితే గతేడాది టీ20 వరల్డ్‌కప్‌ సెమీస్‌లో ఇండియా ఓటమి తర్వాత ఈ ఫార్మాట్‌లో ఇక వీళ్లిద్దరినీ పక్కన పెట్టి యువ ఆటగాళ్ల వైపు చూడాలన్న డిమాండ్లు వచ్చాయి.

2024 టీ20 వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే టీమ్‌ను నిర్మించాలని చాలా మంది సూచించారు. అంతకు తగినట్లే గత న్యూజిలాండ్‌ టూర్‌లో, ఇప్పుడు శ్రీలంకతో టీ20 సిరీస్‌కు ఈ ఇద్దరు సీనియర్లు టీమ్‌లో లేరు. ఇక వీళ్లను టీ20ల్లో చూసే అవకాశం లేదని తాజాగా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కూడా చెప్పేశాడు. అతడు రోహిత్ లేదా కోహ్లి పేర్లను నేరుగా ప్రస్తావించకపోయినా.. ఇలాంటి సీనియర్లు ఇక వన్డేలపైనే ఎక్కువగా దృష్టి సారించేలా చూస్తామని తెలిపాడు.

"మా వరకూ గతేడాది ఇంగ్లండ్‌తో సెమీఫైనల్‌ ఆడిన టీమ్‌ నుంచి కేవలం 3-4 మంది ప్లేయర్స్‌ మాత్రమే ప్రస్తుతం శ్రీలంకతో ఆడుతున్న టీమ్‌లో ఉన్నారు. తర్వాతి టీ20 సైకిల్‌ను కాస్త భిన్నంగా చూడాలని నిర్ణయించుకున్నాం. అందువల్ల మాది యంగ్‌ టీమ్‌గా కనిపిస్తోంది. అలాంటి టీమ్‌ నాణ్యమైన శ్రీలంక టీమ్‌తో ఆడటం మంచి అనుభవం. ప్రస్తుతం మా దృష్టి ఎక్కువగా వన్డే వరల్డ్‌కప్‌, వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌పై ఉండటం వల్ల టీ20ల్లో యువ ఆటగాళ్లకు ఎక్కువగా అవకాశాలు ఇవ్వగలుగుతున్నాం" అని ద్రవిడ్‌ అన్నాడు.

ద్రవిడ్‌ చెప్పింది వాస్తవమే. గతేడాది ఇంగ్లండ్‌తో సెమీస్‌ ఆడిన టీమ్‌లోని హార్దిక్‌ పాండ్యా, సూర్యకుమార్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌ మాత్రమే ఇప్పుడు శ్రీలంకతో ఆడుతున్నారు. వరల్డ్‌కప్‌ తర్వాత న్యూజిలాండ్, శ్రీలంక టీ20 సిరీస్‌లకు హార్దిక్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. ప్రస్తుతానికి టీ20లకు పూర్తిస్థాయి కెప్టెన్‌గా సెలక్టర్లు హార్దిక్‌ పేరును ప్రకటించకపోయినా.. అది లాంఛనమే అనిపిస్తోంది.

ఇక ఇప్పుడున్న టీమ్‌లోని యువకులకు మరింత సమయం ఇవ్వాలని కూడా ద్రవిడ్ ఈ సందర్భంగా చెప్పాడు. "ఎవరూ వైడ్లు, నోబాల్స్‌ వేయాలని అనుకోరు. ముఖ్యంగా ఈ ఫార్మాట్‌లో అది చాలా నష్టం చేస్తుంది. ఈ యువ ఆటగాళ్ల విషయంలో మనం సహనంతో ఉండాలి. బౌలింగ్‌లో చాలా మంది యువకులు ఉన్నారు. అప్పుడప్పుడూ వాళ్లు ఇలాంటివి ఎదుర్కొంటూ ఉంటారు. మనం అది అర్థం చేసుకోవాలి. వాళ్లకు టెక్నికల్‌గా సాయం చేస్తాం. వాళ్లకు మద్దతు ఇస్తాం" అని ద్రవిడ్‌ అన్నాడు.

Whats_app_banner