Kapil Dev on Team India: రోహిత్, కోహ్లిలతో సాధ్యం కాదు.. వరల్డ్ కప్ గెలవాలంటే ఇలా చేయండి: కపిల్ దేవ్
Kapil Dev on Team India: రోహిత్, కోహ్లిలు మాత్రమే వరల్డ్‌కప్ గెలిపించలేరని అన్నాడు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్. అసలు ఈ మెగా టోర్నీ గెలవాలంటే ఏం చేయాలో ఈ వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ చెప్పాడు.
Kapil Dev on Team India: ఇండియన్ క్రికెట్ టీమ్‌ను తొలిసారి విశ్వవిజేతగా నిలిపిన కెప్టెన్ కపిల్ దేవ్. అసలు అంచనాలు లేని టీమ్‌కు 1983లో ఏకంగా వరల్డ్‌కప్ ట్రోఫీ అందించడంలో కపిల్‌దే కీలకపాత్ర. అలాంటి కెప్టెన్ ఇప్పుడు ఇండియా మూడోసారి వరల్డ్‌కప్ గెలవాలంటే ఏం చేయాలో వివరించాడు. ఈ మెగా టోర్నీ గెలవాలంటే కేవలం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలపై ఆధారపడితే సరిపోదని కూడా స్పష్టం చేశాడు.
చివరిసారి 2011లో ధోనీ కెప్టెన్సీలో విశ్వవిజేతగా నిలిచిన ఇండియన్ టీమ్ ఆ తర్వాత అటు టీ20గానీ, ఇటు వన్డే వరల్డ్‌కప్‌గానీ గెలవలేకపోయింది. దీంతో ఈ ఏడాది చివర్లో సొంతగడ్డపై జరగబోయే వరల్డ్‌కప్ గెలవాలని అభిమానులు ఆశిస్తున్నారు. దీనికోసం అటు బీసీసీఐ కూడా ఇప్పటి నుంచే కసరత్తులు మొదలుపెట్టిన నేపథ్యంలో కపిల్ కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి.
"వరల్డ్‌కప్ గెలవాలంటే కోచ్, సెలక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్ కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. వ్యక్తిగత ఆసక్తులు పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ టీమ్ కోసం ఆలోచించాలి. మీరు రోహిత్, కోహ్లి లేదా ఇద్దరు, ముగ్గురు ప్లేయర్స్‌పై ఆధారపడితే వాళ్లు వరల్డ్ కప్ గెలిపించలేరు.
టీమ్‌పై విశ్వాసం ఉంచాలి. మన దగ్గర అలాంటి టీమ్ ఉందా? కచ్చితంగా ఉంది. అలాంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నారా? కచ్చితంగా ఉన్నారు. వరల్డ్‌కప్ గెలిపించదగిన ప్లేయర్స్ మన దగ్గర ఉన్నారు" అని కపిల్ అన్నాడు.
ఇప్పటి వరకూ దశాబ్ద కాలంగా ఇండియన్ క్రికెట్‌కు రోహిత్, కోహ్లిలు చేయాల్సింది చేశారని, ఇక నుంచి యువకులు ఆ బాధ్యత తీసుకోవాలని కపిల్ చెప్పాడు. "టీమ్‌లో ఒకరిద్దరు ప్లేయర్సే మూలస్తంభాలుగా ఉండటం ఎప్పటి నుంచో వస్తున్నదే. టీమంతా వాళ్ల చుట్టే తిరుగుతుంది. కానీ ఇప్పుడు దానిని బ్రేక్ చేయాలి.
అలాంటి 5-6 ప్లేయర్స్‌ను సిద్ధం చేయాలి. అందుకే రోహిత్, విరాట్‌లపై ఆధారపడొద్దని చెబుతున్నాను. వాళ్ల బాధ్యతలను నిర్వర్తించే ప్లేయర్స్ కావాలి. యువ ఆటగాళ్లే ముందుకు వచ్చి ఇక ఇది మాకు వదిలేయండి అని చెప్పాలి" అని కపిల్ అన్నాడు.
ఈ ఏడాది వరల్డ్‌కప్ ముగిసే సమయానికి రోహిత్ 37, విరాట్ 36 ఏళ్ల వయసులోకి ఎంటరవుతారు. దీంతో వీళ్లు మరో వరల్డ్‌కప్ ఆడే అవకాశం లేదని కపిల్ అభిప్రాయపడ్డాడు. "ఈసారి ఇండియాలో వరల్డ్‌కప్ జరగడమే అతిపెద్ద సానుకూలాంశం. మనకు తెలిసినంతగా ఎవరికీ ఇక్కడి పరిస్థితులు తెలియదు. గత పదేళ్లుగా ఇండియాకు రోహిత్, విరాట్ ప్రధాన ప్లేయర్స్‌గా ఉన్నారు.
ఇదే ఈ ఇద్దరికీ చివరి వరల్డ్‌కప్ కానుందా అని చాలా మంది అడుగుతున్నారు. వాళ్లు ఆడగలరేమోగానీ అది అంత సులువు కాదని నేనంటాను. ఫిట్‌నెస్‌తోనే సమస్య. యువకులు ఎంతో మంది వస్తున్నారు. వాళ్లతో పోటీపడటం కష్టమే. సామర్థ్యం విషయంలో మాత్రం వాళ్లేమీ తక్కువ కాదు" అని కపిల్ అన్నాడు.
సంబంధిత కథనం