Suryakumar Yadav: సూర్యకుమార్ ఓ అద్భుతం.. బెస్ట్ టీ20 ప్లేయర్.. వాట్సన్ స్పష్టం
టీమిండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ ప్రపంచంలోనే ఐదుగురు అత్యుత్తమ ఆటగాళ్ల జాబితాను రూపొందించాడు. తన జాబితాలో సూర్యకుమార్ యాదవ్‌కు చోటు కల్పించాడు. రానున్న టీ20 ప్రపంచకప్‌లో అతడు సత్తా చాటుతాడని స్పష్టం చేశాడు.
టీమిండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ నైపుణ్యం, ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియన్ 360 డిగ్రీల ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న ఇతడు తన బ్యాటింగ్‌తో అదిరిపోయే ప్రదర్శన చేస్తున్నాడు. ముఖ్యంగా టీ20ల్లో అదరగొడుతున్నాడు. ఫలితంగా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో రెండో స్థానాన్ని కైవసం చేసుకున్న ఇతడిపై పలువురు మాజీలు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ కూడా చేరిపోయాడు. ప్రపంచంలోనే ఐదుగురు అత్యుత్తమ టీ20 ఆటగాళ్లలో సూర్యకుమార్ యాదవ్ ఒకడని కితాబిచ్చాడు.
"సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా ఆడుతున్నాడు. ప్రపంచంలోనే ఐదుగురు అత్యుత్తమ టీ20 క్రికెటర్లలో అతడు తప్పకుండా ఉంటాడు. అతడు నేను ఎంచుకునే రెండో ఆటగాడు. నా అభిప్రాయ ప్రకారం బాబర్ అజామ్ తొలి స్థానంలో ఉంటాడు. ఎందుకంటే అతడు టీ20ల్లోనే నెంబర్ వన్ ఆటగాడు. షాహిన్ అఫ్రిదీ ఐదో స్థానంలో ఉన్నాడు. అఫ్రిదీ వికెట్ టేకింగ్ తీసే నైపుణ్యం ప్రత్యేకంగా ఉంటుంది. గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో అత్యుత్తమ బ్యాటర్ల వికెట్లను సునాయసంగా తీయగలిగాడు." అని షేన్ వాట్సన్ అభిప్రాయపడ్డాడు.
డేవిడ్ వార్నర్, జాస్ బట్లర్ ఎంచుకుని తన బెస్ట్ టీ20 ఆటగాళ్లు జాబితాను పూర్తి చేశాడు వాట్సన్. వార్నర్ ఐపీఎల్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చాడని, గతేడాది టీ20 ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడని స్పష్టం చేశాడు. జాస్ బట్లర్ గురించి మాట్లాడుతూ.. ఈ ఏడాది జరిగే పొట్టి ప్రపంచకప్‌లో బట్లర్ విధ్వంసం కొనసాగుతుందని, అతడు పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తాడని కితాబిచ్చాడు.
అక్టోబరులో టీ20 ప్రపంచకప్ 2022 జరగనుంది. అక్టోబరు 16 నుంచి నవంబరు 13 మధ్య కాలంలో ఈ టోర్నీని నిర్వహించనున్నారు. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్(MCG) వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. గతేడాది జరిగిన పొట్టి ప్రపంచకప్‌లో విరాట్ కెప్టెన్సీలో గ్రూప్ దశలోనే టీమిండియా నిష్క్రమించింది. ఈ సారి ఎలాగైనా తిరిగి పుంజుకుని సత్తా చాటాలని భావిస్తోంది.
సంబంధిత కథనం