Virat Kohli Records: ఐపీఎల్ 2023లో కోహ్లీ ఈ రికార్డులు బ్రేక్ చేస్తాడా? అందుకుంటే ఫ్యాన్స్‌కు పండగే-three notable records that virat kohli could break in upcoming ipl 2023 ,స్పోర్ట్స్ న్యూస్
Telugu News  /  Sports  /  Three Notable Records That Virat Kohli Could Break In Upcoming Ipl 2023

Virat Kohli Records: ఐపీఎల్ 2023లో కోహ్లీ ఈ రికార్డులు బ్రేక్ చేస్తాడా? అందుకుంటే ఫ్యాన్స్‌కు పండగే

విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ (PTI)

Virat Kohli Records: విరాట్ కోహ్లీ వచ్చే ఐపీఎల్‌లో కొన్ని రికార్డులు బ్రేక్ చేసే అవకాశముంది. వీటిల్లో ఐపీఎల్‌లో 100 క్యాచ్‌లు, అత్యధిక సెంచరీలు, 7 వేల పరుగుల మైలురాయి లాంటి రికార్డులు ఉన్నాయి.

Virat Kohli Records: ఇండియన్ ప్రీమియర్ లీగ్ వస్తుందంటే క్రికెట్ ప్రియుల హడావిడి మాములుగా ఉండదు. రెండు నెలల పాటు కావాల్సినంత వినోదం దొరుకుతుంది. అందుకే ఎన్ని టీ20 లీగ్స్ వచ్చినప్పటికీ ఐపీఎల్‌కు ఉండే క్రేజే వేరు. ఈ శుక్రవారం నుంచి ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభం కానున్న తరుణంలో సర్వత్రా ఈ టోర్నీపై ఆసక్తి నెలకొంది. మార్చి 31న అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం ఇంత వరకు ఒక్కసారి కూడా ఛాంపియన్‍‌గా నిలువలేకపోయింది. విరాట్ కోహ్లీ లాంటి టాప్ బ్యాటర్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ జట్టు ఫైనల్ వరకు చేరి కూడా టైటిల్ ఆశలను నెరవేర్చుకోలేకపోయింది. ఈ సారైన ఆ కోరిక తీర్చుకుంటుందో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు

ఇటీవల కాలంలో మెరుగ్గా రాణిస్తున్న కోహ్లీ.. ఐపీఎల్‌లోనూ అదే ఆటను కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఐపీఎల్ ఆరంభమైనప్పటి నుంచి ఒకే టీమ్‌కు ఆడుతున్న ఏకైక ప్లేయర్ విరాటే. ఆర్సీబీ తరఫున ఎన్నో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పటి వరకు ఎన్నో రికార్డులు అధిగమించిన విరాట్.. రాబోయే 16వ సీజన్‌లోనూ కొన్ని రికార్డులు బ్రేక్ చేసే అవకాశముంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఐపీఎల్‌లో 100 క్యాచ్‌ల రికార్డు..

బ్యాటింగ్‌లోనే కాకుండా విరాట్ కోహ్లీ తన ఫీల్డింగ్‌తోనూ ఆకట్టుకుంటాడనే విషయం తెలిసిందే. మైదానంలో అద్భుతంగా క్యాచ్‌లు అందుకుంటూ గుర్తింపుతెచ్చుకున్నాడు. ఐపీఎల్ కెరీర్‌లో మొత్తం 93 క్యాచ్‌లను అందుకున్నాడు విరాట్. ఈ మెగా టోర్నీలో రోహిత్ శర్మ(97) తర్వాత అత్యధిక క్యాచ్‌లు అందుకున్న రెండో ప్లేయర్‌గా ఘనత సాధించాడు. ఇంకో 7 క్యాచ్‌లు పడితే 100 క్యాచ్‌ల క్లబ్‌లో చేరిపోతాడు. ఇప్పటి వరకు వందకు పైగా క్యాచ్‌లతో సురేష్ రైనా(109), కీరన్ పోలార్డ్(103) ముందున్నారు.

అత్యధిక ఐపీఎల్ సెంచరీలు..

2016 వరకు కూడా ఐపీఎల్‌లో ఒక్కటంటే ఒక్క సెంచరీ కూడా చేయని విరాట్ కోహ్లీ.. ఆ సీజన్‌లో ఏకంగా నాలుగు శతకాలతో మోత మోగించాడు. ఆ తర్వాత 2019లో కోల్‌కతాపై మరో సెంచరీ చేసి ఈ టోర్నీలో అత్యధిక శతకాలు సాధించిన రెండో ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆరు సెంచరీలతో క్రిస్ గేల్.. కోహ్లీ కంటే ముందున్నాడు. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ ఈ సీజన్‌లో ఈ రికార్డును అధిగమిస్తాడని అభిమానులు నమ్మకంతో ఉన్నారు.

ఐపీఎల్‌లో 7 వేల పరుగుల రికార్డు..

ఇప్పటి వరకు ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. అతడు మొత్తం 223 మ్యాచ్‌ల్లో 6,624 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో ఇంకో 376 పరుగులు చేస్తే కోహ్లీ 7 వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. దీంతో ఐపీఎల్‌లో 7 వేల పరుగుల మార్కును అందుకున్న తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టిస్తాడు. 2021లో కోహ్లీ 6 వేల పరుగుల మార్కును అందుకున్నాడు. విరాట్ తర్వాత ఐపీఎల్‌లో అత్యధిక పరుగుల రికార్డు శిఖర్ ధావన్ పేరిట ఉంది. అతడు 6,244 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.

WhatsApp channel