Wrestlers Protest: మా కెరీర్లకు అడ్డు పడుతున్నారు: వినేష్, భజరంగ్, సాక్షిలపై జూనియర్ రెజ్లర్ల మండిపాటు-junior wrestlers protest against vinesh bajrang and sakshi malik ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Wrestlers Protest: మా కెరీర్లకు అడ్డు పడుతున్నారు: వినేష్, భజరంగ్, సాక్షిలపై జూనియర్ రెజ్లర్ల మండిపాటు

Wrestlers Protest: మా కెరీర్లకు అడ్డు పడుతున్నారు: వినేష్, భజరంగ్, సాక్షిలపై జూనియర్ రెజ్లర్ల మండిపాటు

Hari Prasad S HT Telugu
Jan 04, 2024 01:57 PM IST

Wrestlers Protest: ఇండియన్ రెజ్లింగ్ డ్రామా మరో మలుపు తిరిగింది. రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న సీనియర్ రెజ్లర్లు వినేష్, భజరంగ్, సాక్షిలపై జూనియర్ రెజ్లర్లు మండిపడుతూ ఆందోళన చేస్తుండటం విశేషం.

సీనియర్ రెజ్లర్లు వినేష్, భజరంగ్, సాక్షి మాలిక్ లకు వ్యతిరేకంగా జూనియర్ రెజ్లర్ల నిరసన
సీనియర్ రెజ్లర్లు వినేష్, భజరంగ్, సాక్షి మాలిక్ లకు వ్యతిరేకంగా జూనియర్ రెజ్లర్ల నిరసన (Ishant )

Wrestlers Protest: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న సీనియర్ రెజ్లర్లు వినేష్ ఫోగాట్, భజరంగ్ పూనియా, సాక్షి మాలిక్ లకు వ్యతిరేకంగా జూనియర్ రెజ్లర్లు గళం విప్పారు. బుధవారం (జనవరి 3) వాళ్లు ఆందోళన చేపట్టడం గమనార్హం. తమ కెరీర్లకు వాళ్లు అడ్డు పడుతున్నారని ఆరోపిస్తున్నారు.

yearly horoscope entry point

ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గరికి బస్సుల్లో వచ్చిన ఈ జూనియర్ రెజ్లర్లు ఆందోళనకు దిగారు. ఏడాది కిందట ఇదే జంతర్ మంతర్ దగ్గర వినేష్, సాక్షి మాలిక్, భజరంగ్ పూనియా అప్పటి డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ కు వ్యతిరేకంగా నిరసన ప్రారంభించారు. ప్రస్తుతం ఈ కేసు ఢిల్లీ హైకోర్టులో ఉంది. మరోవైపు డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ గా కొత్తగా ఎన్నికైన సంజయ్ సింగ్ కూడా బ్రిజ్ భూషణ్ మనిషే అంటూ ఆ ముగ్గురూ ఆందోళన వ్యక్తం చేయడంతో క్రీడాశాఖ ఆయన ఎన్నికను సస్పెండ్ చేసింది.

అయితే ఏడాది కాలంగా ఇలా నిరసనలతో దేశంలో రెజ్లింగ్ కార్యకలాపాలు నిలిచిపోయాయంటూ జూనియర్ రెజ్లర్లు రోడ్డెక్కారు. బుధవారం ఉదయం 11 గంటల సమయంలో వీళ్ల నిరసన మొదలైంది. హర్యానా, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ లకు చెందిన జూనియర్ రెజ్లర్లు ఇందులో పాల్గొన్నారు. వీళ్లలో చాలా మంది బాగ్‌పట్ లోని ఆర్యసమాజ్ అఖాడా, ఢిల్లీ శివార్లలోని వీరేందర్ రెజ్లింగ్ అకాడెమీలకు చెందిన వాళ్లు ఉన్నారు.

అయితే వీళ్ల నిరసన వెనుక ఎవరు ఉన్నారన్నది తెలియలేదు. భజరంగ్, వినేష్, సాక్షిలకు వ్యతిరేకంగా ప్లకార్డులను పట్టుకొని ఆందోళన నిర్వహించారు. గతేడాది నిరసనల కారణంగా జూనియర్ రెజ్లర్లకు 2023లో ఎలాంటి నేషనల్ క్యాంప్ గానీ, ఛాంపియన్షిప్స్ గానీ నిర్వహించలేదు. పది రోజుల్లో డబ్ల్యూఎఫ్ఐపై ఉన్న సస్పెన్షన్ ను కేంద్ర క్రీడా శాఖ ఎత్తేయాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు.

అటు డబ్ల్యూఎఫ్ఐ ఆఫీస్ బేరర్లు కూడా సస్పెన్షన్ పై కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. ఇక తమకు వచ్చిన అవార్డులను తిరిగిచ్చేస్తామంటూ వాటిని అవమానించిన భజరంగ్, వినేష్ లపై చర్యలు తీసుకోవాలని కూడా జూనియర్ రెజ్లర్లు ఓ మెమొరాండాన్ని క్రీడాశాఖకు పంపించారు. ఈ నిరసనలు ప్రారంభమైన మూడు గంటల్లోనే ఆరు వారాల్లో అండర్ 15, అండర్ 20 నేషనల్స్ నిర్వహిస్తామని రెజ్లింగ్ ఫెడరేషన్ తాత్కాలిక ప్యానెల్ వెల్లడించింది.

డబ్ల్యూఎఫ్ఐ, కేంద్ర క్రీడాశాఖ తీరుకు నిరసనగా తనకు వచ్చిన ఖేల్‌రత్న, పద్మశ్రీ అవార్డులను తిరిగిచేస్తానని ఆ మధ్య వినేష్ ఫోగాట్ చెప్పిన విషయం తెలిసిందే. మరోవైపు భజరంగ్ పూనియా తన అర్జున అవార్డును ప్రధాని ఇంటి ముందు ఉంచి నిరసన తెలిపాడు.

ఏడాది కాలంగా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వ్యవహారం కొనసాగుతూనే ఉంది. మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ సీనియర్ రెజ్లర్లు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. పదవి నుంచి ఆయన తప్పుకున్నా.. దీనిపై ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో కేసు కొనసాగుతూనే ఉంది.

Whats_app_banner

టాపిక్