IND vs NZ 3rd ODI : న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ క్లీన్ స్వీప్.. వన్డేల్లో భారత్ వరల్డ్ నెం 1
IND vs NZ 3rd ODI : న్యూజిలాండ్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. 90 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది.
మూడు వన్డేల సిరీస్‌లో న్యూజిలాండ్ జట్టును వైట్‌వాష్ చేయడం ద్వారా టీమిండియా వన్డే క్రికెట్‌లో చరిత్ర సృష్టించింది. హైదరాబాద్, రాయ్‌పూర్ తర్వాత ఇండోర్‌లోనూ న్యూజిలాండ్‌ను రోహిత్ శర్మ జట్టు ఓడించింది. మూడో వన్డేలో 90 పరుగుల తేడాతో గెలిచిన భారత్ ఈ విజయంతో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ అద్భుత సెంచరీతో 386 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం కివీస్ జట్టు 41.2 ఓవర్లలో 295 పరుగులకు ఆలౌటైంది.
దీంతో వన్డే క్రికెట్‌లో భారత్ ప్రపంచ నంబర్‌వన్ జట్టుగా అవతరించింది. తొలుత బ్యాటింగ్‌లో రోహిత్, శుభ్‌మన్ సెంచరీలు చేయగా, బౌలింగ్‌లో మ్యాజిక్ చేసిన శార్దూల్ ఠాకూర్, కుల్‌దీప్ యాదవ్ ఈ మ్యాచ్‌లో హీరోలుగా నిలిచారు. అలాగే, ఈ విజయంతో 13 ఏళ్ల తర్వాత తొలిసారిగా న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్‌లో భారత్ క్లీన్ స్వీప్ సాధించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు శుభారంభం లభించింది. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఇద్దరూ సెంచరీలు చేయడం ద్వారా 212 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నారు. సెంచరీతో చెలరేగిన కెప్టెన్ రోహిత్ ఔటయ్యాడు. ఆ వెంటనే గిల్ కూడా వికెట్ కోల్పోయాడు. అప్పటికే 230 పరుగులు చేసిన భారత్ కు గిల్ రూపంలో రెండో దెబ్బ తగిలింది. 112 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన గిల్ అవుటైన తర్వాత భారత్ ఇన్నింగ్స్‌పై కాస్త భయం మొదలైంది. ఇషాన్ కిషన్ 17 పరుగులు, విరాట్ కోహ్లీ 36 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 14 పరుగులు చేయగలిగారు.
మిడిలార్డర్ వైఫల్యంతో ఉన్న జట్టును హార్దిక్ పాండ్యా ఆదుకున్నాడు. చెలరేగిన ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ సాధించాడు. పాండ్యా 54 పరుగులతో పాటు, వాషింగ్టన్ సుందర్ 9 పరుగులు, శార్దూల్ ఠాకూర్ 25 పరుగులు, కుల్దీప్ యాదవ్ 3 పరుగులు చేశారు. 50 ఓవర్లకు తొమ్మిది వికెట్లు కోల్పోయిన భారత్ 385 పరుగులు చేసింది.
భారత్ ఇచ్చిన భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ కు మెుదట్లోనే షాక్ తగిలింది. ఓపెనర్ ఫిన్ అలెన్ వికెట్ కోల్పోయాడు. అయితే మరో ఓపెనర్ డెవాన్ కాన్వే మాత్రం ఒంటరిగా భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. సెంచరీ చేసిన కాన్వే మినహా, జట్టులోని మరే ఇతర ఆటగాడు చెప్పుకోదగిన ఇన్నింగ్స్ ఆడలేదు. దీంతో న్యూజిలాండ్ 50 ఓవర్లు కూడా ఆడలేకపోయింది. న్యూజిలాండ్ జట్టు 41.2 ఓవర్లలో ఆలౌటై.. 295 పరుగులు చేసింది. ఠాకూర్, కుల్దీప్ చెరో 3 వికెట్లు, యుజ్వేంద్ర చాహల్ 2, పాండ్యా, ఉమ్రాన్ మాలిక్ తలో వికెట్ తీశారు.
సంబంధిత కథనం