Dhoni Suggestions to Rahane: మహీ మాట మంత్రంలా పనిచేసింది.. ముంబయిపై రహానే విధ్వంసం
Dhoni Suggestions to Rahane: ఫామ్ లేమితో ఇబ్బంది పడే ఆటగాడు.. ఒక్కసారి ధోనీ కెప్టెన్సీలో ఆడితే అసాధారణ ప్లేయర్‌గా రాటుతేలుతాడనే విషయం చాలా సార్లు నిరూపితమైంది. తాజాగా రహానే కూడా ఈ జాబితాలో చేరాడు. ధోనీ సూచనలతో ముంబయిపై అతడు అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు.
Dhoni Suggestions to Rahane: మహేంద్ర సింగ్ ధోనీ.. మిగతా కెప్టెన్ల కంటే చాలా వైవిధ్యంగా ఆలోచిస్తాడు. ఆట పట్ల మక్కువ, అవగాహన ఉన్న మిస్టర్ కూల్ ఎలాంటి పరిస్థితుల్లోనైనా తన నైపుణ్యంతో మలుపు తిప్పే సమర్థవంతుడు. అందుకే ఎప్పుడూ విఫలమయ్యే ఆటగాళ్లు కూడా ధోనీ టీమ్‌లో వచ్చేసరికి అధ్భుతాలు సృష్టిస్తారు. రైనా మొదలుకుని రుతురాజ్, రాయుడు వరకు ఎంతో మందికి తన మాటలతో స్ఫూర్తి నింపే వారిలోని అత్యుత్తమ ప్లేయర్‌ను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాడు. తాజాగా ఈ జాబితాలో అజింక్య రహానే కూడా చేరిపోయాడు. శనివారం ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ధ సెంచరీతో అదరగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ధోనీ కూడా రహానే ఆటతీరుపై ఆనందం వ్యక్తం చేశాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ప్రశంసల వర్షం కురిపించాడు.
“టోర్నీ ఆరంభం కావడానికి ముందు సీఎస్‌కే కోసం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో నేను, రహానే మాట్లాడుకున్నాం. అతడు నన్ను ఒకే ప్రశ్న అడిగాడు. నాలో నువ్వు ఏం చూడాలనుకుంటున్నావ్? అని ప్రశ్నించాడు. అప్పుడు నేను ఒక్కటే మాట చెప్పాను. నీ బలానికి తగినట్లుగా ఆడమని చెప్పాను. నువ్వు(రహానే) స్థిరంగా భారీ సిక్సర్లు కొట్టే ఆటగాడివి కాదు. కానీ ఫీల్డ్‌ను మ్యానిపులేట్ చేసే నైపుణ్యమున్న ప్లేయర్‌వి, బౌలర్ పేస్‌ను ఉపయోగించుకుని ఆడమని సూచించా. టెక్నికల్‌గా అతడు మంచి బ్యాటర్. ” అని రహానేకు హిత బోధ చేసినట్లు ధోనీ తెలిపాడు.
ఈ మ్యాచ్‌లో రహానే ఏదో నామమాత్రపు ఆటతీరుతో కాకుండా.. ఆసాధారణంగా ఆడాడు. ఎంతలా అంటే ఈ సీజన్‌లోనే వేగవంతమైన అర్ధసెంచరీ చేసేలా విధ్వంసం సృష్టించాడు. కేవలం 19 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేశాడు. మొన్నటి వరకు వరుసగా విఫలమై.. టీమిండియాలో చోటు కోల్పోయిన రహానే ఈ మ్యాచ్‌లో భీకర ప్రదర్శనతో అదరగొట్టాడు. ఆచితూచి ఆడే రహానేనా ఈ విధంగా ఆడింది అనేంతలా ఆశ్చర్యాన్ని కలిగించాడు. ముఖ్యంగా అర్షద్ ఖాన్ ఓవర్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో విధ్వంసం సృష్టించాడు. అతడి ఆటలో ఈ విధమైన మార్పు రావడానికి ప్రధాన కారణం ధోనీనే అని అప్పుడే అందరికీ అర్థమైంది. మహీ సూచనలు, సలహాలను తీసుకున్నర రహానే అద్భుత ప్రదర్శనతో తనేంటో నిరూపించాడు.
ధోనీ గురించి మాట్లాడుతూ రహానే.. "మహీ, ఫ్లెమింగ్ నాకు బాగా ఫ్రీడమ్ ఇచ్చారు. ధోనీ నన్ను బాగా సన్నహామవ్వాలని సూచించాడు. వాంఖడేలో ఆడటం ఎప్పుడూ ఇష్టపడతాను. ఇక్కడ టెస్టు మ్యాచ్ ఆడాలని కోరుకుంటున్నా. ఈ మ్యాచ్‌లో నేను నా టైమింగ్‌పై ఫోకస్ పెట్టాను." అని రహానే స్పష్టం చేశాడు.
ఈ మ్యాచ్‌లో ముంబయిపై చెన్నై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 158 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన చెన్నై కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అంజిక్య రహానే(61) అద్భుత అర్ధ శతకంతో చెలరేగగా.. రుతురాజ్ గైక్వాడ్(40) మరోసారి ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. ముంబయి బౌలర్లలో జేసన్ బెహ్రెండార్ఫ్, పీయూష్ చావ్లా, కుమార్ కార్తికేయ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.