Naveen ul Haq: “ఫైన్‍ను గమనిస్తే అర్థమవుతోంది కదా!”: కోహ్లీతో గొడవపై మాట్లాడిన నవీన్ ఉల్ హక్
Naveen ul Haq: ఐపీఎల్‍లో విరాట్ కోహ్లీతో గొడవ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు నవీన్ ఉల్ హక్. గొడవ ప్రారంభించింది కోహ్లీనే అని చెప్పాడు. వివరాలివే..
Naveen ul Haq: భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, అఫ్గానిస్థాన్ యువ పేసర్ నవీన్ ఉల్ హక్ మధ్య ఈ ఏడాది ఐపీఎల్‍లో గొడవ జరిగింది. ఇది ఆ తర్వాత చాలా కాలం రచ్చరచ్చ అయింది. బెంగళూరు రాయల్ చాలెంజర్స్, లక్నో సూపర్‌జెయింట్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా కోహ్లీ, నవీన్ ఉల్ హక్ మధ్య ఈ గొడవ జరిగింది. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ విషయంలో కోహ్లీ, మాజీ క్రికెటర్ గంభీర్ మైదానంలోనే వాగ్వాదానికి దిగారు. ఈ విషయంలో తప్పెవరిదనే చర్చ సాగుతూనే ఉంది. ఈ తరుణంలో కోహ్లీతో గొడవ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు నవీన్ ఉల్ హక్.
విరాట్ కోహ్లీనే ముందుగా గొడవ ప్రారంభించాడని నవీన్ ఉల్ హక్ చెప్పాడు. అతడి వల్లే ఇది మొదలైందని తాజాగా బీబీసీ పాస్టోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు చెప్పుకొచ్చాడు. “మ్యాచ్ జరుగుతున్నప్పుడు.. ఆ తర్వాత అతడు ఆ మాటలు అనాల్సింది కాదు. నేను గొడవ మొదలుపెట్టలేదు. మ్యాచ్ తర్వాత మేం షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటున్నప్పుడు కూడా కోహ్లీనే ఫైట్ మొదలుపెట్టాడు” అని నవీన్ చెప్పాడు.
మ్యాచ్ ఫీజులో ఫైన్‍లను గమనిస్తే గొడవ ఎవరు ప్రారంభించారో అర్థమవుతుందని నవీన్ ఉల్ హక్ అన్నాడు. “మీరు ఫైన్‍లను చూస్తే.. ఎవరు గొడవ మొదలుపెట్టారో అర్థమవుతుంది” అని నవీన్ ఉల్ హక్ చెప్పాడు. ఈ గొడవతో విరాట్ కోహ్లీ మ్యాచ్ ఫీజులో 100 శాతం ఫైన్ పడింది. నవీన్ ఉల్ హక్‍కు 50 శాతం జరిమానా పడింది. ప్రత్యర్థి ప్రేరేపించకపోతే తాను సాధారణంగా ఎప్పుడూ స్లెడ్జింగ్ చేయనని నవీన్ తెలిపాడు.
“నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా.. నేను సాధారణంగా స్లెడ్జ్ చేయను. ఆ మ్యాచ్‍లో నేను ఒక్క మాట కూడా అనలేదు. నేను ఎవరినీ స్లెడ్జ్ చేయలేదు. నేను ఆ రోజు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నానో అక్కడ ఉన్న ప్లేయర్లకు తెలుసు. నేను మ్యాచ్ తర్వాత అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తున్నా. ఆ సమయంలో అతడు (కోహ్లీ) నా చేతిని బలవంతంగా పట్టుకున్నాడు. నేను కూడా మనిషినే. అందుకే స్పందించా” అని ఇంటర్వ్యూలో చెప్పాడు నవీన్ ఉల్ హక్.
ఈ గొడవ తర్వాత కోహ్లీ టార్గెట్‍గా నవీన్ ఉల్ హక్.. సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టాడు. దీంతో నవీన్‍ను కోహ్లీ ఫ్యాన్స్ విపరీతంగా ట్రోల్ చేశారు. కొందరు ఆటగాళ్లు కూడా నవీన్ తీరును తప్పుపట్టారు. అయితే, ఈ గొడవలో ఎవరిది తప్పు అనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.