KL Rahul on Trolling: క్రికెట్ తప్ప ఏమీ తెలియదు.. మా జీవితాలు ఇంతే.. ట్రోలింగ్‌పై రాహుల్ ఆవేదన
KL Rahul on Trolling: క్రికెట్ తప్ప ఏమీ తెలియదు.. మా జీవితాలు ఇంతే.. అంటూ ట్రోలింగ్‌పై రాహుల్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ట్రోలింగ్ తనను ప్రభావితం చేస్తోందని అతడు అన్నాడు.
KL Rahul on Trolling: సోషల్ మీడియా ట్రోలింగ్ పై టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఏడాది కాలంగా రాహుల్ లక్ష్యంగా సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. అయితే దీనిని చాలా వరకూ పట్టించుకోకపోయినా.. ఏదో ఒక సమయంలో ట్రోలింగ్ తనపై ప్రభావం చూపుతోందని అతడు చెప్పాడు.
చాలా రోజులుగా ఇంటర్నేషనల్ క్రికెట్ లో రాహుల్ ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది. ఆ మధ్య జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ రెండు టెస్టులు ఆడిన రాహుల్.. వాటిలో విఫలమయ్యాడు. కేవలం 38 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో రాహుల్ స్థానంలో శుభ్‌మన్ గిల్ కు అవకాశం ఇచ్చారు. ఇక ఈ ఏడాది ఐపీఎల్లో బాగానే ఆడినా.. అతని స్ట్రైక్ రేట్ పై విమర్శలు వచ్చాయి.
చివరికి 9 మ్యాచ్ ల తర్వాత గాయంతో దూరమయ్యాడు. తర్వాత సర్జరీ కూడా చేయించుకున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా ఆడటం లేదు. అయితే తన సర్జరీ తర్వాత అతడు ది రణ్‌వీర్ షోలో మాట్లాడాడు. ఈ ట్రోలింగ్ తనతోపాటు కొంతమంది ఇతర ప్లేయర్స్ ను కూడా అప్పుడప్పుడూ ప్రభావితం చేస్తుందని రాహుల్ వెల్లడించాడు.
"సోషల్ మీడియా ట్రోలింగ్ నాతోపాటు మరికొందరు ప్లేయర్స్ ను అప్పుడప్పుడూ ఆవేదనకు గురి చేస్తుంది. మాకు మద్దతు అవసరమైన సమయంలో అభిమానులు తాము ఏది కావాలంటే అనే హక్కు ఉన్నట్లుగా వ్యవహరిస్తారు. కానీ ఆ వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడని ఎవరూ ఆలోచించరు. మేమెవరమూ చెత్తగా ఆడాలని కోరుకోము. ఇదే మా జీవితం. మేము చేసేది ఇదే. నాకు క్రికెట్ తప్ప మరేమీ తెలియదు" అని రాహుల్ అన్నాడు.
"నేను చేసేది క్రికెట్ ఆడటమే. నేను నా గేమ్ పై సీరియస్ గా లేనని లేదా కఠినంగా శ్రమించడం లేదని ఎవరైనా ఎలా అంటారు? కానీ స్పోర్ట్స్ లో అలా కష్టానికి తగిన ఫలితం వచ్చే అవకాశం ఉండదు. నేను ఎంత కష్టపడినా.. ఫలితం నాకు అనుకూలంగా రాకపోయే అవకాశాలు కూడా ఉంటాయి" అని రాహుల్ చెప్పాడు.
సంబంధిత కథనం