India Title favorites WC 2023: వన్డే ప్రపంచకప్‌లో భారతే ఫెవరెట్.. ఇంగ్లాండ్ మాజీ స్పష్టం-michael vaughan india favorites to win odi world cup ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  India Title Favorites Wc 2023: వన్డే ప్రపంచకప్‌లో భారతే ఫెవరెట్.. ఇంగ్లాండ్ మాజీ స్పష్టం

India Title favorites WC 2023: వన్డే ప్రపంచకప్‌లో భారతే ఫెవరెట్.. ఇంగ్లాండ్ మాజీ స్పష్టం

Maragani Govardhan HT Telugu
Jan 25, 2023 07:24 AM IST

India Title favorites WC 2023: ఈ ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్ గెలవడంలో టైటిల్ ఫేవరెట్‌‍గా భారత్ నిలుస్తుందని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ స్పష్టం చేశారు. న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసిన అనంతరం ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని తెలియజేశారు.

భారత్-న్యూజిలాండ్
భారత్-న్యూజిలాండ్ (ANI)

India Title favorites WC 2023: న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో గెలిచిన భారత్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకుది. మంగళవారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో టీమిండియా 90 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించి 50 ఓవర్ల ప్రపంచకప్‌లో తమ ప్రదర్శన ఎలా ఉండబోతుందో ముందుగానే హింట్ ఇచ్చింది. ఈ ప్రదర్శనతో సర్వత్రా భారత్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ స్పందించారు. ఈ ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో తాము టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగబోతున్నట్లు భారత్ తన ఆటతో ఆకట్టుకుందని ఆయన అన్నారు.

"భారత్ వన్డే క్రికెట్‌ను దూకుడుగా ఆడేందుకు కట్టుబడి ఉండటం వల్ల ఎట్టకేలకు ఈ ప్రపంచకప్‌ను గెలిచేందుకు హాట్ ఫేవరెట్‌గా మారింది." అని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ట్విటర్ వేదితగా తెలియజేశారు.

ఈ సిరీస్‌లో భారత బ్యాటర్లు ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించారు. ఫలితంగా వారు ఆటలో మెరుగైన స్థితిలో నిలిచేందుకు దోహదపడింది. ఈ మూడు వన్డేల సిరీస్‌లో శుబ్‌మన్ గిల్ ఒక్కడే 360 పరుగులు సాధించి పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం నెలకొల్పిన ప్రపంచ రికార్డును సమం చేశాడు.

మంగళవారం జరిగిన మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(101), శుబ్‌మన్ గిల్(112) సెంచరీలతో విజృంభించగా.. చివర్లో హార్దిక్ పాండ్య అర్ధశతకంతో రాణించాడు. ఫలితంగా భారత్ 385 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం లక్ష్యం ఛేదనంలో న్యూజిలాండ్ 295 పరుగులకు ఆలౌటైంది. డేవాన్ కాన్వే ఒక్కడే శతకంతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ మూడేళ్ల తర్వాత వన్డేల్లో సెంచరీ నమోదు చేశాడు. చివరగా 2020 జనవరి 7 శతకం సాధించాడు.

Whats_app_banner

సంబంధిత కథనం