Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ ఈసారైనా గాడిలో పడతారా.. టీమ్ బలాబలాలు ఎలా ఉన్నాయంటే..-sunrisers hyderabad strengths and weaknesses ahead of ipl 2023 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ ఈసారైనా గాడిలో పడతారా.. టీమ్ బలాబలాలు ఎలా ఉన్నాయంటే..

Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ ఈసారైనా గాడిలో పడతారా.. టీమ్ బలాబలాలు ఎలా ఉన్నాయంటే..

Hari Prasad S HT Telugu
Mar 30, 2023 02:36 PM IST

Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ ఈసారైనా గాడిలో పడతారా? ఆ టీమ్ బలాబలాలు ఎలా ఉన్నాయి? గత సీజన్ లో 8వ స్థానంతో సరిపెట్టుకున్న ఆ టీమ్.. గత వేలంలో కొందరు కీలకమైన ప్లేయర్స్ ను తీసుకొని కాస్త పటిష్ఠంగా కనిపిస్తోంది.

ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ప్రాక్టీస్
ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ప్రాక్టీస్

Sunrisers Hyderabad: ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జర్నీ ఓ రోలర్ కోస్టర్ లాగా ఉంది. 2016లో ఛాంపియన్ గా నిలిచిన ఈ టీమ్.. గత రెండు సీజన్లలో కనీసం ప్లేఆఫ్స్ కూడా వెళ్లలేకపోయింది. గతేడాది 8వ స్థానంతో సరిపెట్టుకుంది. నిజానికి అంతకుముందు వరుసగా ఐదు సీజన్లపాటు సన్‌రైజర్స్ టాప్ 4లో ఉండటం విశేషం.

గత సీజన్ కు ముందు వార్నర్ ను వదిలేయడం, సీజన్ తర్వాత కెప్టెన్ కేన్ విలియమ్సన్ నూ రిలీజ్ చేయడంతో ఇద్దరు స్టార్ ప్లేయర్స్ దూరయ్యారు. అయితే గతేడాది చివర్లో జరిగిన మినీ వేలంలో కొందరు కీలక ఆటగాళ్లను సొంతం చేసుకున్న ఆ టీమ్.. ఇప్పుడు బ్యాలెన్స్‌డ్ గా కనిపిస్తోంది.

కొత్త కెప్టెన్ ఏడెన్ మార్‌క్రమ్ సౌతాఫ్రికా లీగ్ లో సన్ రైజర్స్ కే చెందిన ఈస్టర్న్ కేప్ ను విజేతగా నిలపడంతో అతనిపై భారీ ఆశలే ఉన్నాయి. ఇక వేలంలో హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్ లాంటి ప్లేయర్స్ ను కొనుగోలు చేసి మరింత పటిష్ఠంగా మారింది. ఈ నేపథ్యంలో ఆ టీమ్ బలాబలాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

సన్‌రైజర్స్ బలాలు

బ్యాటింగే సన్‌రైజర్స్ ప్రధాన బలంగా చెప్పొచ్చు. హ్యారీ బ్రూక్, మయాంక్ రాకతో ఆ టీమ్ మిడిలార్డర్ బలోపేతమైంది. రాహుల్ త్రిపాఠీ, క్లాసెన్, అబ్దుల్ సమద్ లాంటి హిట్టర్లతోపాటు కెప్టెన్ ఏడెన్ మార్‌క్రమ్ బ్యాటింగ్ లో కీలకపాత్ర పోషించనున్నారు. ఇక ఆల్ రౌండర్ వాష్టింగన్ సుందర్ అదనపు బలం. ఆ లెక్కన 8వ నంబర్ వరకూ సన్ రైజర్స్ బ్యాటింగ్ బలంగా ఉందని చెప్పొచ్చు.

సన్‌రైజర్స్ బలహీనతలు

సన్ రైజర్స్ ప్రధానంగా పవర్ ప్లే బ్యాటింగ్, డెత్ బౌలింగ్ లలో బలహీనంగా కనిపిస్తోంది. ఓపెనర్లు మయాంక్, అభిషేక్ ల స్ట్రైక్ రేట్ మరీ గొప్పగా లేదు. అభిషేక్ 131తో పరుగులు చేస్తే మయాంక్ స్ట్రైక్ రేట్ కేవలం 121 మాత్రమే. ఈ విషయంలో ఆ టీమ్ కాస్త దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

ఇక డెత్ బౌలింగ్ లో భువనేశ్వర్ మునుపటి వాడివేడి లేకపోవడం, ఉమ్రాన్, మార్కో జాన్సెన్ లకు తగినంత అనుభవం లేకపోవడంతో భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. ఈ విషయంలో ఆ టీమ్ నటరాజన్ పై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది.

ఈ ప్లేయర్స్ కీలకం

సన్ రైజర్స్ ఈసారి కొందరు ప్లేయర్స్ పై భారీ ఆశలే పెట్టుకుంది. సౌతాఫ్రికా లీగ్ లో తమ టీమ్ ఈస్టర్న్ కేప్ ను విజేతగా నిలిపిన ఏడెన్ మార్‌క్రమ్ ఇక్కడా ఆ మ్యాజిక్ రిపీట్ చేయాలని కోరుకుంటోంది. అతడు కెప్టెన్ గానే కాదు బ్యాటింగ్, బౌలింగ్ లలోనూ రాణించాడు. గత ఐపీఎల్ సీజన్ లోనూ సన్ రైజర్స్ తరఫున మార్‌క్రమ్ 381 రన్స్ చేశాడు.

ఇక వేలంలో ఏకంగా రూ.13.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన హ్యారీ బ్రూక్ ఈసారి సన్ రైజర్స్ కు అతి పెద్ద బలం. ఇంగ్లండ్ టెస్ట్ టీమ్ మిడిలార్డర్ లో సంచలనాలు నమోదు చేసిన అతడు టాప్ ఫామ్ లో ఉండటం సన్ రైజర్స్ కు కలిసి వచ్చేదే. అతనితోపాటు వేలంలోనే కొనుగోలు చేసిన సౌతాఫ్రికా బ్యాటర్ క్లాసెన్ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు.

ఇక ఉమ్రాన్ మాలిక్ పై గత కొన్ని సీజన్లుగా సన్ రైజర్స్ ఎంతో నమ్మకం ఉంచింది. అందుకు తగినట్లే గతేడాది అతడు చెలరేగాడు. 14 మ్యాచ్ లలో 22 వికెట్లు తీసి టీమిండియాలోకి ఎంపికయ్యాడు. అదే ఫీట్ ఈసారి కూడా రిపీట్ చేయాలని ఉమ్రాన్ భావిస్తున్నాడు. నిలకడగా గంటకు 150 కి.మీ. వేగంతో బౌలింగ్ చేసే ఉమ్రాన్.. సన్ రైజర్స్ బౌలింగ్ భారాన్ని మోయనున్నాడు.

సంబంధిత కథనం