Watson on Warner: వార్నర్‌ను వదులుకుని సన్‌రైజర్స్ పెద్ద తప్పు చేసింది.. షేన్ వాట్సన్ స్పష్టం
Watson on Warner: డేవిడ్ వార్నర్‌ను వదులుకుని సన్ రైజర్స్ హైదరాబాద్ పెద్ద తప్పు చేసిందని దిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్ స్పష్టం చేశాడు. అతడో గొప్ప నాయకుడని ప్రశంసించాడు.
Watson on Warner: డేవిడ్ వార్నర్.. ప్రస్తుతం ఈ సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. తన ఆటతీరుతో మైదానంలో సంచలనాలు రేపే వార్నర్.. కెరీర్‌లో ఎన్నో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు. ముఖ్యంగా ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. సన్‌రైజర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి ఆ జట్టును ఛాంపియన్‌గానూ నిలిపాడు. అలాంటి వార్నర్‌ను సన్‌రైజర్స్ జట్టు వదులుకోవడంపై ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్, దిల్లీ అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్ స్పందించాడు. డేవిడ్ వార్నర్‌ను వదులుకు సన్‌రైజర్స్ పెద్ద తప్పు చేసిందని అన్నాడు.
"వార్నర్ నాయకుడిగా తన జట్టు కోసం నిలబడటమే కాకుండా తన లాగే ఆధిపత్యం చెలాయించడానికి అదనపు స్ఫూర్తి ఇస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. డేవ్ ఐపీఎల్‌లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. సన్‌రైజర్స్‌తో మూడు, నాలుగు మ్యాచ్‌ల్లో విఫలమై ఉండవచ్చు. అంతమాత్రాన అతడిని వదులుకుని హైదరాబాద్ పెద్ద తప్పు చేసింది." అని షేన్ వాట్సన్ అన్నాడు.
రెగ్యూలర్ కెప్టెన్ రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో ఈ సీజన్‌కు అందుబాటులో ఉండట్లేదు. దీంతో అతడి స్థానంలో వార్నర్‌ను సారథిగా నియమించింది దిల్లీ జట్టు. అయితే వార్నర్‌కు కెప్టెన్సీ కొత్తేమి కాదు. గతంలో అతడు సన్‌రైజర్స్‌కు నేతృత్వం వహించి 2016లో ఆ జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు.
2021 సీజన్‌లో కొన్ని మ్యాచ్‌ల్లో అతడు పేలవమైన ప్రదర్శన చేయడంతో హైదరాబాద్ జట్టు అతడిని తప్పించింది. దీంతో 2022 వేలంలో దిల్లీ క్యాపిటల్స్ వార్నర్‌ను సొంతం చేసుకుంది. ఆ సీజన్‌లో 150 కంటే ఎక్కువ స్ట్రైక్ రేటుతో 432 పరుగులు చేశాడు వార్నర్. అంతేకాకుండా ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో డేవిడ్ భాయ్ మూడో స్థానంలో ఉన్నాడు. అతడి కంటే ముందు విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ ఉన్నారు.